రూ.1,513 కోట్లతో ఎన్‌హెచ్‌ 167బి 

3 Oct, 2021 04:51 IST|Sakshi

మైదుకూరు నుంచి సింగరాయకొండ వరకు నిర్మాణం 

సాక్షి, అమరావతి: ఆంద్రప్రదేశ్‌లో మరో ప్రధాన రహదారిని అభివృద్ధి చేయాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయించింది. వైఎస్సార్‌ జిల్లాను చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారితో అనుసంధానిస్తూ ‘ఎన్‌హెచ్‌–167బి’ ని రెండు లేన్లు + పావ్డ్‌ సోల్డర్స్‌ (12 అడుగుల వెడల్పు)గా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం మైదుకూరు నుంచి ప్రకాశం జిల్లా సింగరాయకొండ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖకు సమర్పించిన నివేదికలో ఈ రహదారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. 189 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నాలుగు ప్యాకేజీల కింద మొత్తం రూ.1,513.31 కోట్లతో నిర్మించేందుకు ఆమోదించారు. దీన్లో మాలకొండ నుంచి సింగరాయకొండ వరకు 46 కిలోమీటర్ల రహదారికి రూ.369.81 కోట్లతో పనులకు టెండర్ల ప్రక్రియ చేపట్టారు. మిగిలిన రూ.1,143.5 కోట్ల పనుల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీ పూర్తికావచ్చింది. 

మరిన్ని వార్తలు