వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలతో గ్రామాలకు కొత్త కళ

19 Aug, 2021 02:46 IST|Sakshi

రాష్ట్రంలో తొలి దశలో రూ.724 కోట్లతో 4,530 ఏర్పాటు

వర్క్‌ ఫ్రం హోం విధానం బలోపేతమే లక్ష్యం 

ఒక్కో డిజిటల్‌ లైబ్రరీ 690 చదరపు అడుగుల్లో నిర్మాణం

ఇప్పటికే 2,687 డిజిటల్‌ లైబ్రరీలకు స్థలాల గుర్తింపు

సదుపాయాలు, కంప్యూటర్‌ పరికరాల కోసం రూ.140 కోట్లు

డెస్క్‌టాప్‌ టేబుళ్లు, సిస్టం, విజిటర్‌ కుర్చీలు.. ట్యూబ్‌ లైట్లు, ఫ్యాన్లు, ఐరన్‌ ర్యాక్‌లు.. అందుబాటులో వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ 

సాక్షి, అమరావతి: వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో 4,530 గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీ భవనాల నిర్మాణం చేపడుతోంది. ఒక్కో డిజిటల్‌ లైబ్రరీని రూ.16 లక్షల వ్యయంతో 690 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. తొలి దశలో నిర్మాణం చేపట్టే 4,530 డిజిటల్‌ లైబ్రరీలకు రూ.724.80 కోట్లు వ్యయం చేయనున్నారు. ఈ డిజిటల్‌ లైబ్రరీల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం మరో రూ.140 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా.

దశల వారీగా ప్రతీ గ్రామ పంచాయతీలో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గ్రామాలకు మంచి సామర్థ్యం గల ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించడంతో పాటు అక్కడి నుంచే వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు ఆన్‌లైన్‌ ద్వారా విధులు నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించనున్నారు. తొలి దశలో చేపడుతున్న డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాలతో పాటు ఫైబర్‌ నెట్‌ కనెక్టివిటీని డిసెంబర్‌ నెలాఖరు నాటికి కల్పించాలనే లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు. తొలి దశలో చేపట్టే డిజిటల్‌ లైబ్రరీల్లో ఇప్పటికే 2,687 లైబ్రరీల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను గుర్తించారు. మిగతా వాటికి ఈ నెలలోనే స్థలాలను గుర్తించడంతో పాటు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.

డిజిటల్‌ లైబ్రరీల్లో సదుపాయాలు ఇలా..
– మూడు డెస్క్‌ టాపులు, యూపీఎస్, డెస్క్‌టాప్‌ బార్‌ కోడ్‌ ప్రింటర్, స్కానర్, లేజర్‌ ప్రింటర్, సాఫ్ట్‌వేర్, యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్, అన్‌లిమిలెడ్‌ బ్యాండ్‌విడ్త్‌ ఇంటర్నెట్‌ స్టోరేజీకి సంబంధించి డేటా సెంటర్‌ ఏర్పాటు.
– 3 డెస్క్‌ టాప్‌ టేబుళ్లు, సిస్టం, విజిటర్‌ కుర్చీలు.. ట్యూబ్‌ లైట్లు, ఫ్యాన్లు, ఐరన్‌ ర్యాక్‌లు ఉంటాయి. వార్తా పత్రికలు, మేగజైన్లు ఆన్‌లైన్లో అందుబాటులో ఉంటాయి. 
– కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టులతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది.  
– ఎవరైనా సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు సొంత గ్రామాలకు వెళ్లినప్పుడు ఈ డిజిటల్‌ లైబ్రరీల ద్వారా వారి లాప్‌టాప్‌కు కనెక్టయ్యి పని చేసుకునే అవకాశం ఉంటుంది.   

మరిన్ని వార్తలు