AP Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

24 Nov, 2021 04:22 IST|Sakshi

26 నుంచి మూడు జిల్లాల్లో వర్షాలు

నెల్లూరు, చిత్తూరుపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు–శ్రీలంక తీరంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని, దీని ప్రభావంతోనే అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి శ్రీలంక–ఉత్తర తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉంది.

ఈ అల్పపీడనం మరింత బలపడి 26వ తేదీన తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 26, 27 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో, 27వ తేదీ వైఎస్సార్‌ జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం మధ్య ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉంది.

దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి. రైతులు, సాధారణ పౌరులు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు కోరారు. డిసెంబర్‌ 15వ తేదీ వరకు నైరుతి బంగాళాఖాతంలో వరుసగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నట్లు తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాజమండ్రిలో 97.75 మిల్లీమీటర్లు, జంబుపట్నంలో 92.5, గాజువాకలో 64.5, కంటిపూడిలో 58.25, నిడదవోలులో 56.5, తాడేపల్లిగూడెంలో 55.25, భీమడోలులో 49.75, ప్రత్తిపాడులో 41, రెడ్డిగూడెంలో 39.25, నర్సీపట్నంలో 34.75, మాడుగులలో 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  

మరిన్ని వార్తలు