ఏకీకృత రిజస్ట్రేషన్లు.. ఏపీ సన్నాహాలు

24 Apr, 2021 05:08 IST|Sakshi

దేశమంతా ఒకే తరహా రిజిస్ట్రేషన్ల కోసం ఎన్‌జీడీఆర్‌ఎస్‌ రూపకల్పన 

ఇప్పటికే 12 రాష్ట్రాల్లో కొత్త విధానంలో రిజిస్ట్రేషన్లు

దీనిని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు కసరత్తు

కంకిపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు

సాక్షి, అమరావతి: ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏకీకృత విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశం మొత్తం ఒకే రిజిస్ట్రేషన్ల విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నిధులతో ఎన్‌జీడీఆర్‌ఎస్‌ (నేషనల్‌ జనరిక్‌ డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌)ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఈ విధానం అమలవుతోంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు అనుకూలంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకునేందుకు అనువుగా ఈ విధానానికి రూపకల్పన చేశారు. ఆస్తులు, లీజ్‌ అగ్రిమెంట్లతో పాటు రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలన్నీ దేశం మొత్తం మీద ఒకే విధానంలో ఉండేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను పుణె ఎన్‌ఐసీ అభివృద్ధి చేసింది. ఇదే విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేసేందుకు పుణే ఎన్‌ఐసీతో కొద్దిరోజులుగా ఏపీ ఎన్‌ఐసీ కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల కోసం వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ స్థానంలో ఎన్‌జీడీఆర్‌ఎస్‌ను తీసుకురానున్నారు. ఇప్పటికే కృష్ణాజిల్లా కంకిపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తున్నారు. ఆ కొత్త వ్యవస్థపై పూర్తిగా అవగాహన వచ్చాక రాష్ట్రమంతా అమలు చేసే యోచనలో ఉన్నారు. 

1999 నుంచి కంప్యూటరీకరణ 
భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన రికార్డులన్నింటినీ గతంలో మాన్యువల్‌గా నిర్వహించేవారు. స్టాంప్‌ పేపర్లపై రాసి వాటినే భద్రపరిచేవారు. 1999లో ఉమ్మడి రాష్ట్రంలో కార్డ్‌ సెంటర్‌ ఆర్కిటెక్చర్‌ (సీసీఏ) ద్వారా రిజిస్ట్రేషన్ల వ్యవస్థనంతటినీ కంప్యూటరీకరించారు. అప్పటి నుంచి రిజిస్ట్రేషన్లన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఈసీలు, నకళ్లను ఆన్‌లైన్‌లోనే జారీ చేస్తున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ సీసీఏ ద్వారానే రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పత్రాలను ఆన్‌లైన్‌లోనే జారీ చేస్తున్నారు. ఇప్పుడు దీని స్థానంలో అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉండేలా రూపొందించిన ఎన్‌జీడీఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానం వల్ల మన రాష్ట్రంలో జరిగే రిజిష్ట్రేషన్లు, దానికి సంబంధించిన వ్యవస్థ అంతా దేశ వ్యాప్తంగా అమలవుతున్న ఏకీకృత రిజిష్ట్రేషన్ల నెట్‌వర్క్‌లోకి వస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసేవాళ్లు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులు పెట్టేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది. అవకతవకలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభమవుతుంది
ఎన్‌జీడీఆర్‌ఎస్‌తో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంకా సులభమవుతుంది. దేశంలోని ఏ రాష్ట్రం నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ల వ్యవస్థ అంతా ఒకే ప్లాట్‌ఫామ్‌ కిందకు వస్తుంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు ఇది ఎంతో ఉపయోగం. కంకిపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పైలట్‌గా తీసుకుని లోటుపాట్లన్నింటినీ పరిశీలిస్తున్నాం. ఆ తర్వాత వీలును బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. 
– ఎంవీ శేషగిరిబాబు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఐజీ   

మరిన్ని వార్తలు