ఆధునిక టెక్నాలజీతో..  కొత్త ఫ్లైఓవర్‌

15 Sep, 2022 12:58 IST|Sakshi

అత్యాధునిక టెక్నాలజీతో ఇప్పటి వరకు మహానగరాల్లోనే నిర్మించిన విధంగా నెల్లూరు నగరంలో ఫ్లైఓవర్‌ నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే నగరంలో వెంకటేశ్వరపురం, ఆత్మకూరు బస్టాండ్, అయ్యప్పగుడి ప్రాంతాల్లో మూడు ఫ్లై ఓవర్లు ఉన్నాయి. తాజాగా మినీబైపాస్‌లో హరనాథపురం సర్కిల్‌లో నాల్గో ఫ్లై ఓవర్‌ నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ ఫ్లై ఓవర్‌ గతంలో నిర్మించిన మూడింటి కంటే సెంటర్‌ స్పాన్‌లు ప్రీ్రస్టెస్‌ గడ్డర్లు టెక్నాలజీతో విభిన్నమైందిగా చెప్పుకోవచ్చు. 

నెల్లూరు (బారకాసు): నగరంలోని ముత్తుకూరురోడ్డులో రామలింగాపురం కూడలి వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ మార్గంలో నాలుగు వైపులా వాహనాల రాకపోకలను రెండు రోజుల నుంచి నిలిపివేసి పనులు వేగవంతం చేశారు. ఇప్పటికే కీలకమైన పిల్లర్ల నిర్మాణం పూర్తికావడంతో గడ్డర్ల నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రధానంగా ఫ్లై ఓవర్‌కు రెండు వైపులా ఎర్త్‌ వర్క్‌ పనులు ముమ్మరం చేశారు. నెల్లూరు నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. అందులో భాగంగా జనాభా సంఖ్య కూడా పెరగడంతో పాటు వాహనాల రాకపోకలు అధికమవుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడడం కారణంగా వాహనదారులు తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని గుర్తించిన నగర ఎమ్మెల్యే డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌ మంత్రిగా ఉన్న సమయంలో ట్రాఫిక్‌ ఇబ్బందులను తొలగించేందుకు ఫ్లై ఓవర్‌  నిర్మాణం కోసం చొరవ తీసుకున్నారు. సంబంధిత అధికారులతో చర్చించి ఫ్లై ఓవర్‌  నిర్మాణం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ప్రభుత్వం కేంద్రం నుంచి ఫ్లై ఓవర్‌  నిర్మాణం మంజూరు చేయించి అవసరమైన నిధులు కూడా విడుదల చేయించింది. 

కరోనాతో పనులు ఆలస్యం  
2020 ఆగస్టులో రూ.41.88 కోట్ల అంచనాలతో ఫ్లై ఓవర్‌  నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నిర్మాణ పనులు 2022 ఆగస్టు కల్లా పూర్తయ్యేలా అధికారులు ప్రణాళికలు రూపొందించి ఆ దిశగా అడుగులు ముందుకేశారు. అయితే ఓవైపు కరోనా, మరో వైపు వర్షాలు కారణంగా నిర్మాణ పనులు నెమ్మదిగా జరిగే పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఫ్లై ఓవర్‌  నిర్మాణ పనులను జరిగేలా తగు చర్యలు తీసుకున్నారు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ పనులను పూర్తి చేసేందుకు మరో ఆరో నెలలు పొడిగింపునకు అనుమతి ఇచ్చింది. 2023 ఫిబ్రవరి కల్లా పూర్తి చేసేలా ఇటు అధికారులకు, అటు కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇటీవల ఫ్లై ఓవర్‌  నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఫ్లై ఓవర్‌ నిర్మాణ పూర్తికి మరో ఐదు నెలలు గడువు ఉన్నప్పటికీ అధికారులు మరో మూడు నెలల్లోపు పూర్తి చేయాలనే ప్రయత్నంతో పనుల్లో వేగాన్ని పెంచారు.

 

ఆధునిక టెక్నాలజీతో..  
రామలింగాపురం కూడలిలో జరుగుతున్న ఫ్లై ఓవర్‌  మొట్టమొదటి సారిగా మహానగరాల్లో నిర్మించిన ఆధునిక టెక్నాలజీ తరహాలో  నిర్మిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఇటువంటి టెక్నాలజీతో ఫ్లై ఓవర్‌ వంతెనల నిర్మాణం జరగలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఫ్లై ఓవర్‌ టెక్నాలజీతో మహానగరాలైన హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లోనే జరిగాయి. ఈ వంతెన పొడవు 810 మీటర్లు. 10 పిల్లర్లు ఆధారంతో వంతెనను నిర్మిస్తున్నారు. ఒక పిల్లర్‌కు మరో పిల్లర్‌కు మధ్యలో (సెంటర్‌ స్పాన్‌) భీమ్‌లను డయాఫ్రంభీమ్‌లో అమర్చుతున్నారు. ఈ సెంటర్‌ స్పాన్‌లు ప్రీ్రస్టెస్‌ గడ్డర్లు టెక్నాలజీతో 9 అడుగుల ఎత్తు, 100 అడుగుల పొడవుతో ఏర్పాటు చేయడం విశేషం. ఈ వంతెన నిర్మాణం పూర్తితో త్వరలో ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్‌ ఇక్కట్లు తొలగిపోనున్నాయి. 

త్వరతగతిన పూర్తికి చర్యలు
నగరంలోని రామలింగాపురం సెంటర్‌లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్‌ త్వరతిగతిన పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాం. 2023 ఫిబ్రవరి కల్లా వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వీలైనత త్వరగా మరో మూడు నెలల్లో పూర్తి చేసేలా పనులు వేగవంతంగా జరిపిస్తున్నాం. త్వరతిగతిన వంతెన నిర్మాణం పూర్తికి మాజీ మంత్రి డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. 
 – అనిల్‌కుమార్‌రెడ్డి, డీఈఈ, ఎన్‌హెచ్‌ విభాగం, ఏపీ ఆర్‌అండ్‌బీ శాఖ   

మరిన్ని వార్తలు