కాలం మారింది.. ఇక మీ టేబుల్‌ వద్దకు వెయిటర్స్‌ రారు, అంతా మీ చేతుల్లోనే!

30 Nov, 2021 13:39 IST|Sakshi

తరాలు మారుతున్న కొద్దీ ప్రజల్లో అనాదిగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు, అభిరుచులు ఆలోచనా విధానాల్లో విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. తదనుగుణంగా ఆధునిక జీవనశైలి అలవర్చుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచం డిజిటల్‌ వైపు పరుగులు తీస్తోంది. అందుకు హోటళ్లు, రెస్టారెంట్‌ పరిశ్రమలు సైతం మినహాయింపు కాదు. ఈ నేపథ్యంలో ఆయా రంగాలు.. సాధారణ ముద్రిత మెనూల స్థానంలో ‘డిజిటల్‌ మెనూ’ను ప్రవేశపెడుతున్నాయి. వెయిటర్స్‌తో సంబంధం లేకుండా కూర్చున్న చోటు నుంచే వినియోగదారులు ఆహారాన్ని ఆర్డర్‌ చేయడానికి, బిల్లు చెల్లింపులు చేసేందుకు ‘నో టచ్‌ ఆర్డరింగ్‌’ పేరుతో క్యూఆర్‌ కోడ్‌ సాయంతో డిజిటల్‌ మెనూను తీసుకొస్తున్నాయి.
– సాక్షి, అమరావతి

నో వెయిటింగ్‌.. ఈజీ ఆర్డర్‌
టేబుల్‌పై ఉంచిన ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌లో రెస్టారెంట్‌లో లభించే పదార్థాల వివరాలను పొందుపరుస్తారు. దానికే సంబంధిత బ్యాంకు ఖాతాను జత చేస్తారు. వినియోగదారులు స్మార్ట్‌ ఫోన్‌తో కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా డిజిటల్‌ మెనూను వీక్షించవచ్చు. నచ్చిన ఆహారాన్ని వెయిటర్‌ సాయం లేకుండానే ఆర్డర్‌ చేయొచ్చు. ఇక్కడ ‘కిచెన్‌ టు టేబుల్‌’ (కేవోటీ)విధానంలో కోరిన ఆహారం జాప్యం లేకుండానే అందుతుంది. 

ఎలా తయారు చేస్తున్నారో చూడొచ్చు..
అన్య దేశాలకు చెందిన సంస్థల్లో ప్రత్యేకమైన డిజిటల్‌ మెనూ అందుబాటులో ఉంది. వాటిలో ట్యాబ్‌లను డిజిటల్‌ మెనూలుగా డైనింగ్‌ టేబుళ్లకు జోడిస్తున్నారు. మరోవైపు ‘సెల్ఫ్‌ ఆర్డరింగ్‌ కియోస్క్‌’లో మనం ఆర్డర్‌ చేసే పదార్థాన్ని 3డీ రూపంలో ముందుగానే చూపిస్తున్నారు. ఇక ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లే టేబుల్స్‌ ద్వారా ఆర్డర్‌ చేసిన వస్తువు వచ్చేలోగా కిచెన్‌లో అది తయారు చేసే విధానాన్ని వీక్షించవచ్చు. 

టెక్నాలజీ వైపు..
కోవిడ్‌ తర్వాత భారతదేశంలోని దాదాపు మూడింట ఒకవంతు రెస్టారెంట్లు క్యూఆర్‌ కోడ్‌ ఆర్డరింగ్‌ టెక్నాలజీని చురుకుగా ఉపయోగిస్తున్నట్టు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2021 చివరి నాటికి దేశంలోని 80 శాతం రెస్టారెంట్లు క్యూఆర్‌ కోడ్లు, ఇతర ఆన్‌లైన్‌ ఆర్డరింగ్‌ టెక్నాలజీలోకి వస్తాయని అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లలో మాత్రమే డిజిటల్‌ మెనూ అమలవుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని హరిత హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లలో డిజిటల్‌ మెనూ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు పర్యాటక శాఖ చర్యలు చేపడుతోంది. పైలట్‌ ప్రాజెక్టు కింద తొలుత 14 చోట్ల అందుబాటులోకి తేనున్నామని ఏపీటీడీసీ ఎండీ సత్యనారాయణ చెప్పారు. 

శ్రామిక శక్తి సామర్థ్యం పెంపు
రద్దీగా ఉండే హోటళ్లలో వెయిటర్‌కు ఆర్డర్‌ ఇచ్చేందుకు గంటల పాటు ఎదురు చూసే అవస్థలు తప్పుతాయి. ముఖ్యంగా శ్రామిక శక్తి కొరతను, పని భారాన్ని అధిగమించొచ్చు.ఈ డిజిటల్‌ మెనూలను బహుళ భాషల్లో సులభంగా సృష్టించవచ్చు.  

మరిన్ని వార్తలు