AP: ఇక ఎన్నైనా సర్టిఫికెట్లు.. సచివాలయాల్లో సరికొత్త సేవలు 

30 Oct, 2022 04:40 IST|Sakshi

పదే పదే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు

తొలి దరఖాస్తు ఆధారంగానే తదుపరి సర్టిఫికెట్ల జారీ 

నిబంధనల ప్రకారం అవకాశం ఉన్న అన్నింటికి వర్తింపు

వాట్సాప్‌ ద్వారా సర్టిఫికెట్ల లింకు పంపేందుకు ఏర్పాట్లు

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పలు రకాల సర్టిఫికెట్ల జారీలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకువస్తోంది. కుల ధ్రువీకరణ, కుటుంబ సభ్యుని నిర్ధారణ ధ్రువీకరణ తదితర కొన్ని రకాల సర్టిఫికెట్ల కోసం పదే పదే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ సర్టిఫికెట్లు జారీ చేయడానికి సరికొత్త సేవలు ప్రవేశపెట్టనుంది. మొదటిసారి దరఖాస్తు చేసుకున్నప్పుడు సంబంధిత అధికారులు ఆమోదం తెలిపి జారీ చేసిన సర్టిఫికెట్లు మళ్లీ కావాల్సి వచ్చినప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్పటికప్పుడు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందుకుగాను ఒకసారి ఒక వ్యక్తికి జారీ చేసే వివిధ రకాల సర్టిఫికెట్ల వివరాలను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఆ సర్టిఫికెట్లకు సంబంధించి దరఖాస్తుదారుడు కోరుకుంటే ఒకేసారి మూడు నాలుగు ఒరిజనల్‌ సర్టిఫికెట్లు కూడా జారీ చేసే విధానం తీసుకురాబోతున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు తెలిపారు.

ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఒకసారి జారీ చేస్తే.. గరిష్టంగా నాలుగేళ్ల వరకు చెల్లుబాటులో ఉంటాయని, ఆ నిర్ణీత గడువు మేరకు ఆ సర్టిఫికెట్లు జారీకి ఈ విధానం వర్తిస్తుందని చెబుతున్నారు. కాగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా ప్రవేశపెట్టే ఈ విధానం ద్వారా కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌ ఎక్కువగా అవసరమయ్యే విద్యార్థులు, నిరుద్యోగులు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో అందజేస్తున్న సర్టిఫికెట్లలో నిబంధనల ప్రకారం అవకాశం ఉన్న అన్నింటికి ఈ విధానం వర్తింపచేసేలా అధికారులు ఆలోచన చేస్తున్నారు.

వాట్సాప్‌ ద్వారా కూడా సర్టిఫికెట్లు..
ఆన్‌లైన్‌లో బస్సు, రైలు టిక్కెట్లు వంటివి బుక్‌ చేసుకున్నప్పుడు ఆ టికెట్‌ కాపీ లింకు మెసేజ్‌ రూపంలో సంబంధిత దరఖాస్తుదారుడు వాట్సాప్‌కు చేరుతోంది. ఆ తరహాలోనే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జారీ చేస్తున్న సరిఫికెట్లను కూడా సంబంధిత అధికారుల ఆమోదం పొందిన వెంటనే దరఖాస్తుదారుల మొబైల్‌ నంబర్లకు కాపీ లింకును కూడా పంపే విధానానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు అధికారులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు