అడుగు కదిపితే చాలు అద్భుత లోకాల్లో ఉన్న అనుభూతి..

29 Nov, 2022 19:50 IST|Sakshi

అల్లూరి జిల్లాలో వెలుగుచూస్తున్న కొత్త టూరిస్టు స్పాట్‌లు

తిలకించేందుకు పరుగులు తీస్తున్న సందర్శకులు

ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పుడు కొత్త టూరిస్టు స్పాట్‌లు వెలుగు చూస్తున్నాయి. అగుడు కదిపితే చాలు అద్భుత లోకాల్లో ఉన్న అనుభూతిని పంచుతున్నాయి. పాల సంద్రాన్ని తలిపించే మంచు మేఘాలతో పాటు ఇప్పుడు హొయలొలికే కొత్త జలపాతాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. అంతెత్తునుంచి ఎగసిపడే జలసవ్వడులు సుమధుర సంగీత ఝరిలో  జలకాలాడిస్తున్నాయి. వాటిని సందర్శించేందుకు పర్యాటకులు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు భారీగా తరలిస్తున్న సందర్శకులు అయిష్టంగానే తిరిగి ఇళ్లకు వెళుతున్నారు. 


గూడెంకొత్తవీధి/అరకులోయ రూరల్‌:
జిల్లాలో కొత్తగా వెలుగులోకి వస్తున్న టూరిస్టు స్పాట్‌లు సైతం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఒకదానిని మించి ఒకటి అన్నట్టు ఉన్న కొత్త ప్రాంతాలను టూరిస్టులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారు. 

అనంతగిరి, లంబసింగి, తాజంగి, చెరువులవెనం, పాడేరులోని వంజంగి మేఘాల కొండలే కాదు. అంతకు మించిన ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలు అరకులోయ, గూడెంకొత్తవీధి తదితర మండలాల్లో చాలా ఉన్నాయి.  


సప్పర్ల రెయిన్‌ గేజ్‌ 

గూడెంకొత్తవీధి మండల కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సప్పర్ల రెయిన్‌గేజ్‌ ప్రాంతం సముద్రమట్టానికి సుమారు 4000 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ 24 గంటలూ అత్యంత శీతల వాతావరణంతోపాటు మంచు మేఘాలు చాలా కిందనుంచి సందర్శకులను తాకుతూ వెళుతుంటాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన దారకొండ దారాలమ్మ ఆలయంతోపాటు సీలేరు వెళ్లే పర్యాటకులంతా తప్పనిసరిగా ఇక్కడ రెయిన్‌గేజ్‌ వద్దకు వెళ్లి కాసేపు ఉండి ఇక్కడ అందాలను ఆస్వాదిస్తారు. గతంలో అప్పటి ఉమ్మడి విశాఖ కలెక్టర్‌ యువరాజ్‌ ఈ ప్రాంతాన్ని సందర్శించి పర్యటకంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ప్రస్తుత సీజనులో దూరప్రాంతాలనుంచి ఇక్కడకు వస్తున్న పర్యాటకులసంఖ్య పెరుగుతోంది. ఈ ప్రాంతాన్ని టెంపుల్‌ టూరిజం కింద అభివృద్ధి చేస్తామని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. 


రణజిల్లేడలో.. 

ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో మరో అద్భుతమైన టూరిజం స్పాట్‌ చూపరులకు కనువిందు చేస్తోంది. పద్మాపురం పంచాయతీ రణజిల్లేడ జలపాతం ఇప్పటికే ప్రాచుర్యం పొందగా, దాని సమీపంలో అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాలు పర్యాటకులను పరవశింప చేస్తున్నాయి. ఇక్కడి మంచు సోయగాలు, సూర్యోదయ అందాలు ఆకర్షిస్తున్నాయి.  


మాడగడలో వ్యూ పాయింట్‌
 
కొద్ది రోజుల నుంచి పర్యాటకులతో సందడిగా మారిన మాడగడ సన్‌ రైజ్‌ వ్యూ పాయింట్‌ సోమవారం పర్యాటకులతో కిటకిటలడింది. వివిధ ప్రాంతల నుంచి వచ్చిన పర్యాటకులు సందడి చేశారు, తెల్లవారుజామునలో చల్లని వాతవరణంలో మంచు అందాలను వీక్షించి ఫొటోలు తీసుకుంటూ గడిపారు.  


మూడు కొత్త జలపాతాలు

గూడెంకొత్తవీధికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లికి సమీపంలో దోనుగుమ్మల జలపాతం కొత్తగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడికి వెళ్లేందుకు కొద్దిదూరం సీసీ రోడ్డు నిర్మిస్తే చాలు ఈప్రాంతానికి పర్యాటకంగా ఆదరణ లభించే అవకాశం ఉంది. దోనుగుమ్మల జలపాతానికి రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశామని పంచాయతీరాజ్‌ జేఈ జ్యోతిబాబు తెలిపారు. జలపాతాలకు వెళ్లేందుకు రహదారి నిర్మాణానికి రూ.19లక్షలు మంజూరు చేసినట్టు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. కార్యరూపం దాల్చితే త్వరలోనే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సంపంగిగొంది జలపాతం కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది. అనంతగిరి మండలం చిట్టంపాడు జలపాతం ఇటీవల వెలుగుచూసింది. అక్కడికి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో వెళుతున్నారు.  

మరిన్ని వార్తలు