ఈ ‘వార్తలు’ మొలకెత్తుతాయ్‌.. మట్టిలో నాటితే చిగురించే వార్తాపత్రిక.. చాలా ఆశ్చర్యంగా ఉందే..!

23 Feb, 2023 12:14 IST|Sakshi

అందుబాటులోకి తెచ్చిన జపాన్‌ పబ్లిషర్‌ ‘మైనిచి షింబున్షా’  

ప్రతిరోజు 40.60 లక్షల కాపీల ముద్రణ  

పర్యావరణహిత పత్రికలకు ఆదరణ పెరుగుతుందన్న ‘వన్‌ ఎర్త్‌’  

సాక్షి, అమరావతి: వార్తా పత్రికను చదివిన తర్వాత ఏం చేస్తారు? ఆకర్షించే అంశాలుంటే దాచుకుంటారు. లేదంటే చింపి ఇంట్లో అవసరాలకు వాడుకుంటారు. ఎక్కువగా ఉంటే కేజీల్లెక్కన అమ్మేస్తారు. కానీ, వార్తాపత్రికను చదివేశాక మట్టిలోకప్పెడితే.. పరిమళాలు వెద­జల్లే పూల మొక్క­గానో, ఆరోగ్యాన్నిచ్చే ఔషధ మొక్కగానో మొలకెత్తితే అద్భుతమే కదా! ఈ ప్రయత్నమే చేసింది జపాన్‌లోని ‘మైనిచి షింబున్షా’. ఆ ప్రచురుణ సంస్థ 2016లో ప్రారంభించిన ‘గ్రీన్‌ న్యూస్‌పేపర్‌’ ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ప్రస్తుత పర్యావరణ సమస్యలపై పిల్లలకు అవగాహన పెంచడానికి, భవిష్యత్‌ తరానికి పేపర్‌ రీసైక్లింగ్‌ ప్రాముఖ్యతను బోధించేందుకు ఉత్తమ మార్గంగా ఈ పత్రిక ప్రత్యేకతను అక్కడి పాఠ్యాంశాల్లో చేర్చడం గమనార్హం.  

‘ది మైనిచి షింబున్షా’ మే 4, 2016న ‘గ్రీనరీ డే’ కోసం తొలిసారి ఈ పత్రికను ప్రచురించింది. పర్యావరణ వార్తల­కు అంకితం చేస్తూ 100 శాతం బయోడిగ్రేడబుల్‌ పేపర్‌తో ప్రత్యేక ఎడిషన్‌గా వచ్చిన తొలి పత్రికగా ఇది గుర్తింపు పొందింది.

పాత కాగితాలను రీసైకిల్‌ చేసి, దానికి వివిధ రకాల మొక్కల విత్తనాలను జతచేసి తయారు చేసిన కాగితాన్ని ముద్రణ కోసం వినియోగిస్తున్నారు. వార్తలను ముద్రించేందుకు కూడా మొక్కల నుంచి తీసిన సహజసిద్ధ సిరాను వినియోగించడం మరో ప్రత్యేకత.

జపాన్‌ మార్కెట్‌లో ప్రతిరోజు సుమారు 40.60 లక్షల మందికి చేరుతున్న ఈ పత్రికను చదివిన అనంతరం మట్టిలో పడేస్తే దాన్నుంచి మొక్కలు మొలిచి సీతాకోక చిలుకలను ఆకర్షించే పూలు పూయడం అంతకంటే ప్రత్యేకం.  

పత్రికలకు పెరుగుతున్న ఆదరణ 
వార్తా పత్రికలకు అవసరమైన కాగితం కోసం ప్రపంచంలో ఏటా 95 మిలియన్‌ చెట్లను నరికివేస్తున్నట్టు పర్యావరణం పరిరక్షణకు కృషి చేస్తోన్న అమెరికాకు చెందిన ‘వన్‌ ఎర్త్‌’ ఎన్‌జీవో సంస్థ చెబుతోంది.

అయితే, పర్యావరణ ప్రయోజనాన్ని గుర్తించిన మైనిచి షింబున్షా సంస్థ అందుబాటులోకి తెచ్చిన గ్రీన్‌ న్యూస్‌పేపర్‌కు జపాన్‌లో వచ్చిన ఆదరణను చూస్తుంటే.. ఇంటర్నెట్‌ కాలంలో కూడా ఇలాంటి పత్రికలను రీడర్స్‌ విపరీతంగా ఆదరిస్తారని నిరూపితమైనట్టు పేర్కొంది.

గ్రీన్‌ న్యూస్‌పేపర్‌ ముద్రణ ద్వారా ప్రచురణకర్త 7 లక్షల డాలర్లకు పైగా ఆర్జించడం పెద్ద సంచలనంగా వన్‌ ఎర్త్‌ పేర్కొంది. ఇది వార్తాపత్రిక పరిశ్రమకు పెరుగుతున్న ఆదరణగా, పర్యావరణంపై ప్రజల్లోని చైతన్యానికి గుర్తుగా వివరించింది.

భారతదేశంతో సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోను మొలకెత్తే పత్రికల ముద్రణ ప్రారంభమైందని, అమెరికాలోని అనేక కంపెనీలు వివిధ ప్రయోజనాల కోసం ప్లాంటేషన్‌ పేపర్‌ను తయారు చేయడం ప్రారంభించినట్టు పేర్కొంది. ఇటీవల వన్‌ ఎర్త్‌ చేసిన సర్వేలో భారత్‌లో శుభలేఖలు, యూరప్‌లో 74 శాతం గ్రీటింగ్‌ కార్డులను మొలకెత్తే రీతిలో తీసుకొచ్చినట్టు తెలిపింది.

పచ్చదనం పెంచడానికి దోహదం
ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెంచే కార్యక్రమాలను జపాన్‌ ప్రభుత్వం ముమ్మరం చేసిన నేపథ్యంలో దేశంలో పచ్చదనం పెంపునకు తమ పత్రిక దోహదం చేస్తున్నట్టు ప్రచురుణ సంస్థ ది మైనిచి షింబున్షా ప్రకటించింది. పత్రిక చదవడం పూర్తయిన తర్వాత చిన్న ముక్కలుగా చింపేసి, ఆ ముక్కలను మట్టిలో నాటాలని, ఆపై ఇతర మొక్కల మాదిరిగానే నీరు పెట్టాలని వారు సూచిస్తున్నారు.

జపాన్‌లోని అతిపెద్ద అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీలలో ఒకటైన డెంట్సు ఇంక్‌ ఈ విధానాన్ని కనిపెట్టి, మైనిచితో కలిసి పనిచేస్తోంది. గత కొన్నేళ్లుగా ది మైనిచి షింబున్షా పబ్లిషర్స్‌ జపాన్‌ పాఠశాలల్లో పర్యావరణ సమస్యలపై అవగాహన పాఠాలు చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు