డయాఫ్రమ్‌ వాల్‌ డ్యామేజ్‌మానవ తప్పిదమే

6 Mar, 2023 03:32 IST|Sakshi
దెబ్బతిన్న డయా ప్రమ్‌ వాల్‌ ప్రాంతం(ఫైల్‌)

డయాఫ్రమ్‌ వాల్‌ డ్యామేజ్‌పై తేల్చేసిన ఎన్‌హెచ్‌పీసీ 

వరద మళ్లించేలా స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌లు కట్టకుండా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం ఘోర తప్పిదం

కాఫర్‌ డ్యామ్‌ అడ్డంకిగా మారడంతో 2019లో పోటెత్తిన గోదావరి

ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–2 ప్రాంతంలో 35 మీటర్ల మందంతో కోతకు గురైన నదీ గర్భం

డయాఫ్రమ్‌ వాల్‌ ఎడమవైపు 175–363 మీటర్లు, కుడివైపు 1,170–1370 మీటర్ల మధ్య కోత

480–510 మీటర్లు, 950–1,020 మీటర్ల మధ్య 20 మీటర్ల లోతు వరకు దెబ్బతిన్న ‘డయాఫ్రమ్‌’

ఆది నుంచి చెబుతున్న వాస్తవాలను అధికారికంగా ధ్రువీకరించిన ఎన్‌హెచ్‌పీసీ నివేదిక

చంద్రబాబు నిర్వాకాలు మరోసారి తేటతెల్లం... నిర్మాణంలో జాప్యానికి ఈ పాపాలే కారణం

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరంపై చంద్రబాబు సర్కారు అనాలోచిత నిర్ణయాలు.. ప్రణాళికా రాహిత్యం.. కమీషన్ల దాహంతోనే డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బ తిందని ఆది నుంచి చెబుతున్న వాస్తవాలను ఎన్‌హెచ్‌పీసీ నివేదిక అధికారికంగా ధ్రువీకరించింది. చంద్రబాబు పాపాలే ప్రాజెక్టుగా శాపాలుగా మారాయని, లేదంటే 2021 నాటికే సీఎం జగన్‌ పోలవరాన్ని పూర్తి చేసేవారని నీటి పారుదల రంగ నిపుణులు, అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

800 మీటర్లకు కుచించుకుపోవడంతో..
గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా అప్రోచ్‌ చానల్, స్పిల్‌వే, స్పిల్‌ చానల్, పైలట్‌ చానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేయకుండా టీడీపీ సర్కారు ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–2లో 1,750 మీటర్ల పొడవున డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించడం ఘోర తప్పిదమని నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) నివేదిక తేల్చి చెప్పింది. ఆ మానవ తప్పిదం వల్లే 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ అడ్డంకిగా మారడంతో ఖాళీ ప్రదేశం 800 మీటర్లకు కుచించుకుపోయి ప్రవహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.

ఇది వరద ఉద్ధృతి తీవ్రతరం కావడానికి దారితీసింది. అందువల్లే ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో గ్యాప్‌–1లో 35 మీటర్లు, గ్యాప్‌–2లో 20 మీటర్ల లోతుతో భారీ అగాధాలు ఏర్పడ్డాయని ఎన్‌హెచ్‌పీసీ స్పష్టం చేసింది. గ్యాప్‌–2లో డయాఫ్రమ్‌ వాల్‌ ఎడమ వైపున 175 మీటర్ల నుంచి 363 మీటర్ల వరకు ధ్వంసం కాగా కుడి వైపున 1,170 నుంచి 1,370 మీటర్ల వరకు పూర్తిగా ధ్వంసమైందని తేల్చింది.

480 మీటర్ల నుంచి 510 మీటర్ల వరకు, 950 మీటర్ల నుంచి 1,020 మీటర్ల వరకు రెండు చోట్ల 20 మీటర్ల లోతు వరకూ డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిందని తేల్చింది. ఫలితంగా భూగర్భంలో గోదావరి ప్రవాహాన్ని సమర్థంగా అడ్డుకట్ట వేయలేదని పేర్కొంది. డయాఫ్రమ్‌ వాల్‌ను పటిష్టం చేసే చర్యలు చేపడితేనే లీకేజీలకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపింది. 

ఎన్‌హెచ్‌పీసీ సమగ్ర అధ్యయనం..
పోలవరం వద్ద భౌగోళిక పరిస్థితుల రీత్యా వరద ప్రవాహాన్ని మళ్లించే స్పిల్‌వేను నదీ తీరానికి కుడి వైపున రాతి నేలపై, 194.6 టీఎంసీలను నిల్వ చేసే ప్రధాన (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌) డ్యామ్‌ను నదికి అడ్డంగా నిర్మించేలా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ప్రాజెక్టు డిజైన్‌ను ఆమోదించింది. ప్రధాన డ్యామ్‌కి పునాదిగా డయాఫ్రమ్‌ వాల్‌ వేయాలని పేర్కొంది. డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మిస్తేనే భూ గర్భంలో గోదావరి ప్రవాహం ఎగువ నుంచి దిగువకు, దిగువ నుంచి ఎగువకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. అంటే లీకేజీ (ఊట నీరు)కి పూర్తిగా అడ్డుకట్ట వేస్తుంది.

ఇది ప్రధాన డ్యామ్‌ చెక్కు చెదరకుండా కాపాడుతుంది. ప్రధాన డ్యామ్‌కు అత్యంత కీలకమైన డయాఫ్రమ్‌ వాల్‌ను గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించే పనులు పూర్తి చేశాకే చేపట్టాలి. గత సర్కారు అనాలోచితంగా అందుకు విరుద్ధంగా చేపట్టడంతో 2019లో వచ్చిన వరద ఉద్ధృతికి డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. ఈ క్రమంలో దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ సామర్థ్యాన్ని తేల్చేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించింది.

సీడబ్ల్యూసీ సూచనల మేరకు ఎన్‌హెచ్‌పీసీకి ఈ బాధ్యతను అప్పగించింది. జనవరి 26 నుంచి ఫిబ్రవరి 10 వరకూ నాలుగు రకాల పరీక్షలు నిర్వహించిన ఎన్‌హెచ్‌పీసీ సమగ్రంగా విశ్లేషించి రాష్ట్ర జలవనరుల శాఖకు నివేదిక అందచేసింది.

ఈ పాపం.. చంద్రబాబుదే
పోలవరం ప్రాజెక్టును వంద శాతం వ్యయంతో తామే పూర్తి చేస్తామని విభజన చట్టం సాక్షిగా కేంద్ర ప్రభుత్వం  హామీ ఇచ్చింది. కేంద్రమే పూర్తి చేయాల్సిన పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని నాడు సీఎం హోదాలో చంద్రబాబు కోరారు. ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధం కావడంతో 2016 సెప్టెంబరు 6న ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది.

ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారమే నీటిపారుదల విభాగం వ్యయంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే రీయింబర్స్‌ చేస్తామని కేంద్రం విధించిన షరతులకు చంద్రబాబు తలొగ్గారు. రూ.3,302 కోట్ల విలువైన జలాశయం పనులను ‘ఈనాడు’ రామోజీరావు వియ్యంకుడికి చెందిన నవయుగకు, ఎడమ కాలువలో రూ.150 కోట్ల పనులను నాటి ఆర్థిక మంత్రి యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు నామినేషన్‌పై కట్టబెట్టారు.

వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్, కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేయకుండా డయాఫ్రమ్‌ వాల్‌ను పూర్తి చేశారు. ఈ పాపాల కారణంగానే డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. వీటిని సరిదిద్ది సవాళ్లను అధిగమిస్తూ ప్రణాళికాబద్ధంగా సీఎం జగన్‌ పోలవరాన్ని పూర్తి చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు