New Food Trends In Vizag: ఆహా ఎన్ని రుచులో, డోర్‌ ఓపెన్‌ చేసి చూస్తే వేడివేడి వంటకాలతో ఫుడ్‌ డెలివరీ బాయ్‌

26 May, 2022 18:13 IST|Sakshi
సకుటుంబ సమేతంగా..

వారంలో ఒకసారి కుటుంబంతో హోటల్‌ భోజనానికి ప్రాధాన్యం 

ఇంటికొచ్చిన బంధువులకూ హోటల్‌ వంటలతోనే విందు 

నాగమణి సాధారణ గృహిణి
భర్త ఉద్యోగి. ఓ మధ్యాహ్నం వేళ. అకస్మాత్తుగా ఇంటికి చుట్టాలు వచ్చారు. భోజన సమయం కావడంతో ఏం చేయాలో తోచక భర్తకు ఫోన్‌ చేసింది. కొద్ది నిమిషాల్లోనే కాలింగ్‌ బెల్‌ మోగింది. డోర్‌ ఓపెన్‌ చేసి చూస్తే వేడివేడి వంటకాలతో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ కనిపించాడు. భర్త ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ ఐటమ్స్‌ తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన బంధువులు రీఫ్రెష్‌ అయ్యేలోపే తాజా వంటకాలు సిద్ధమయ్యాయి.  

కిరణ్, సంధ్య కొత్తగా పెళ్లయిన జంట
ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. వర్క్‌ఫ్రం హోంలో ఇద్దరూ బిజీ. ఇద్దరి షిఫ్ట్‌లు వేరు. ల్యాప్‌టాప్‌లో లాగినైతే క్షణం తీరిక ఉండదు. వంట చేయాలంటే కుదిరే పని కాదు. వర్క్‌ చేస్తూనే తమ అభిరుచులకు తగినట్టు స్మార్ట్‌ ఫోన్‌లోని ఫుడ్‌ డెలివరీ యాప్స్‌లో ఆర్డర్‌ చేయడం.. నిమిషాల వ్యవధిలో వచ్చే ఫుడ్‌ ఐటమ్స్‌ను తింటూనే విధులు నిర్వహించడం వారికి అలవాటుగా మారింది. 

డాబాగార్డెన్స్‌/బీచ్‌రోడ్డు: విశాఖ నగర వాసులు కొత్త రుచులను కోరుకుంటున్నారు. వారిని ఆకర్షించేలా వెరైటీ రుచులతో హోటళ్లు ఆహ్వానం పలుకుతున్నాయి. సాంకేతికత పెరగడం, పలు రకాల ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ అందుబాటులోకి రావడంతో వంట చేసుకునే వారి సంఖ్య నానాటికీ తగ్గుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులతో క్షణం తీరిక లేకుండా ఉండే వారికి ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ ఓ వరంలా మారాయి. ఈ యాప్స్‌ ప్రత్యేక ఆఫర్లను కూడా ఇస్తున్నాయి. ఆకలి వేస్తుందన్న సంకేతాలు రాగానే ఆర్డర్‌ చేస్తే సరి.. వేడివేడి ఆహార పదార్థాలు గడప ముంగిటకు వచ్చేస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు మాంసాహారం, మరొకరు శాకాహార ప్రియులైనా.. ఒకరు సౌత్‌ ఇండియన్‌.. ఇంకొకరు నార్త్‌ ఇండియన్‌ అయినా సరే.. ఏక కాలంలో వారి సంప్రదాయాలు, సంస్కృతులకు చెందిన ఆహార పదార్థాలు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే వచ్చేస్తున్నాయి.  

కొత్త వంటల పరిచయం 
నగరవాసులకు వెరైటీ ఫుడ్‌ అందించాలని పలు హోటళ్లు ఎప్పటికప్పుడు ఫుడ్‌ ఫెస్టివళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఉత్తర భారత దేశం రుచులు, నవాబులు బిర్యానీ, కోస్టల్‌ రుచి.. ఇలా అనేక రకాల పేర్లతో ఫుడ్‌ ఫెస్టివళ్లను ఏర్పాటు చేసి ఆహార ప్రియులకు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి.  

కొత్త రుచులు ఇంట్లో కష్టం  
వారంలో ఐదు రోజులు బిజీబిజీ. తీరిక లేని పనులు. ఫ్యామిలీకి టైం కేటాయించడం కూడా సాధ్యం కావడం లేదు. వీకెండ్‌ వచ్చిందంటే ఆ ఒత్తిడి నుంచి రిలాక్స్‌ కావడానికి రెస్టారెంట్‌ బాట పడుతున్నాం. మెనూలో నచ్చిన ఫుడ్‌ ఆర్డర్‌ చేసి ఫ్యామిలీతో కలిసి చక్కగా భోజనం చేస్తున్నాం. వేర్వేరు అభిరుచులు ఉన్న వారికి ఇంట్లో తయారు చేయడం కొంత కష్టం. రెస్టారెంట్‌కో, హోటల్‌కో వెళితే ఎవరికి నచ్చిన ఐటమ్‌ వాళ్లు ఆర్డర్‌ చేసుకోవచ్చు. నచ్చిన వంటకాన్ని కడుపునిండా తినొచ్చు.  
– సీహెచ్‌ పవన్‌కుమార్, ప్రైవేట్‌ ఉద్యోగి 

ట్రెండ్‌ మారింది  
ఒకప్పటికీ నేటికి ట్రెండ్‌ మారింది. వర్క్‌ స్టైల్‌ కూడా మారింది. అలానే ఆహారపు అలవాట్లు, అభిరుచులూ మారాయి. వీకెండ్స్‌ సంస్కృతి వచ్చింది. చాలా మంది ఫ్యామిలీతో రెస్టారెంట్‌కో, హోటల్‌కో వెళ్లి భోజనం చేస్తున్నారు. మెనూలో వెరైటీలు ఉండేలా చూసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా రెస్టారెంట్లు, హోటళ్లు తమ మెనూ మార్చుకుంటున్నాయి. హోం డెలివరీ, టేక్‌ ఏవే తగ్గిపోయి ఆన్‌లైన్‌లో ఆర్డర్స్‌ పెరిగాయి. హోటల్‌ బిజినెస్‌లో 60 శాతం వరకు ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ ఆక్రమించేశాయి.  
– వాకాడ రాజశేఖర్‌రెడ్డి, అతిథి దేవోభవ హోటల్‌ యజమాని 

నగరంలో నయా ట్రెండ్‌ 
హీరో వెంకటేష్, ఆర్తి అగర్వాల్‌ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్‌’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. భోజన సమయంలో ఇంటికి వచ్చిన బంధువులకు ఏం వంట చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న హీరోయిన్‌కు హీరో మంచి ఐడియా చెప్తాడు. సిటీలో ప్రముఖ హోటల్‌ నుంచి ఫుడ్‌ రప్పించి బంధువులకు అన్ని రకాల రుచులు చూపించి వారి చేత శభాష్‌ అనిపిస్తాడు. ప్రస్తుతం నగరంలో ఇటువంటి ట్రెండే నడుస్తోంది. ఇంటికి వచ్చే బంధువులకు నగరంలోని లభించే కొత్త కొత్త రుచులను ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్‌ చేసి.. అందిస్తున్నారు. 

హోటళ్ల పేర్లూ వెరైటీనే.. 
విశాఖ నగర వాసులు రోజూ ఇంటి భోజనం తినేందుకు ఇష్టపడడం లేదు. సకుటుంబ సమేతంగా హోటల్‌కో, దాబాకో వెళ్లి సరికొత్త రుచులను ఆస్వాదించేందుకు మొగ్గు చూపుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యజమానులు రెస్టారెంట్లు, హోటళ్లకు వెరైటీ పేర్లు పెడుతున్నారు. అమ్మ చేతి వంట, వంటిళ్లు, అరిటాకు, వంటకమ్‌.. ఇలా రకరకాల పేర్లతోనే కాదు.. బాబాయ్‌ హోటల్, సుబ్బయ్య హోటల్, రాజుగారి హోటల్, కుండ బిర్యానీ వంటి పేర్లతోనూ నడుస్తున్న హోటళ్లు నగరంలో తమ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. బుట్ట భోజనం, కాంబో ఆఫర్, ఫ్యామిలీ ఫ్యాక్, జంబో బిర్యానీ ఇలా స్పెషల్‌ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి.  

ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ.. 
ఉదయం ఆరు గంటల నుంచే ఆర్డర్లు మొదలవుతాయి. వాటర్‌ బాటిల్‌ నుంచి ఐస్‌క్రీం వరకు, టిఫిన్‌ నుంచి భోజనం, పసందైన బిర్యానీ వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ చేస్తున్నారు. కొందరు కర్రీస్, స్నాక్స్‌ ఆర్డర్‌ చేసి తెప్పించుకుంటున్నారు. రోజు రోజుకూ ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇళ్లల్లో వంట చేయడం చాలా వరకు తగ్గింది. వేగంగా డెలివరీ చేయడం కూడా ఇందుకు కారణం. ఆన్‌లైన్‌ యాప్‌లు మంచి ఆఫర్లు ఇస్తున్నాయి.  
– కిరణ్, ఫుడ్‌ డెలివరీ బాయ్‌ 

ఫుడ్‌ ఫెస్టివల్స్‌కు వెళ్తుంటా..  
నాకు కొత్త కొత్త రుచులంటే చాలా ఇష్టం. అటువంటి రుచులు ఇంట్లో కష్టం. అందుకే నగరంలో ఎక్కడ కొత్త రుచులు ఉన్నాయంటే అక్కడ వాలిపోతా. ముఖ్యంగా ఫుడ్‌ ఫెస్టివల్స్, నూతన రెస్టారెంట్లకు వెళ్లి అక్కడ రుచులన్నీ ఆస్వాదిస్తా.  
–హేమసుందర్‌

కొత్త రుచులను టేస్ట్‌ చేస్తాం 
నేను, నా భర్త ఇద్దరం ఉద్యోగం చేస్తుంటాం. ఇద్దరం కలిసి భోజనం చేయడానికి సమయం దొరకదు. అందుకే వారంలో ఒక్క రోజైనా రెస్టారెంట్‌కు భోజనానికి వెళ్తాం. కొత్త రుచులను టేస్ట్‌ చేస్తాం.                     
–రమ్య 

మరిన్ని వార్తలు