జిల్లాల పునర్విభజన; ద్వారకాతిరుమలపైనే అందరి దృష్టి

26 Feb, 2022 18:54 IST|Sakshi

జిల్లాల పునర్విభజనలో అభ్యంతరాలపై చర్చ 

మార్పులు, చేర్పుల వినతుల పరిశీలన 

ఏలూరు (మెట్రో): ‘మీది ఏ జిల్లా.. మీ జిల్లాకు ఏది ప్రాధాన్యం.. మా జిల్లా కేంద్రంగా మా పట్టణమే ఉంది..’ ఇవీ ప్రస్తుతం జిల్లాలో వినిపిస్తున్న మాటలు. జిల్లా కేంద్రాలు, వసతులపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన, మార్పులు అంశాలపై ఇటీవల అమరావతిలో జిల్లా అధికారులు చర్చించారు. జిల్లా ప్రజల వినతులపై సాధ్యాసాధ్యాలను రాష్ట్ర అధికారులకు వివరించారు.  

నాలుగు జిల్లాల అధికారులు 
అమరావతిలో జిల్లాల విభజన, వినతులపై కీలకంగా చర్చించారు. కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, నాలుగు జిల్లాల అధికారులతో పాటు రాష్ట్ర సర్వే రికార్డుల కమిషనర్‌ సిద్ధార్థ జైన్, రాష్ట్ర ప్రణాళికాశాఖ కమిషనర్‌ విజయకుమార్‌ పాల్గొన్నారు. జిల్లాల విభజనలపై వచ్చిన వినతులపై కూలంకషంగా చర్చించారు.  

చిన వెంకన్న క్షేత్రంపై సుదీర్ఘంగా..
జిల్లాలో వచ్చిన వినతుల్లో ప్రధానంగా ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో ఉంచాలనే ప్రతిపాదనపై సుదీర్ఘంగా చర్చించారు. వాస్తవానికి భీమవరం జిల్లాకు మావుళ్లమ్మ ఆలయం, క్షీరారామలింగేశ్వర ఆలయం వంటి ప్రధాన దేవస్థానాలు ఉన్నాయనీ అయితే ఏలూరు జిల్లాకు మాత్రం ప్రధాన ఆలయం ఏమీ లేదని, చినవెంకన్న దేవస్థానం ఉండేలా ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో కలపాలనే వాదన బలంగా ఉందని రాష్ట్ర కమిటీకి నివేదించారు. ఇప్పటివరకూ పశ్చిమగోదావరిలో ఉన్న ద్వారకాతిరుమల మండలాన్ని రాజమండ్రి కేంద్రంగా ఏర్పడే తూర్పుగోదావరి జిల్లాలో కలపడాన్ని జిల్లావాసులు వ్యతిరేకిస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఏలూరు కేంద్రానికి ద్వారకాతిరుమల 30 కిలోమీటర్ల దూరంలో ఉండటం, ఆర్థికంగా ఏలూరు జిల్లాకు వనరుగా ఉండటం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.  

నరసాపురం కేంద్రం కోసం.. 
నరసాపురం కేంద్రంగా జిల్లాను మార్పు చేయాలనే ప్రతిపాదనపైనా చర్చ జరిగింది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. అలాగే పోలవరం జిల్లా ప్రతిపాదన సైతం చర్చల్లో ప్రధాన అంశంగా నిలిచింది. రంపచోడవరం, పోలవరం నియోజకవర్గంలోని గిరిజన గ్రామాలను జిల్లాగా చేసే అంశాలను చర్చించారు. ఆయా ప్రాంతాల మధ్య దూరం, గిరిజనుల ఇబ్బందులు, వెసులుబాటు వంటి అంశాలపై రాష్ట్ర కమిటీకి జిల్లా అధికారులు నివేదించారు. 
 
వినతుల పెట్టె 
ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లాల విభజనలపై వచ్చే వినతులు స్వీకరించేందుకు ప్రత్యేకించి ఒక బాక్సును ఏర్పాటుచేశారు. ఆయా వినతులను కలెక్టర్‌ ఆధ్వర్యంలో జాయింట్‌ కలెక్టర్‌ అంబేడ్కర్, పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో ప్రతిరోజూ పరిశీలించి ప్రత్యేక నోట్‌ను తయారు చేస్తున్నారు. ఈ నోట్‌లోని అంశాలను రాష్ట్ర కమిటీకి వివరిస్తున్నారు. తుది నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు