ఎన్‌జీ రంగా వర్సిటీ సేవలు దేశానికి అవసరం 

17 Nov, 2022 04:51 IST|Sakshi
కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు డాక్టరేట్‌ ప్రదానం చేస్తున్న వీసీ విష్ణువర్దన్‌రెడ్డి, మంత్రులు కాకాని గోవర్ధన్‌రెడ్డి, అంబటి రాంబాబు

దేశంలో 11వ స్థానంలో ఎన్జీ రంగా వర్సిటీ 

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌  

అధ్యాపకులు, విద్యార్థులతో చర్చాగోష్టి 

తిరుపతి ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌లో సాగయ్యే వివిధ పంటలకు నూతన వంగడాలు రూపొందించడం, కొత్త సాంకేతికతను అందించడం, దేశ ఆహార భద్రతను సాధించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సేవలు దేశానికి ఎంతో అవసరమని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చెప్పారు. తిరుపతిలోని వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో బుధవారం వీసీ డాక్టర్‌ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి అధ్యక్షతన అధ్యాపకులు, విద్యార్థులతో చర్చాగోష్టి నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ 11వ స్థానంలో నిలవడంలో అధికారులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకుల పాత్ర కీలకమని చెప్పారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తల కృషి ఫలితంగా దేశం ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడమేగాక ఆహారధాన్యాలు, వివిధ పంట ఉత్పత్తులను ఎగుమతి చేయగలుగుతోందన్నారు. 

వరిసాగు విస్తీర్ణంలో సగం సాగు ఈ వర్సిటీ రూపొందించిన విత్తనాలే..   
వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన వరి విత్తనాలు బి.పి.టి–5204 (సాంబమసూరి), స్వర్ణ, విజేత, వేరుసెనగ విత్తనాలు కె–6, ధరణి వంటి రకాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయని చెప్పారు. దేశంలో వరిసాగులో దాదాపు సగం విస్తీర్ణంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన విత్తన రకాలే సాగవుతున్నట్లు తెలిపారు.

దేశంలో మొదటిసారిగా వ్యవసాయ విద్యలో గ్రామీణ అనుభవ పథకాన్ని ప్రవేశపెట్టడం, వ్యవసాయరంగంలో డ్రోన్ల వినియోగం వంటి ఆవిష్కరణలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అమలు చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో 14.5 శాతం వృద్ధి సాధించినట్లు చెప్పారు. ఇటీవల కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటించిన గౌరవ డాక్టరేట్‌ను మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అంబటి రాంబాబు, వర్సిటీ వీసీ డాక్టర్‌ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు పి.వి.మిథున్‌రెడ్డి, డాక్టర్‌ ఎం.గురుమూర్తి, ఎన్‌.రెడ్డప్ప, శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్‌ వి.పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు