1,771 ఆలయాలకు కొత్త పాలక మండళ్లు

10 Oct, 2021 03:43 IST|Sakshi

ప్రభుత్వం, దేవదాయ శాఖ కసరత్తు

ఆలయాల వారీగా నియామకానికి నోటిఫికేషన్ల జారీ 

మరో 1,995 ఆలయాలకు కూడా త్వరలో నియామకాలు 

మొత్తంగా 26 వేల మందికి పైగా చోటు దక్కే అవకాశం

ఇప్పటికే 715 ఆలయాల్లో నియామకాల పూర్తి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 1,771 ఆలయాలకు కొత్త పాలక మండళ్ల నియామకానికి ప్రభుత్వం, దేవదాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఆయా ఆలయాలకు కొత్త పాలక మండళ్ల నియామకానికి సంబంధించి దేవదాయ శాఖ ఇప్పటికే ఆలయాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసింది. తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లోనే 400 పైగా ఆలయాల చొప్పున ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్టు దేవదాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. సాధ్యమైనంత వేగంగా పాలక మండళ్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తాజాగా దేవదాయ శాఖకు సూచించినట్టు సమాచారం.

ఈ శాఖ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 24,622 ఆలయాలు ఉండగా.. అందులో 4,481 ఆలయాలకు మాత్రమే పాలక మండళ్ల ఏర్పాటు ఆనవాయితీగా కొనసాగుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అందులో 715 ఆలయాలకు ప్రభుత్వం, దేవదాయ శాఖ పాలక మండళ్ల నియామక ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసింది. ఇప్పుడు నోటిఫికేషన్లు జారీ అయ్యి.. ప్రక్రియ కొనసాగుతున్న 1,771 ఆలయాలతో పాటు ఇంకా 1,995 ఆలయాలకు కూడా పాలక మండళ్ల నియామకానికి అవకాశం ఉంది.

వాటిలో న్యాయపరంగా చిక్కులున్న ఆలయాలు మినహా మిగిలిన అన్ని చోట్ల కొత్త పాలక మండళ్ల నియామకానికి కూడా దేవదాయ శాఖ కసరత్తు చేస్తోంది. పాలక మండళ్ల నియామకానికి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ అయిన ఆలయాలతో పాటు నోటిఫికేషన్ల జారీకి అవకాశం ఉన్న ఆలయాలతో కలిపి మొత్తం 3,766 ఆలయాల దాకా పాలక మండళ్ల నియామకానికి అవకాశం ఉంది. తద్వారా దాదాపు 26 వేల మందికి పైగా చోటు దక్కే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు వివరించాయి.  

మరిన్ని వార్తలు