సీఎం జగన్‌ నాయకత్వంలో అగ్రగామిగా ఏపీ 

25 Feb, 2023 03:16 IST|Sakshi
గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో ప్రమాణం చేయిస్తున్న సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా

ప్రజలను ఉద్దేశించి నూతన గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ తొలి ప్రసంగం

సాక్షి, అమరావతి: యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్ర­గామిగా నిలుస్తుందని నూతన గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ ఆధారిత అభివృద్ధి, వృద్ధిరేటు పెరుగుదల రానున్న రోజుల్లోనూ ఇలాగే కొనసాగుతాయని ఆశిస్తున్నానన్నారు. ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ విధానంలో రూ.1.82 లక్షల కోట్లను పారదర్శకంగా పంపిణీ చేసిందని తనకు తెలిసిందన్నారు.

వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారని ప్రశంసించారు. ప్రభుత్వ సేవలు, పథకాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లి ప్రభుత్వం వినూత్న సంస్కరణలను తెచ్చిందని అభినందించారు.

అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌ సమీప భవిష్యత్‌లోనే అన్ని వృద్ధి సూచీల్లో దేశంలోనే మొదటి స్థానాన్ని సాధిస్తుందని ఆకాంక్షించారు. ఈ మేరకు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి దూరదర్శన్‌ సప్తగిరి చానల్‌ ద్వారా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ శుక్రవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. 

ఏపీది గొప్ప సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం 
గొప్ప సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం ఏపీకి ఉంది. గవర్నర్‌గా సేవ చేసే అవకాశం దక్కినందుకు గర్వంగా, గౌరవంగా భావిస్తున్నా. నా సొం­త రాష్ట్రం కర్ణాటక.. ఏపీతో ఎన్నో అంశాల్లో అవినాభావ సంబంధం కలిగి ఉంది. భౌగోళికంగా పక్కపక్కనే ఉండటంతోపాటు రెండు రాష్ట్రాలు ప్రధానంగా వ్యవసాయాధారితమైనవి.

తెలుగు భాష పట్ల అవ్యాజ్యమైన మక్కువ కలిగిన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భోజుడుగా వాసికెక్కారు. ఎంతోమంది తెలుగు ప్రముఖులను ఆయన తన సామ్రాజ్యంలో కీలక స్థానాల్లో నిలిపారు. అంతేకాకుండా తన ఆస్థానంలో కవులుగా స్థానం కల్పించారు.  
 
స్వాతంత్య్రోద్యమంలో ఏపీ కీలక భూమిక.. 
మహాత్మాగాంధీ పిలుపును అందుకుని స్వాతంత్య్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్‌ కీలక భూమిక పోషించింది. చీరాల–పేరాల ఉద్యమం, అల్లూరి సీతారామరాజు నిర్వహించిన రంపా తిరుగుబాటు ఏపీలో కీలక ఘట్టాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో తెలుగు ప్రజల చిరకాల డిమాండ్‌ అయిన ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది.

ఘనమైన సాంస్కృతిక, సంప్రదాయ వారసత్వ సంపద కలిగిన ప్రముఖ దేవాలయాలకు నిలయంగా ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకులు, భక్తులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తోంది. 
 
అపార ఖనిజ సంపదకు నిలయం 
బొగ్గు, లైమ్‌స్టోన్, బాక్సైట్‌ తదితర అపార ఖనిజాలకు ఏపీ నిలయం. గోదావరి, కృష్ణా, పెన్నా పరివాహక ప్రదేశాలతో, సారవంతమైన భూములతో పటిష్ట సాగునీటి వ్యవస్థను కలిగి ఉంది. వరి ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ అగ్ర రాష్ట్రంగా గుర్తింపు పొందింది. దేశ తూర్పుతీరంలో అత్యధికంగా 974 కి.మీ.తీరరేఖను కలిగి ఉంది.

మూడు కేంద్రీయ, 4 డీమ్డ్, 5 ప్రైవేటు, 25 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 20 అటానమస్‌ విద్యా సంస్థలతో ఏపీ ఎడ్యుకేషన్‌ హబ్‌గా గుర్తింపు పొందింది. కాగా రాష్ట్రం గురించి మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చెప్పిన మాటలను ఉటంకిస్తూ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ తన ప్రసంగాన్ని ముగించారు.     

మరిన్ని వార్తలు