‘టెలిస్కోపిక్‌’తో తక్కువ బిల్లులు

4 Apr, 2022 09:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: టెలిస్కోపిక్‌ బిల్లింగ్‌ ద్వారా తక్కువ భారం పడుతుందని గృహ విద్యుత్‌ వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించాలని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్‌ విద్యుత్‌ సంస్థలను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై  ఆదివారం ఆయన వెబినార్‌ ద్వారా సమీక్షించారు. ఇంధన సంరక్షణ మిషన్‌ సీఈవో ఏ.చంద్రశేఖర్‌ రెడ్డి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్, డిస్కమ్‌ల సీఎండీలు హెచ్‌.హరనాథరావు, జె.పద్మాజనార్దన్‌ రెడ్డి, కె.సంతోష్‌ రావు, డైరెక్టర్లు ఏవీకే భాస్కర్, కె.ముథుపాండియన్, జి.చంద్రశేఖరరాజు ఇందులో పాల్గొన్నారు. టెలిస్కోపిక్‌ బిల్లింగ్‌కు సంబంధించిన వివరాలతో కరపత్రాలను విద్యుత్తు బిల్లులతో వినియోగదారులకు అందజేయాలని ఇంధన శాఖ కార్యదర్శి సూచించారు.  

సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. 

  • నూతన టెలిస్కోపిక్‌ విధానంతో వినియోగదారులకు మేలు జరుగుతుంది. దీనివల్ల మొత్తం వినియోగానికి ఒకే స్లాబ్‌లో బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు ఒక వినియోగదారుడు నెలకు 250 యూనిట్లు వాడితే తొలి 30 యూనిట్లకు యూనిట్‌ రూ.1.90 చొప్పున, తర్వాత 45 యూనిట్లకు యూనిట్‌ రూ.3, ఆ తర్వాత 50 యూనిట్లకు యూనిట్‌ రూ.4.50, అనంతరం 100 యూనిట్లకు యూనిట్‌ రూ.6, చివరి 25 యూనిట్లకు యూనిట్‌ రూ.8.75 చొప్పున బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.
  • వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడంతో పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా ప్రక్రియను బలోపేతం చేసేందుకు ఏపీఈఆర్సీ కొత్త విద్యుత్తు టారిఫ్‌  ప్రకటించింది. 1.91 కోట్ల మంది వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడంలో డిస్కమ్‌లకు ఊరట కల్పించేలా కొత్త టారిఫ్‌ ఉంది.  
  • రాష్ట్రంలో 100 యూనిట్లలోపు విద్యుత్తు వాడే వారికి యూనిట్‌ రూ.3.11 చార్జీ పడుతుంది. ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కర్ణాటక, రాజస్థాన్, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో 100 యూనిట్లలోపు వాడే వినియోగదారులు యూనిట్‌ రూ.8.26, రూ.8.33, రూ.7.74, రూ.7.20, రూ.6.19, రూ.6.61, రూ.6.10 చొప్పున చెల్లిస్తున్నారు. 
  • రాష్ట్రంలోని 1.50 కోట్ల మంది గృహ వినియోగదారుల్లో 1.44 కోట్ల (95%) మంది 225 యూనిట్లలోపు వినియోగించే కేటగిరీలోనే ఉన్నారు. 225 యూనిట్లలోపు వినియోగించే వారి నుంచి డిస్కంలు సగటు ధర కంటే తక్కువగానే చార్జీలు వసూలు చేస్తున్నాయి. మూడు డిస్కంలకు మొత్తం సర్వీసు చార్జీ రూ.6.82 నుంచి రూ.6.98కి పెరిగినా వినియోగదారుల నుంచి తక్కువగానే వసూలు చేస్తున్నాం. 
  • జిల్లాల విభజన నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్‌ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. పట్టణీకరణతో విద్యుత్తు డిమాండ్‌ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.

(చదవండి: పోలీస్‌ ఉద్యోగాల కోసం... యువతకు ఉచిత శిక్షణ)
 

మరిన్ని వార్తలు