పంచాయతీ పటిష్టం!

30 Aug, 2021 04:55 IST|Sakshi

గ్రామ పంచాయతీల్లోనూ కొత్తగా స్టాండింగ్‌ కమిటీలు 

వార్డు సభ్యులందరికీ ఏదో ఒక కమిటీలో స్థానం.. గరిష్టంగా రెండింటిలో చోటు 

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన  

అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి లేఖ  

రాష్ట్రాల్లో పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలు చేసుకోవాలని సూచన 

ఇప్పటి దాకా నగరాలు, పట్టణాలు, జెడ్పీల్లోనే స్టాండింగ్‌ కమిటీలు 

సాక్షి, అమరావతి:   గ్రామ పంచాయతీల్లో కొత్తగా స్టాండింగ్‌ కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పంచాయతీ వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, వ్యవసాయ కో ఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడు తదితర గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులను ఈ స్టాండింగ్‌ కమిటీల్లో సభ్యులుగా నియమిస్తూ.. ఒక్కో గ్రామ పంచాయతీలో కనీసం ఆరు కమిటీలు ఏర్పాటు కానున్నాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీ స్థాయిలో అదనంగా ఎన్ని కమిటీలైనా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీలో ఉండే వార్డు సభ్యులందరినీ ఏదో ఒక స్టాండింగ్‌ కమిటీలో తప్పనిసరిగా సభ్యునిగా నియమించాల్సి ఉంటుంది. ఒక్కో వార్డు సభ్యుడు రెండుకు మించి స్టాండింగ్‌ కమిటీలలో ఉండకూడదు. ప్రభుత్వ అధికారులు, సంబంధిత అంశంలో గ్రామ స్థాయి నిపుణత ఉన్న పౌరులను ఈ కమిటీలలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించుకోవచ్చు. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్రం ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అనుగుణంగా తమ రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌ చట్టానికి తగిన సవరణలు తీసుకు రావడంతో పాటు, సంబంధిత శాఖ ఆదేశాలు ఇవ్వాలంటూ కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సునీల్‌ కుమార్‌ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు తాజాగా లేఖ రాశారు.  

సుస్థిర అభివృద్ధే లక్ష్యం  
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణకు మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రభుత్వాలలో స్టాండింగ్‌ కమిటీల విధానం ఇప్పటికే అమలులో ఉంది. అయితే నగర పాలక సంస్థలు, మునిసిపాలిటీలు, జిల్లా పరిషత్‌లలో మాత్రమే ప్రస్తుతం స్టాండింగ్‌ కమిటీల విధానం కొనసాగుతోంది. మండల పరిషత్‌లలో, గ్రామ పంచాయతీ స్థాయిలో ఈ తరహా ప్రక్రియ అమలులో లేదు. చట్ట సవరణ ద్వారా కొత్తగా గ్రామ పంచాయతీలలో కూడా స్టాండింగ్‌ కమిటీల ఏర్పాటు వల్ల సుస్థిర అభివృద్ధితో పాటు పనుల్లో వేగం, పారదర్శకత పెరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు తెలిపారు. ఆస్తుల పరిరక్షణ, వివిధ కార్యక్రమాల అమలు సులువవుతుందన్నారు.  

గ్రామ పంచాయతీల్లో స్టాండింగ్‌ కమిటీల బాధ్యతలు  
1.జనరల్‌ స్టాండింగ్‌ కమిటీ : పంచాయతీ పాలన, గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్వహణ, గ్రామ పంచాయతీ ఆస్తుల నిర్వహణ, గ్రామంలో రేషన్‌షాపుల పర్యవేక్షణ– కార్డుదారుల ప్రయోజనాలను కాపాడడం తదితర అంశాలు. 
2.గ్రామ వైద్య, పారిశుధ్య, పోషకాహార స్టాండింగ్‌ కమిటీ :    గ్రామ పరిధిలో వైద్య సంబంధిత, పారిశుధ్య సంబంధిత అంశాల అమలు. ఎక్కువ షోషకాలు ఉండే వాటినే ఆహారంగా తీసుకునేలా స్థానిక ప్రజలలో అవగాహన కల్పించడం. 
3.ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ : గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయడం. పంచాయతీ నిధుల పర్యవేక్షణ, ఆడిట్, ఇతర పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలు. 
4. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ : అంగన్‌ వాడీ కేంద్రాలతో పాటు గ్రామ పరిధిలో విద్యా సంస్థలపై పర్యవేక్షణ, ఆయా విద్యా సంస్థలలో మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలు తీరుపై పర్యవేక్షించడం. 
5.సోషల్‌ జస్టిస్‌ కమిటీ : ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వృద్ధులు, పిల్లలు, మహిళల భద్రతకు సంబంధించిన అంశాల పర్యవేక్షణ. 
6.మంచినీటి సరఫరా, పర్యావరణ కమిటీ : గ్రామంలో మంచినీటి సరఫరా, వర్షపునీటిని ఆదా చేసేందుకు తగిన చర్యలు చేపట్టడం, వ్యవసాయానికి సాగునీటి సరఫరా వ్యవస్థ పర్యవేక్షణ, మొక్కల పెంపకం తదితర అంశాలు.  

మరిన్ని వార్తలు