రెండేళ్లలో ఖాతాల్లోకి నేరుగా రూ.లక్ష కోట్లు

24 Jun, 2021 03:50 IST|Sakshi

రాష్ట్రంలో ప్రత్యక్ష నగదు బదిలీతో సరికొత్త విప్లవం

రెండేళ్లలో రూ.1,00,116.35 కోట్లు నేరుగా లబ్ధిదారులకు బదిలీ 

పథకాల ద్వారా 6,53,12,534 మంది లబ్ధిదారులకు ప్రయోజనం

అవినీతి, లంచం, దుర్వినియోగం లేకుండా నగదు చేరవేతతో రికార్డు 

సచివాలయ వ్యవస్థతో ప్రజల ముంగిటకే ప్రభుత్వ పాలన

కరోనా కష్టకాలంలోనూ ఆగని సంక్షేమ పథకాల అమలు

సోషల్‌ ఆడిట్‌తో అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు

తద్వారా సొంత కాళ్లపై నిలబడ్డ లక్షలాది మంది మహిళలు

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పరిపాలనా సంస్కరణల్లో ప్రత్యక్ష నగదు బదిలీ ప్రక్రియ మరో మైలు రాయిని దాటింది. రెండో ఏడాది వరుసగా చేయూత పథకంతో పాటు గత రెండేళ్ల కాలంలో వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.1,00,116.35 కోట్లను అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేసి రికార్డు సృష్టించింది. వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులు 6,53,12,534 ప్రయోజనాలను పొందారు. రెండేళ్ల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అర్హులైన పేదల బ్యాంకు ఖాతాలకు వివిధ పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. లక్ష కోట్ల రూపాయలకు పైగా నగదు బదిలీ చేసినప్పటికీ పైసా కూడా పక్కదోవ పట్టకపోవడం విశేషం. ఎక్కడా పైసా అవినీతి, లంచాలకు ఆస్కారం లేకుండా దుర్వినియోగం అనే మాట వినపించకుండా ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేసింది. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా కేవలం అర్హత ప్రమాణికంగా లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీ జరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ప్రతిపక్షాలు వేలెత్తి చూపలేని స్థితిలో ఉన్నాయంటేనే ముఖ్యమంత్రి ఎంత చిత్తశుద్ధితో వాటిని అమలు చేశారో ఇట్టే స్పష్టం అవుతోంది. 

ప్రజల ముంగిటకే ప్రభుత్వ పథకాలు
వైఎస్‌ జగన్‌ తన సుదీర్ఘ పాదయాత్రలో అన్ని వర్గాల కష్టాలను స్వయంగా చూసి, వాటిని పరిష్కరించేందుకు తీసుకున్న కీలక నిర్ణయాలు కోట్లాది మంది పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్నాయి. అర్హతే ప్రామాణికంగా, పేదరికమే కొలమానంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జాతీయ స్థాయిలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గ్రామ స్థాయిలోకి పాలనను తీసుకెళ్లేందుకు విప్లవాత్మకంగా సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి, లక్షల సంఖ్యలో సేవాసైన్యం (వలంటీర్ల)ను సిద్ధం చేసి, ప్రజల గడప వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకువచ్చారు. 

అర్హతే ప్రామాణికత.. సంతృప్త స్థాయిలో అమలు
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలన్న సీఎం జగన్‌ ఆదేశాలతో, దరఖాస్తు చేసుకున్న వారికి నిర్ణీత సమయంలోనే ఆయా పథకాలను చేరువ చేశారు. వలంటీర్లు.. సచివాలయాల్లో అందచేసిన దరఖాస్తులను నిర్ధిష్ట కాల పరిమితిలో పరిష్కరించడం, లబ్ధిదారుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించడం ద్వారా సోషల్‌ ఆడిట్‌ చేస్తున్నారు. ఎక్కడైనా అర్హులు తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని చెబితే, వారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇది నిరంతర ప్రక్రియగా మార్చారు. సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేయాలనే లక్ష్యంతో సీఎం జగన్‌ పని చేస్తున్నారు. ప్రతి పథకం ఎప్పుడు, ఏ నెలలో అమలు చేస్తున్నారో ముందుగానే స్పష్టంగా ప్రకటిస్తున్నారు. గతంలో పాలకులు ప్రభుత్వ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారో, ఎంత మందికి ఇస్తారో స్పష్టంగా ప్రకటించిన దాఖలాలు లేవు. దరఖాస్తు చేసుకున్న వారిలో కూడా కొందరికి మాత్రమే మంజూరు చేసేవారు. అర్హత ఉన్నా, రాజకీయ సిఫారసులు లేకపోవడం వల్ల అనేక మంది లబ్ధి పొందే పరిస్థితి ఉండేది కాదు. ఈ మొత్తం పరిస్థితిని మారుస్తూ, కేవలం అర్హత మాత్రమే ప్రాతిపాదికన సీఎం జగన్‌ ప్రభుత్వ పథకాల అమలులో సంస్కరణలు తీసుకువచ్చారు. 

కోవిడ్‌ సమయంలోనూ చెక్కు చెదరని సంకల్పం
కోవిడ్‌ సంక్షోభంతో ప్రపంచమంతా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో సీఎం జగన్‌ సంకల్పం చెక్కు చెదరలేదు. అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యార్థులు, నిరుపేదలు, రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం, సమగ్ర పురోగతి ధ్యేయంగా పథకాల అమలులో తన చిత్తశుద్దిని చాటుకుంటున్నారు. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లోనూ ముందుగా ప్రకటించిన మేరకు సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎటువంటి మార్పు లేకుండా అమలు చేస్తుండటం విశేషం. కోవిడ్‌ లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన తెల్లరేషన్‌ కార్డు కలిగిన పేదలను ఆదుకునేందుకు స్పెషల్‌ కోవిడ్‌ అసిస్టెన్స్‌ కింద రాష్ట్ర వ్యాప్తంగా 1,35,05,338 మందికి 1,350.53 కోట్ల రూపాయలు అందచేశారు. 

మహిళలకే అధిక ప్రాధాన్యత
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారు. పిల్లలను పాఠశాలలకు పంపుతున్న 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో డీబీటీ (నేరుగా నగదు బదిలీ) ద్వారా రూ.13,022.93 కోట్లు జమ చేశారు. విద్యార్థుల కోసం అమలు చేస్తున్న జగనన్న వసతి దీవెన కింద 15,56,956 మంది తల్లుల ఖాతాలకు రూ.2,269.93 కోట్లు, విద్యా దీవెన కింద 18,80,934 మంది తల్లుల ఖాతాలకు రూ.4,879.30 కోట్లు జమ చేశారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద స్వయం సహాయక బృందాల మహిళలు 98,00,626 మందికి రూ.2,354.22 కోట్లు, వైఎస్సార్‌ చేయూత కింద 24,55,534 మంది మహిళలకు రూ.8943.52 కోట్లు, వైఎస్సార్‌ ఆసరా కింద 77,75,681 మంది మహిళలకు రూ.6,310.68 కోట్లు, వైఎస్సార్‌ కాపునేస్తం కింద 3,27,862 మంది మహిళలకు రూ.491.79 కోట్లు నేరుగా ప్రభుత్వం జమ చేసింది. ఈ మొత్తాన్ని పెట్టుబడిగా ఉపయోగించుకుని లక్షలాది మంది మహిళలు సొంత కాళ్లపై నిలబడగలిగారు. 

మరిన్ని వార్తలు