కొత్తగా భీమవరం పోలీస్‌ సబ్‌డివిజన్‌ 

28 Apr, 2022 10:03 IST|Sakshi

పోలీసు సేవలు మరింత చేరువ ∙స్టేషన్ల పరిధి మార్పులకు ప్రయత్నం

మారనున్న పోలీసు శాఖ స్వరూపం

నరసాపురం: జిల్లాల పునర్విభజనలో భాగంగా భీమవరం కేంద్రంగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసు శాఖలో మార్పులు జరుగనున్నాయి. కొత్తగా భీమవరం పోలీస్‌ సబ్‌డివిజన్‌ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన జిల్లాలో ఇప్పటికే ఉన్న నరసాపురం పోలీస్‌ సబ్‌డివిజన్‌తో పాటు భీమవరం సబ్‌ డివిజన్‌ ఏర్పాటుకానుంది. దీంతో పోలీసు శాఖలో పాలనపరమైన ఇబ్బందులు తొలగుతాయని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఓ రెవెన్యూ మండలంలోని గ్రామం మరో మండలంలోని పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉంది. దీనివల్ల గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని మార్చాలనే డిమాండ్‌ ఏళ్ల తరబడి ఉన్నా పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొ త్తగా పోలీస్‌ సబ్‌డివిజన్‌ ఏర్పాటు చేయనుండటంతో స్టేషన్ల పరిధిని సవరించే ఆలోచన ఉందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
  
పక్క మండలం స్టేషన్‌ పరిధిలో.. మండలంలోని ఓ గ్రామంలో సమస్య వస్తే పక్క మండలంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నరసాపురం సబ్‌డివిజన్‌ పరిధిలోని పలు గ్రామాల్లో ఉంది. ముఖ్యంగా నరసాపురం రూరల్, మొగల్తూరు, పాలకొల్లు రూరల్, భీమవరం రూరల్‌ ప్రాంతాల పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇలాంటి ఇబ్బందులతో సిబ్బంది సతమతమవుతు న్నారు. ప్రజలూ సమస్యలను ఎదుర్కొంటున్నారు.

నరసాపురం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మత్స్య పురి, తుందుర్రు గ్రామాలు ఉన్నాయి. ఇవి రెండు నరసాపురం మండల పరిధిలోకి రావు. తుందుర్రు గ్రామం భీమవరం రూరల్, మత్స్యపురి గ్రామం వీరవాసరం మండలాలకు చెందినవి.

నరసాపురం రూరల్‌ మండలంలోని ఎల్‌బీచర్ల, పస లదీవి, తూర్పుతాళ్లు, పెదమైనవానిలంక గ్రామాలు మొగల్తూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్నాయి.  

భీమవరం రూరల్‌ మండలానికి చెందిన వెంప గ్రామం ప్రస్తుతం మొగల్తూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉంది. 
తణుకు మండలానికి చెందిన రెండు గ్రామాలు ఇరగవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్నాయి.  
పాలకొల్లు రూరల్‌ మండలంలోని అడవిపాలెం గ్రామం పోడూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉంది. 

సబ్‌డివిజన్‌ ఎలా ఉండవచ్చంటే..  
ప్రస్తుతం నరసాపురం పోలీసు సబ్‌ డివిజన్‌ పరిధిలో 19 పోలీస్‌స్టేషన్లు, ఆరు సర్కిళ్లు ఉన్నాయి. నరసాపురం పట్టణం, నరసాపురం రూరల్, మొగల్తూరు, పాలకొల్లు, పాలకొల్లు రూరల్, ఆచంట, పోడూరు, యలమంచిలి, వీరవాసరం, పెనుగొండ, ఇరగవరం, పెనుమంట్ర, భీమవరం–1 టౌన్, భీమవరం–2 టౌన్, భీమవరం రూరల్, ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు పోలీస్‌స్టేషన్లు పనిచేస్తున్నాయి. 

భీమవరం పోలీసు సబ్‌ డివిజన్‌ కొత్తగా ఏర్పాటు చేస్తే సగం మండలాలు అటు, సగం మండలాలు ఇటు మారవచ్చు. భౌగోళిక అంశాలను పరిగణనలోకి తీసుకుని మండలాల విలీనం జరగనున్నట్టు అధికారులు చెబుతున్నారు.  

ఇబ్బందులు లేకుండా నిర్ణయం  
గతంలో ఉన్న ఇబ్బందులు, సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఓ మండలంలో ఊరు, మరో మండల పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉండటం నరసాపురం డివిజన్‌లో చాలాచోట్ల ఉంది. పోలీసుల విధుల నిర్వహణలో ఇది పెద్ద ఇబ్బంది. కొత్తగా భీమవరం పోలీసు సబ్‌డివిజన్‌ ఏర్పాటు సమయంలో ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోవచ్చు.  
– వి.వీరాంజనేయరెడ్డి, నరసాపురం డీఎస్పీ  

నరసాపురం రెవెన్యూ డివిజన్‌ 
నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, పోడూరు, యలమంచిలి, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, తణుకు, 
ఇరగవరం మండలాలు 

భీమవరం రెవెన్యూ డివిజన్‌ 
భీమవరం, వీరవాసరం, ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, అత్తిలి మండలాలు

మరిన్ని వార్తలు