ఏపీలో సూళ్లకు కొత్త టైం టేబుల్‌

23 Nov, 2020 03:10 IST|Sakshi

8, 9 తరగతులకు రోజు విడిచి రోజు స్కూలు

10వ తరగతి విద్యార్థులు ప్రతిరోజూ హాజరు కావాలి

మధ్యాహ్నం తర్వాత ఆన్‌లైన్‌లో బోధన

అన్ని రకాల కోవిడ్‌ జాగ్రత్తలతో ఎస్సీఈఆర్టీ నూతన విధివిధానాలు

పాఠశాలల్లో పెరుగుతున్న హాజరు శాతం

సాక్షి, అమరావతి: విద్యార్థుల నుంచి మెరుగైన రీతిలో స్పందన కనిపిస్తుండడంతో పాటు పాఠశాలల్లో హాజరు శాతం పెరుగుతుండడంతో విద్యా శాఖ కోవిడ్‌ నుంచి రక్షణ చర్యలను చేపడుతూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నెల 2వ తేదీ నుంచి 9, 10 తరగతుల విద్యార్థులు స్కూళ్లకు హాజరవుతుండగా, సోమవారం నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా తరగతులను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. 8, 9 తరగతుల విద్యార్థులకు రోజు విడిచి రోజు తరగతులను చేపట్టనున్నారు. 10వ తరగతి విద్యార్థులు ప్రతి రోజూ హాజరు కావలసి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి తాజా టైమ్‌ టేబుల్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ మేరకు 9వ తరగతి విద్యార్థులు సోమ, బుధ, శుక్రవారాల్లో.. 

8వ తరగతి విద్యార్థులు మంగళ, గురు, శనివారాల్లో పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతాయి. మధ్యాహ్న భోజనం అనంతరం 1.30 గంటలకు ఇళ్లకు పంపిస్తారు. అనంతరం ఆన్‌లైన్‌ తరగతులు ఉంటాయి. 

ఎస్సీఈఆర్టీ తాజా టైం టేబుల్‌
– ఉదయం 9.30 నుంచి 9.45 వరకు: ప్రార్థన, కోవిడ్‌–19 ప్రతిజ్ఞ (తరగతి గదిలో). సాధారణ సమావేశం నిషిద్ధం.
– 9.45 నుంచి 10.25 వరకు : మొదటి పీరియడ్‌
– 10.25 నుంచి 10.35 వరకు : ఆనంద వేదిక / భౌతిక దూరాన్ని పాటిస్తూ పాఠశాల ఆవరణలో నడవడం, చేతులు కడుక్కోవడం / మూడింట ఒక వంతు విద్యార్థులకు విరామం
– 10.35 నుంచి 11.15 వరకు : రెండవ పీరియడ్‌
– 11.15 నుంచి 11.20 వరకు : మంచినీటి విరామం (వాటర్‌ బెల్‌)
– 11.20 నుంచి 12.00 వరకు : మూడవ పీరియడ్‌
– 12.00 నుంచి 12.10 వరకు : ఆనంద వేదిక (కథలు చెప్పడం / చిత్రలేఖనం / పాఠ్యాంశాలకు సంబంధించిన నాటకీకరణ / చేతులు కడుక్కోవడం / ప్రాణాయామం, మూడింట ఒక వంతు విద్యార్థులకు విరామం.
– 12.10 నుంచి 12.50 వరకు : 10వ తరగతి విద్యార్థులకు నాల్గవ పీరియడ్, 8/9వ తరగతి విద్యార్థులకు భోజన విరామం 
– 12.50 నుంచి 1.30 వరకు : 8/9వ తరగతి విద్యార్థులకు నాల్గవ పీరియడ్, 10వ తరగతి విద్యార్థులకు భోజన విరామం  
– 1.30 : విద్యార్థులు ఇంటికి వెళ్లుట
– 1.30 నుంచి 2 వరకు :  ఉపాధ్యాయుల భోజన విరామం
– 2.00 నుంచి 2.15 వరకు : ఆన్‌లైన్‌ బోధన, విద్యార్థులకు వాట్సప్‌ ద్వారా సమాచారం అందించేందుకు ఉపాధ్యాయుల సమావేశం.
– 2.15 నుంచి 4.00 వరకు : వాట్సప్‌ / దూరదర్శన్‌ / దీక్షా / అభ్యాస యాప్‌ / యూట్యూబ్‌ / ఫోన్‌ ద్వారా సామూహిక సంభాషణ, విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇవ్వడం వంటి ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ, పర్యవేక్షణ. 
– 4.00 నుంచి 4.15 వరకు : మరుసటి రోజుకు ఉపాధ్యాయులు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం.  

మరిన్ని వార్తలు