బాల వికాసానికి 'మూలస్థానం'

6 Sep, 2020 05:50 IST|Sakshi
మూలస్థానం గ్రామం ఏరియల్‌ వ్యూ

సమస్యాత్మక పల్లెకు సరికొత్త రూపు

రక్త హీనతకు.. శిశు మరణాలకు చెక్‌

బాల్య వివాహాలను తరిమికొట్టిన గ్రామం

‘బాలమిత్ర పంచాయతీ’గా జాతీయ స్థాయిలో గుర్తింపు  

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గోదావరి చెంత బాల వికాసం పరవళ్లు తొక్కుతోంది. అధికారుల అంకితభావం అక్కడి బాలకార్మిక వ్యవస్థకు అడ్డుకట్ట వేసింది. బాల్య వివాహాలను తరిమికొట్టింది. అంగన్‌వాడీల లాలన చిన్నారుల్లో రక్తహీనతను రూపుమాపి బాలల ఆరోగ్యానికి బాటలు వేసింది. శిశు మరణాలను దూరం చేసింది. గ్రామస్తుల సహకారం సమస్యాత్మక పల్లెకు సరికొత్త రూపు తెచ్చింది. అదే ఆ గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. బాలల సంరక్షణ విషయంలో సమర్థవంతమైన పనితీరు కనబర్చినందుకు గాను 2020 సంవత్సరానికి కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ నుంచి ప్రతిష్టాత్మకమైన ‘బాలమిత్ర (చైల్డ్‌ ఫ్రెండ్లీ) పంచాయతీ’ పురస్కారాన్ని దక్కించుకుంది. గౌతమీ గోదావరి చెంతన చెన్నై–కలకత్తా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఆ గ్రామమే తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని మూలస్థానం పంచాయతీ. 

సమస్యల చీకట్లను జయించి..
► నిత్యం తగాదాలతో మూలస్థానం తల్లడిల్లేది. మరోవైపు బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, చిన్నారుల్లో రక్తహీనత, పౌష్టికాహారం లోపం తదితర సమస్యలు గ్రామాన్ని పీడిస్తుండేవి.
► గ్రామంలోని అంగనవాడీ కేంద్రాల పరిధిలో ఆరేళ్లలోపు చిన్నారులు 434 మంది, గర్భిణులు 51 మంది, బాలింతలు 44 మంది ఉన్నారు. 
► గ్రామస్తులు, తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకువచ్చి రుగ్మతలను రూపుమాపేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలతోపాటు మండలస్థాయి అధికారుల వరకు అందరూ సమష్టిగా పనిచేశారు. 
► అధికారులు, గ్రామంలోని ఉద్యోగుల కృషికి గ్రామస్తుల సహకారం తోడవటంతో ఏడాదిలోనే మంచి ఫలితాలను సాధించారు.

ఆరోగ్య లోపాలను అధిగమించి..
► మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచీ ప్రసవమయ్యే వరకూ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలుఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా శిశు మరణాలకు అడ్డుకట్ట వేయగలిగారు. 
► చిన్నారులకు సకాలంలో టీకాలు వేయడం, వయసుకు అనుగుణంగా వారి ఎత్తు, బరువును నమోదు చేసి లోపాలున్న వారికి పౌష్టికాహారం అందించారు 
► తీవ్ర పోషకాహార లోపం, అతి తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. వైద్య సిబ్బందితో కలిసి రక్తహీనత గల చిన్నారులను గుర్తించి రెట్టింపు పోషకాహారాన్ని అందించారు.
► ఏడాది క్రితం వరకు గ్రామంలో శిశు మరణాలు 3 శాతం వరకు ఉండగా.. అంగన్‌వాడీలు ప్రత్యేక శ్రద్ధ వహించి గత ఏడాదిలో ఒక్క శిశు, బాలింత మరణం కూడా సంభవించకుండా చర్యలు చేపట్టారు.
► గతంలో గ్రామంలోని 10 శాతం మంది చిన్నారులు రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

బాల్య వివాహాలకు.. బాల కార్మిక వ్యవస్థకు చెక్‌
► దగ్గరి బంధువులనో.. మంచి సంబంధమనో 10వ తరగతిలోపు బాలికలకు పెళ్లిళ్లు చేసేవారు. 
► వీటిని అరికట్టే దిశగా అంగన్‌వాడీ కార్యకర్తలు 2015లో చర్యలు చేపట్టారు. వారికి పంచాయతీ, మండల అధికారుల సహకారం తోడవటంతో బెదిరింపులు వచ్చినా ఎదురొడ్డి నిలబడి బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించారు.
► గ్రామంలోని 80 వరకు ఇటుకల బట్టీలు, కూరగాయల సాగు విస్తరించి ఉన్నాయి. 2018 నాటికి 52 బాల కార్మికులు ఉండగా వారిని గుర్తించి బడిబాట పట్టించారు.

అవార్డు రావడం గర్వంగా ఉంది
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ‘చైల్డ్‌ ఫ్రెండ్లీ పంచాయతీ’ అవార్డు మా గ్రామానికి దక్కడం చాలా గర్వంగా ఉంది. 
యు.రేణుక, పంచాయతీ కార్యదర్శి

నిరంతర పర్యవేక్షణ
పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్ల వయసు చిన్నారుల వరకు వారికి నిర్ణీత సమయంలో వైద్య సేవలందించి శిశు మరణాలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించాం.
ఎం.సుమలత, పీహెచ్‌సీ అధికారి, చొప్పెల్ల

పౌష్టికాహార లోపం లేకుండా పర్యవేక్షణ
చిన్నారుల్లో పౌష్టికాహార లోపం లేకుండా చర్యలు తీసుకున్నాం. నిరంతరం ఆటపాటలు నేర్పించి చురుకుదనం పెరిగేందుకు కృషి చేశాం. 
ఎల్‌.విజయ కుమారి, అంగన్‌వాడీ కార్యకర్త

మరిన్ని వార్తలు