కోటనందూరు పీహెచ్‌సీలో శిశుమరణం

29 Dec, 2020 08:58 IST|Sakshi
వైద్యాధికారితో వాగ్వాదానికి దిగిన బాధిత కుటుంబ సభ్యులు

వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ

పీహెచ్‌సీ ఎదుట బాధిత కుటుంబసభ్యుల నిరసన

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

సాక్షి, కోటనందూరు: కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శిశుమరణం సంభవించింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ సోమవారం స్థానిక పీహెచ్‌సీ ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యాధికారి, వైద్య, పారామెడికల్‌ సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ పరిస్థితి 
ఈనెల 26వ తేదీ శనివారం కోటనందూరుకు చెందిన గర్భిణి లక్ష్మీ రాధను కుటుంబ సభ్యులు మధ్యాహ్నం ఒంటిగంటకు స్థానిక పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. రెగ్యులర్‌ స్టాఫ్‌నర్సు సెలవులో ఉండడంతో ఆ స్థానంలో విధులు నిర్వహిస్తున్న హెచ్‌వీ, ఏఎన్‌ఎంలు, ఫార్మాసిస్టు కేసును చేర్చుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు వారి పర్యవేక్షణలోనే లక్ష్మీరాథ ఉంది. సాయంత్రం ఆరు గంటలకు నైట్‌ డ్యూటీ స్టాఫ్‌నర్సు విధులకు హాజరయ్యారు. రాత్రి ఎనిమిది గంటల వరకూ గర్భిణీ పరిస్థితి అంతా సవ్యంగానే ఉంది. డెలివరీ సమయం సమీపించడంతో హెచ్‌వీ, ఫార్మాసిస్టు సహకారంతో స్టాఫ్‌నర్సు రాత్రి 10.15 నిమిషాలకు ప్రసవం చేసారు. పసికందు పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో తుని ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు వైద్యసిబ్బంది తెలిపారు. అప్పటికే శిశువు మృతి చెందినట్టు అక్కడ డాక్టర్లు ధ్రువీకరించారు.

ఎటువంటి సమాచారం లేదు: వైద్యాధికారి
ఈ విషయంపై వైద్యాధికారి ఇందిరాప్రియదర్శిని వివరణ కోరగా శనివారం అంతా ఎన్‌సీడీసీడీ సర్వేలో ఉన్నామని, ఈ కేసు సమాచారం తనకు తెలియదని చెప్పారు. జరగాల్సిన నష్టం జరిగాక రాత్రి 12.30 గంటలకు సమాచారమిచ్చారన్నారు. ఆదివారం ఉదయం వచ్చి కేసును పరిశీలించానన్నారు. డీడీఓ వైద్యాధికారి డిప్యుటేషన్‌పై వెళ్లడంతో పనిభారం పెరిగిందని, ప్రసవాల విషయంలో అప్రమత్తంగా ఉంటామని వివరించారు. (చదవండి: అనగనగా ఒక పోలీసు! ఆ కథ విందామా..)

సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా..
సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. శనివారం వైద్యాధికారి విధుల్లో లేరని, సిబ్బంది, మెడికల్‌ అధికారి మధ్య సమన్వయం కొరవడడంతోనే సమస్య తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు శిశువు బొడ్డు దగ్గర ప్రేగు మెడకు చుట్టుకోవడం, చేయి మడత పడి ఉండడం వల్ల శిశువు ఇబ్బందులకు గురైందని వైద్య సిబ్బంది తెలిపారు. ఈ విషయం స్కానింగు రిపోర్ట్‌లో ఎక్కడా లేకపోవడం, డెలివరీ సమయం సమీపించడంతో  ఇక్కడ ప్రసవం చేసామని వివరించారు. స్కానింగ్‌ రిపోర్ట్‌ అంతా సవ్యంగా ఉండడంతోనే ఆసుపత్రిలో చేర్చుకున్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు