చెత్తకు కొత్త రూపుం...వేస్ట్‌ క్రాఫ్ట్‌

29 May, 2022 09:37 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : మనం రోజూ రకరకాల వస్తువులను ఎడాపెడా వాడేస్తుంటాం.. బోలెడన్ని పదార్థాలు తింటూ ఉంటాం. కానీ.. ఎప్పుడైనా చెత్తగురించి ఆలోచించామా.? రోడ్లపై పడేసిన వస్తువులు, సీసాలు, పాత ఎలక్ట్రానిక్‌ సామాన్లు.. ఇలా ఒకటేమిటి.? అన్నీ చెత్తని సృష్టించేవే..? వస్తువూ వస్తువూ పోగై.. కొండంత చెత్తగా మారుతూ ప్రపంచానికే సవాల్‌ విసురుతున్నా.. దాని గురించి మాత్రం ఎప్పుడూ పట్టించుకోం. నగరానికి చెందిన ఓ సంస్థ మాత్రం.. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల.. కాదేదీ పునర్వినియోగానికి అనర్హం అన్నట్లుగా తనదైన శైలిలో వ్యర్థాలకు సరికొత్త అర్థాన్ని చెబుతోంది. జీరో వేస్ట్‌ నినాదంతో నగరంలోని పలు వ్యర్థాలకు కొత్త రూపునిస్తూ.. ప్రజల్ని చైతన్యవంతులను చేస్తోంది. 

చీపురు పుల్లల నుంచి.. వలల వరకూ.. 
గాజువాక ప్రాంతానికి చెందిన గ్రీన్‌ వేవ్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సొల్యూషన్స్‌ సంస్థ.. జీరో వేస్ట్‌ నినాదంతో ముందుకు వెళ్తోంది. అంటే మనం వాడే ప్రతి వస్తువూ ఏదో ఒక విధంగా.. పునర్వినియోగానికి పనికొస్తుందని సంస్థ భావన. కేవలం భావన మాత్రమే కాదండోయ్‌.. ఎలా కొత్త రూపాన్ని ఇచ్చి.. పాత వస్తువును ఉపయోగించగలమో చేసి చూపిస్తోంది. చీపురు పుల్లల నుంచి చిరిగిపోయిన చేపల వలల వరకూ.. కాలిపోయిన వైర్ల నుంచి కొబ్బరి చిప్పల వరకూ.. ప్లాస్టిక్‌ బాటిల్స్‌ నుంచి గాజు సీసాల వరకూ.. ప్రతి వస్తువుకూ కొత్తందం తీసుకొస్తోంది. 

కొబ్బరి చిప్పలతో కళాకృతులు.. 
మనమంతా కొబ్బరి మాత్రమే తీసుకొని.. చిప్పల్ని బయట పడేస్తాం. ఈ గ్రీన్‌వేవ్స్‌ సంస్థ ప్రతినిధులు మాత్రం.. అవి కేవలం చిప్పలు మాత్రమే కాదు.. విభిన్న కళాత్మక వస్తువులకు ప్రతిరూపాలని నిరూపిస్తున్నారు. కొబ్బరి చిప్పలతో కాఫీకప్పులు, కీ చైన్లు.. ఎన్ని రకాలుగా తయారు చేశారు. కొత్తగా వచ్చిన కేజీఎఫ్‌–2 సినిమాకు ప్రతిరూపాన్ని కూడా అచ్చుగుద్దినట్లు తయారు చేసేశారు. అంతేకాదు బుల్లెట్‌ బండి, దేవుళ్ల ప్రతిమలు, వాచీలు, నైట్‌ ల్యాంపులు, ఇలా.. ఎన్నో అలంకరణ వస్తువులు తయారు చేస్తున్నారు.  

(చదవండి: సరదాగా మాట్లాడుకుందామని పిలిచి..)

మరిన్ని వార్తలు