హైటెక్‌ వ్యవసాయం..మేము సైతం అంటున్న విద్యాధికులు

20 Aug, 2022 09:02 IST|Sakshi

సేంద్రియ సేద్యానికి ప్రభుత్వం ప్రోత్సాహం.. రైతులకు పెద్ద ఎత్తున శిక్షణ, సహకారం 

భారీగా తగ్గిన పురుగు మందుల వినియోగం..

 ‘తాతా... నాకు వ్యవసాయం నేర్పుతావా?’  
– మహర్షి సినిమాలో 
రుషి పాత్రధారి మహేష్‌బాబు ప్రశ్న 
‘ఒకరు నేర్పేదేంటి బాబూ...? ఈ నేలపైన కాలు పెడితే ఆ భూమి తల్లే నిన్ను లాగేసుకుంటది’  
– ఓ తాత సమాధానం 

నాడు వ్యవసాయం దండగని పాలకులు చిన్నచూపు చూస్తే నేడు పండుగలా మార్చి అన్నదాతకు అండగా నిలుస్తోంది ప్రభుత్వం. రైతన్నలకు మేలు చేయడంతోపాటు ఆరోగ్యకరమైన సమాజం దిశగా చర్యలు చేపట్టింది. పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు, బయో పెస్టిసైడ్స్‌ వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. రైతులకు అవగాహన కలిగించేందుకు రాష్ట్ర స్థాయిలో రైతు సాధికారత సంస్థ పర్యవేక్షిస్తుండగా జిల్లాల్లో డిస్ట్రిక్ట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు పనిచేస్తోంది.

ఇందులో నేచురల్‌ ఫార్మింగ్‌ అసోసియేట్స్‌  (ఎన్‌ఎఫ్‌ఏ) మాస్టర్‌ ట్రైనర్స్, యూనిట్‌ ఇన్‌చార్జిలు, గ్రామ స్థాయిలో ఇంటర్నల్‌ కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్లు (ఐసీఆర్‌సీ) పని చేస్తున్నారు. ఒక్కో ఐసీఆర్‌సీ 50–100 మంది రైతులను గుర్తించి ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా దగ్గరుండి సహకారం అందిస్తోంది. ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని ఏర్పాటు చేసి దేశీ విత్తనాలు, 40 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లను సమకూరుస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులకు ప్రభుత్వం మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తోంది. ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహంతో రైతులతో పాటు ఉద్యోగులు సైతం సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు.  

తగ్గిన పురుగుమందుల వినియోగం..            
2020–21 ఖరీఫ్‌ (1,388.48 మెట్రిక్‌ టన్నులు)తో పోలిస్తే 2021–22 (1,018 మెట్రిక్‌ టన్నులు) ఖరీఫ్‌లో పురుగు మందుల వినియోగం 370.48 మెట్రిక్‌ టన్నులు తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం పంటల విధానంలో మార్పు, సమగ్ర తెగుళ్ల నిర్వహణ పద్ధతులు, బయో పెస్టిసైడ్‌ల వాడకం, సేంద్రియ వ్యవసాయం తదితర విధానాలను ప్రోత్సహించటం దీనికి కారణం. 2014–15లో 4,050 మెట్రిక్‌ టన్నుల పురుగు మందులు వినియోగించగా 2020–21 నాటికి 2,342.86 మెట్రిక్‌ టన్నులకు తగ్గడం గమనార్హం. 

ప్రత్యేక యూనివర్సిటీ.. 
ప్రకృతి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు చేపట్టే పరిశోధనలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పులివెందుల ఐజీ కార్ల్‌ ప్రాంగణంలో ఇండో–జర్మన్‌ ప్రపంచ వ్యవసాయ విజ్ఞాన పరిశోధన–శిక్షణా అకాడమీ (ఐజీజీఏఏఆర్‌ఎల్‌)ని ఏర్పాటు చేస్తోంది. ఈ యూనివర్సిటీకి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జూలై 7వ తేదీన శంకుస్థాపన చేశారు. జర్మనీ గ్రాంట్‌తో రూ.222 కోట్ల వ్యయంతో యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతోంది.

-బీవీ రాఘవరెడ్డి

టెక్కీ.. హైటెక్‌ వ్యవసాయం
గుంటూరుకు చెందిన బీటెక్‌ గ్రాడ్యుయేట్‌ మెండా నిశ్చల్‌కుమార్‌ లండన్‌లో ఉన్నత విద్య చదివాడు. ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా కొన్నేళ్లు పనిచేశాడు. ఆయన తండ్రి డాక్టర్‌ ఫణికుమార్‌ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో కంటి విభాగం హెచ్‌వోడీగా పదవీ విరమణ చేయగా తల్లి కె.విజయకుమారి గుంటూరు మెడికల్‌ కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం హెచ్‌వోడీగా ఉన్నారు.

ఉద్యోగంతో సంతృప్తి చెందని నిశ్చల్‌ స్వదేశానికి తిరిగి వచ్చి నరసరావుపేటకు సమీపంలోని కోటప్పకొండకు 8 కి.మీ. దూరంలో ‘ఎన్‌సీ ఎకోఫారమ్స్‌’ ఏర్పాటు చేశారు. ఇక్కడ 60 ఎకరాల్లో 11 రకాల పంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. గొర్రెలు, ముర్రా గేదెలు, గిరి, సహివాల్, ఒంగోలు జాతి ఆవులను పోషిస్తున్నారు. నాటు, గిరిరాజ, అశీక క్రాస్, గిన్నె, టర్కీ కోళ్లను పెంచుతున్నారు.

అమెరికాలో ఉద్యోగం.. స్వగ్రామంలో సేద్యం
అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తువ్వదొడ్డి గ్రామానికి చెందిన మధు కేశవరెడ్డి ఏటా రెండు నెలలు గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన సోదరులు మద్దిలేటిరెడ్డి, మహేశ్వరరెడ్డి సహకారంతో 40 ఎకరాల్లో దానిమ్మ, 25 ఎకరాల్లో మామిడి తోటల పెంపకం చేపట్టారు. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంటూ అమెరికా నుంచే వీడియో కాల్‌ ద్వారా సోదరులకు సాగులో మెళకువలు సూచిస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో తోటలు సాగు చేసేందుకు పది ఆవులను ప్రత్యేకంగా పెంచుతున్నారు. గ్రామంలో రైతులకు సైతం సూచనలు అందిస్తూ ప్రకృతి వ్యవసాయంలో  పాలు పంచుకుంటున్నారు. 

ఉద్యోగాన్ని వీడి.. 
వైఎస్సార్‌ జిల్లా చెన్నూరు మండలం ఉప్పరపల్లె గ్రామానికి చెందిన గాజులపల్లి జగన్‌మోహన్‌రెడ్డి మహీంద్ర అండ్‌ మహీంద్ర డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేశారు. ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసి 16 ఎకరాల్లో పండ్ల తోటలు, మరో 10 ఎకరాల్లో దేశీయ వరి పంట సాగు చేస్తున్నారు. ప్రభుత్వ సహకారం, అధికారుల సూచనలతో ఇబ్బందులను అధిగమిస్తున్నట్లు ఆయన తెలిపారు.   

(చదవండి: గుంటూరు నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు)

మరిన్ని వార్తలు