కొత్తగా 1,000 హెక్టార్లలో కొబ్బరి సాగు

28 Jul, 2021 03:10 IST|Sakshi

1,250 హెక్టార్లలో తోటల పునరుద్ధరణ 

ఉద్యాన–సీడీబీ ఆధ్వర్యంలో రూ.10.76 కోట్లతో అమలు 

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ)తో కలిసి ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొబ్బరి తోటల పునరుద్ధరణ, సాగు విస్తరణ తదితర స్కీమ్స్‌ కోసం రూ.10.76 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా ఆమోదం ఇచ్చింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రత్యేక సీఎస్‌ పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం  అమలు చేస్తోన్న స్కీమ్స్‌ వివరాలు ఇలా ఉన్నాయి. 

► కొబ్బరి విస్తరణ ప్రాజెక్టు కింద ఈ ఏడాది రూ.74.50 లక్షల అంచనాతో 1,000 హెక్టార్లలో కొత్తగా కొబ్బరి సాగులోకి తీసుకురావాలని నిర్ణయించారు. హెక్టార్‌కు రూ.8 వేల చొప్పున సబ్సిడీ ఇస్తారు.  
► పాత తోటల పునరుజ్జీవం, పునరుద్ధరణ పథకం కింద రూ.8.15 కోట్లతో 1,250 హెక్టార్లలో దిగుబడినివ్వని పాత చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటడంతోపాటు ప్రస్తుతమున్న తోటలను మరింత దిగుబడి వచ్చేలా అభివృద్ధి చేస్తారు. తొలి 20 చెట్లకు ఒక్కో చెట్టుకు రూ.500 చొప్పున, ఆ తర్వాత ప్రతీ చెట్టుకు రూ.250 చొప్పున హెక్టార్‌లో 13 వేల చెట్లకు సబ్సిడీ ఇస్తారు.  
► డిమాన్‌స్ట్రేషన్‌ కమ్‌ సీడ్‌ ప్రొడక్షన్‌ ఫామ్‌ (డీఎస్‌పీ) నిర్వహణ కింద వేగివాడలో సీబీడీ ఆధ్వర్యంలో ఉన్న 40 ఎకరాల్లో ఈ ఏడాది రూ.27 లక్షలతో 60 వేల విత్తనోత్పత్తి చేయనున్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 3 లక్షల విత్తనోత్పత్తి కోసం రూ.96 లక్షలు ఖర్చుచేయనున్నారు.  
► రూ.6 లక్షల అంచనాతో ఒక న్యూక్లియర్‌ కోకోనట్‌ సీడ్‌ గార్డెన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ మొత్తాన్ని తొలి ఏడాది రూ.3 లక్షలు, రెండో ఏడాది 1.50 లక్షలు, మూడో ఏడాది రూ.1.50 లక్షల చొప్పున మూడేళ్ల పాటు సర్దుబాటు చేస్తారు. ఇందులో 25 శాతం సబ్సిడీ ఇస్తారు. 
► స్మాల్‌ కోకోనట్‌ నర్సరీ స్కీమ్‌ కింద ఒక్కో నర్సరీకి రూ.2 లక్షల అంచనాతో 10 యూనిట్లను మంజూరు చేయనున్నారు. 25 శాతం సబ్సిడీ ఇస్తారు.  
► ఉత్పత్తిని మెరుగుపర్చే లక్ష్యంతో అమలు చేస్తోన్న ఇంటిగ్రేటెడ్‌ ఫామింగ్‌ ఫర్‌ ప్రొడెక్టివిటీ ఇంప్రూవ్‌మెంట్‌ స్కీమ్‌ కింద 91.82 హెక్టార్లలో నమూనా క్షేత్రాల ప్రదర్శన కోసం రూ.21.53 లక్షలు ఖర్చు చేయనున్నారు.  
► రూ.1.60 లక్షలతో నాలుగు ఆర్గానిక్‌ మెన్యూర్‌ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. 
► ఈ ఏడాది కోకోనట్‌ పామ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ కింద 64 వేల చెట్లకు రూ.9 లక్షలతో బీమా కల్పించనున్నారు. ఇందుకోసం 50 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రం భరించనుండగా, మిగిలిన 25 శాతం రైతులు చెల్లించాల్సి ఉంటుంది.  
► కేర సురక్ష స్కీమ్‌ కింద 370 మంది కొబ్బరి దింపు కార్మికులకు రూ.1.48 లక్షలతో బీమా కల్పించనున్నారు.   

మరిన్ని వార్తలు