AP: పర్యాటకానికి కొత్త సొబగులు 

13 Mar, 2022 07:57 IST|Sakshi

పర్యాటక ప్రదేశాల్లో 991.36 ఎకరాల్లో రిసార్టులు, రెస్టారెంట్లు, ఫుడ్‌ కోర్టుల నిర్మాణం

జల, సాహస క్రీడలకూ ఏర్పాట్లు   ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలు కొత్త సొబగులు సంతరించుకోనున్నాయి. జల, సాహస క్రీడలు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఖాళీగా ఉన్న పర్యాటక శాఖ స్థలాలను అభివృద్ధి చేయడం ద్వారా వాడుకలోకి తెచ్చి ఆదాయాన్ని పెంచే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీనివల్ల పర్యాటక స్థలాలను ఆక్రమణల నుంచి రక్షించడమే కాకుండా పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. 

జల, సాహస క్రీడల్లోనూ.. 
జల క్రీడలను ప్రోత్సహించేందుకు 12 ప్రాంతాల్లో పీపీపీ విధానంలో టెండర్లు పిలిచారు. వీటిలో రిషికొండ, రాజమండ్రి, దిండి, పాశర్లపూడి, భవానీ ద్వీపం, నాగార్జున సాగర్, సూర్యలంక బీచ్, గుండ్లకమ్మ, శ్రీశైలం, జార్జియాపురం, నెల్లూరు ట్యాంక్, బ్రహ్మసాగరం వంటి ప్రాంతాల్లో బోటింగ్‌ నిర్వహణకు అవకాశం కల్పించనున్నారు. హార్సిలీహిల్స్, గండికోట, లంబసింగి, అరకు ప్రాంతాల్లో ట్రెక్కింగ్, రాక్‌క్లైంబింగ్‌ వంటి సాహస క్రీడలకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. తాటిపూడి, కళింగపట్నం, కాకినాడ, బెరంపార్క్, మైపాడు, తుమ్మలపెంట, బీవీ పాలెంలో బీచ్‌ ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తారు. ఓర్వకల్లు రాక్‌ గార్డెన్‌లోనూ మౌలిక వసతులను మెరుగుపరుస్తారు. 

పర్యాటక హబ్‌గా ఏపీ 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. ఇందులో భాగంగా పర్యాటక శాఖకు చెందిన ఖాళీ స్థలాలను పబ్లిక్, ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేయనున్నాం. అవకాశం ఉన్న ప్రతిచోట పర్యాటకులకు మౌలిక వసతులను మెరుగుపరుస్తాం. హిల్‌ స్టేషన్లు, బ్యాక్‌ వాటర్‌ ప్రాంతాల్లో సాహస క్రీడలను అందుబాటులోకి తీసుకొస్తాం. 
    – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి 

పర్యాటక స్థలాలు ఎన్నో..
రాష్ట్రంలో విలువైన పర్యాటక స్థలాలు ఎన్నో ఉన్నాయి. వాటిని అన్యాక్రాంతం కాకుండా కాపాడటంతో పాటు వాడుకలోకి తీసుకొస్తున్నాం. ఔత్సాహిక పెట్టుబడుదారుల ఆసక్తికి అనుగుణంగా అభివృద్ధి అంశాల ప్రాతిపదికన టెండర్లు పిలిచాం.  
– ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, చైర్మన్, ఏపీటీడీసీ  

991.36 ఎకరాల్లో అభివృద్ధి 
రాష్ట్ర వ్యాప్తంగా 991.36 ఎకరాల పర్యాటక స్థలాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఔత్సాహిక పెట్టుబడిదారుల నుంచి అభిప్రాయాలను సేకరించి వాటికి అనుగుణంగా టెండర్లు పిలవనున్నారు. పర్యాటక ప్రణాళికలో భాగంగా పాడేరు, లంబసింగి, కడియపులంక, పట్టిసీమ, ఏలేశ్వరం, దిండి వంటి నేచర్, బ్యాక్‌ వాటర్‌ ప్రాంతాల్లో పీపీపీ విధానంలో మరిన్ని రిసార్టులు, రెస్టారెంట్లు, బోటింగ్‌ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లోని స్థలాల్లో బీచ్‌లను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యం ఇస్తారు. నెల్లూరు ఎకో పార్క్, గండికోట, లేపాక్షిలో వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహించనున్నారు. ప్రయాణ పర్యాటకుల కోసం రోడ్ల వెంబడి వసతుల కల్పనలో భాగంగా డార్మెటరీలు, ఫుడ్‌ కోర్ట్స్, కాఫీ షాప్స్, పెట్రోల్‌ బంకులను ప్రైవేటు వ్యక్తుల సహాయంతో ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని వార్తలు