గిరిజనగూడెం.. ‘నాడు–నేడు’తో  శోభాయమానం

23 Aug, 2021 03:36 IST|Sakshi
జగనన్న విద్యాకానుక కిట్లు అందుకుంటున్న మూలిగూడ స్కూలు విద్యార్థులు

ఏజెన్సీ ప్రాంతాల్లోని బడులకు కొత్త అందాలు

గతంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోని వైనం

మొదటి దశలో 1,226 స్కూళ్లలో రూ.312.5 కోట్లతో అభివృద్ధి

కొండ కోనల్లో స్కూళ్లలోనూ అభివృద్ధి పనులు

ఆనందం వ్యక్తం చేస్తున్న గిరిజనులు, పిల్లలు, టీచర్లు

సాక్షి, అమరావతి: వాగు వంకలు.. కొండలు కోనలు గుట్టలు దాటుకొని ఆ గ్రామాలకు మామూలుగా చేరుకోవడమే కష్టం. అటువంటి గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమంతో కళకళలాడుతున్నాయి. దశాబ్దాలుగా ఈ స్కూళ్లను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పశువుల కొట్టాలకన్నా దారుణమైన పరిస్థితులున్నా వాటిని బాగు చేయాలన్న తలంపు ఏనాడూ చేయలేదు. కానీ నేడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మనబడి నాడు–నేడు కార్యక్రమం కింద మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలలను పదిరకాల సదుపాయాలతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది.


సుందరంగా మారిన విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలంలోని నల్లగొండ ఎంపీపీ స్కూల్‌  

రూ.312 కోట్లతో 1,226 గిరిజన పాఠశాలల అభివృద్ధి
రాష్ట్రంలోని మొత్తం 45 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లన్నిటినీ నాడు–నేడు కార్యక్రమం కింద ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీటికి శాటిలైట్‌ ఫౌండేషన్, ఫౌండేషన్‌ స్కూళ్లు కలిపి దాదాపు 57 వేలకు చేరుతున్నాయి. వీటన్నిటినీ పూర్తిస్థాయిలో తీర్చిదిద్దడానికి ప్రభుత్వం రూ.16 వేల కోట్లను ఖర్చుచేస్తోంది. ఇప్పటికే తొలిదశలో 15,715 స్కూళ్లను రూ.3,669 కోట్లతో అభివృద్ధి చేసింది. 7 జిల్లాల పరిధిలో ఉన్న 1,226 గిరిజన స్కూళ్లను తొలిదశ కింద అభివృద్ధి చేశారు. రూ.312.5 కోట్లతో వీటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 

ఏర్పాటు చేసిన సదుపాయాలివీ..
గతంలో చూడడానికే అందవికారంగా, ఎప్పుడు కూలుతాయో అని లోపలకు వెళ్లడానికే భయపడే విధంగా ఉన్న ఈ స్కూళ్లు ఇప్పుడు గిరిజన తల్లిదండ్రులు, పిల్లలను ఆకర్షిస్తున్నాయి. గతంలో స్కూళ్లకు రావడానికి కూడా మారాం చేసే పిల్లలు ఈనెల 16వ తేదీ నుంచి స్కూళ్లు తెరిచిన నేపథ్యంలో వాటివైపు ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు. మరుగుదొడ్లు, అందమైన ఆవరణ, మంచినీటి సదుపాయం, తరగతి గదుల్లో డ్యూయెల్‌ డెస్కులు, టీచర్లకు అనువైన కుర్చీలు, అల్మారాలు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, పాఠశాలల చుట్టూ ప్రహరీతో స్కూళ్లు కళకళలాడుతున్నాయి. పాఠశాల భవనం మొత్తం ఆకర్షణీయమైన రంగులతో, గోడలపై విద్యార్థులకు విజ్ఞానం అందించే చిత్రాలతో తీర్చిదిద్దారు.

విద్యారంగంలో సీఎం కొత్త చరిత్ర సృష్టించారు
రాష్ట్ర విద్యా రంగంలో నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, అమ్మఒడి పథకాలను ప్రవేశపెట్టిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కొత్త చరిత్ర సృష్టించారు. నాడు–నేడు మొదటి దశలో 15,715 ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దారు. పాఠశాలలు ప్రారంభించిన రోజే జగనన్న విద్యాకానుక కిట్ల ద్వారా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, స్కూల్‌ బ్యాగ్, షూస్, బెల్ట్‌ అదనంగా ఆంగ్ల నిఘంటువు పంపిణీ చేయడం విద్యార్థులకు జగనన్న అందించిన వరం.             
– సామల సింహాచలం, ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు

కలలో కూడా ఊహించలేదు
మారుమూల ఎక్కడో ఉన్న మా గ్రామంలోని స్కూలు ఇంత అద్భుతంగా మారుతుందని కలలో కూడా ఊహించలేదు. పాఠశాల అభివృద్ధి పనులు మా కమిటీ చేతనే దగ్గరుండి చేయించారు. మా పిల్లలకు మంచి విద్య అందుతుందన్న భరోసా మాకు కలిగింది. పిల్లలు కూడా ఆనందంగా స్కూలుకు వస్తున్నారు.
– ఎం.భాస్కరరావు, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్, మూలిగూడ, గుమ్మలక్ష్మీపురం మండలం, విజయనగరం జిల్లా.

విద్యార్థులకెంతో అదృష్టం
మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలనే మార్చివేసిన అద్భుత పథకం నాడు–నేడు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన అనే ఆలోచన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి రావడం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అదృష్టంగా భావిస్తున్నాను. పూర్వం ఇటువంటి సదుపాయాలు లేక విద్యార్థులు చాలా బాధలు అనుభవించారు.
– ఆర్‌.నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుడు, కొయ్యూరు, విశాఖపట్నం జిల్లా.

స్కూలుకు వచ్చి బాగా చదువుకోవాలని ఉంది
ఇంతకు ముందు మా స్కూలు అసలు బాగుండేది కాదు. స్కూలుకు రావాలని పించేది కాదు. ఇప్పుడు స్కూలును చూస్తే ఆనందంగా ఉంది. మేము కూర్చొని పాఠాలు వినేందుకు సౌకర్యమైన బెంచీలు, మంచినీరు, మరుగుదొడ్లు అన్నీ ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడు స్కూలు మానకుండా చదువుకోవాలని ఉంది.
– పి.స్వప్న, 5వ తరగతి, మూలిగూడ, విజయనగరం జిల్లా 

మరిన్ని వార్తలు