కొత్త బ్యాక్టీరియా.. సరికొత్త జ్వరం 

14 Nov, 2021 04:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పాలకొండ రూరల్‌:  శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ మండలం సింగన్నవలస ప్రాంతంలో కొత్త రకం బ్యాక్టీరియాను వైద్యులు గుర్తించారు. ఓ రకం కీటకం కాటు ద్వారా ‘ఓరియన్షియా సుషుగముషి’ అనే బ్యాక్టీరియా సోకి ‘స్క్రబ్‌ టైఫస్‌’ అనే జ్వరం వస్తోంది. ఈ జ్వరం కారణంగా రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోవడంతో పాటు.. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే జ్వరం తీవ్రమై ప్రాణానికే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో అధికంగా ఉండే ఈ బ్యాక్టీరియా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోనూ కనిపిస్తోంది. పాలకొండ మండలం సింగన్నవలసలో ఈ తరహా లక్షణాలతో కూడిన జ్వర పీడితులను ఇటీవల వైద్యులు గుర్తించారు. సకాలంలో వైద్యులు స్పందించటంతో ప్రమాదం తప్పింది. దీనిని నియంత్రించేందుకు ప్రత్యేక టీకాలు అంటూ ఏమీ లేవు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలి.  

మురుగుతో పాటు..: పచ్చిక బయళ్లు, మురుగు నిల్వ ఉన్న చోట పెరిగే ఓ రకం (నల్లిని పోలి ఉండే) కీటకాల్లో ఈ ‘ఓరియన్షియా సుషుగముషి’ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ కీటకం కాటు వేసిన చోట నల్లని మచ్చతో పాటు.. చుట్టూ ఎరుపు రంగుతో కూడిన గాయం ఏర్పడి దురద పుడుతుంది. తీవ్రమైన చలి జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలు, తలనొప్పితో పాటు ఒంటిపై ఎర్రని దద్దుర్లు ఏర్పడతాయి. డెంగీ మాదిరి లక్షణాలతో ఉండే జ్వరంతో పాటు రక్తంలో సోడియం నిల్వలు తగ్గిపోవడం దీని ప్రధాన లక్షణం. జ్వరం తీవ్రమైతే ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు, కాలేయం ప్రభావానికి గురవుతాయి. తెల్ల రక్తకణాల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. అయితే ఈ రకమైన జ్వరాన్ని గుర్తించేందుకు మ్యాల్‌ కిల్లర్‌ పరీక్షలు చేయాల్సి ఉంటుంది.  

మరిన్ని వార్తలు