‘సాగర’ తోరణాలు

25 Apr, 2021 04:27 IST|Sakshi
తొట్లకొండలోని శిలా తోరణం

సహజ అందాలకు నెలవైన విశాఖకు కొత్త ఆభరణాలు

ఇప్పటికే తొట్లకొండలో పర్యాటకులకు కనువిందు చేస్తున్న శిలాతోరణం

తాజాగా సాగర గర్భంలో మరొకటి గుర్తింపు

వీటిని సంరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటున్న ప్రకృతి ప్రేమికులు  

సాక్షి, విశాఖపట్నం: సహజ అందాలకు నెలవైన విశాఖ సాగర తీరం దేశ, విదేశీ పర్యాటకులను కట్టిపడేస్తుంటుంది. తూర్పు కనుమలు ఓవైపు.. అలల సయ్యాటలు మరోవైపు.. ఇసుక తిన్నెలపై కనువిందు చేసే రాతి దిబ్బల రమణీయత ఇంకొకవైపు.. ఎల్లప్పుడూ సందర్శకుల్ని ఆహ్వానిస్తుంటాయి. ఈ అందాలకు అదనపు ఆకర్షణగా సాగర తీరంలో ఏర్పడిన సహజ శిలా తోరణం.. ప్రతి ఒక్కర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తుంటుంది. ఇప్పుడు అదే విశాఖకు మరో అద్భుతం తోడైంది. సాగర గర్భంలో మరొక శిలా తోరణం బయటపడింది.  

సరికొత్త అనుభూతి..
రాతి శిలా సంపదతో సరికొత్త అనుభూతిని అందించే తొట్లకొండ బీచ్‌కు పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ ప్రాంతంలో ఉన్న సహజ శిలా తోరణం మధ్య నుంచి ఎగసిపడే అలల్ని సందర్శకులు ఆస్వాదిస్తుంటారు. విశాఖ సాగర గర్భంలో ఇటీవల మరో సహజ శిలా తోరణం బయటపడింది. రుషికొండ తీరంలో సాహస క్రీడలు నిర్వహిస్తూ.. స్కూబా డైవింగ్‌ చేసే లివిన్‌ అడ్వెంచర్‌ సంస్థ ప్రతినిధులు దీన్ని కనిపెట్టారు. తీరం నుంచి సాగర గర్భంలోకి 2 కిలోమీటర్ల దూరంలో.. 30 అడుగుల లోతులో.. ఈ రాతి అందం దర్శనమిచ్చింది. ఒక మీటరు ఎత్తు, 150 సెంటీమీటర్ల వెడల్పుతో ఈ శిలా తోరణం ఉన్నట్లు లివిన్‌ అడ్వెంచర్స్‌ ప్రతినిధి బలరాంనాయుడు తెలిపారు. వేల సంవత్సరాల పాటు అలల తాకిడికి రాళ్లు కరిగి ఈ సహజ అందం ఏర్పడిందని భావిస్తున్నారు. దీన్ని తిలకించేందుకు స్కూబా డైవర్లకు అవకాశం కల్పించాల్సిన అవసరముందన్నారు. దీనిపై పర్యాటక శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

సహజ అందాలకు పొంచి ఉన్న ముప్పు..
తొట్లకొండ శిలాతోరణం.. తన సహజత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. యువతీ, యువకులు ఈ శిలా తోరణంపైన చిందులు వేస్తున్నారు. కొందరు ఫొటోలు దిగుతుండగా, మరికొందరు ఏకంగా ద్విచక్ర వాహనాల్ని ఎక్కించేసి ఫొటో షూట్‌లు చేస్తున్నారు. అలల తాకిడికి రాయి కరిగి తోరణంగా ఏర్పడింది. బలహీనంగా ఉండే దీనిపై నిలబడి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే విరిగిపోయే ప్రమాదముందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని సంరక్షించేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

వాహనాలు వెళ్లకుండా చర్యలు
సహజ శిలా తోరణాన్ని కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. స్థానికంగా అక్కడ ఉండే వారిని సంరక్షకులుగా నియమించాం. శిలాతోరణం వద్దకు వాహనాలు వెళ్లకుండా.. రోడ్డు వద్దే నిలిపివేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రకృతి సిద్ధమైన అందాల్ని పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడుతున్నాం. 
– పూర్ణిమాదేవి, జిల్లా పర్యాటక శాఖ అధికారి

సాగర గర్భంలో అద్భుతంగా ఉంది
రుషికొండ తీరంలో స్కూబా డైవింగ్‌ చేస్తున్న సమయంలో శిలాతోరణం బయటపడింది. దగ్గరకు వెళ్లి చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాం. తొట్లకొండలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంది. 45 నిమిషాల పాటు ఈ శిలాతోరణం పరిసరాల్ని రికార్డు చేశాం. స్కూబా డైవర్లకు ఇది గొప్ప అనుభూతిని అందిస్తుంది. 
– బలరాంనాయుడు, లివిన్‌ అడ్వెంచర్స్‌ ఎండీ  

మరిన్ని వార్తలు