డయాఫ్రమ్‌ వాల్‌ సామర్థ్యం తేలుస్తాం

30 Jun, 2022 04:42 IST|Sakshi
పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న ఎన్‌హెచ్‌పీసీ బృందం సభ్యులు

పరీక్షలకు మూడు పద్ధతులను ప్రతిపాదించిన ఎన్‌హెచ్‌పీసీ బృందం

వీటిపై 15 రోజుల్లోగా నివేదిక ఇస్తామన్న ఎన్‌హెచ్‌పీసీ ఈడీ కపిల్‌

సాక్షి, అమరావతి/పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టు ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌ వాల్‌ను రెండురోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో సమీక్షించిన నేషనల్‌ హైడ్రోపవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) బృందం.. డయాఫ్రమ్‌ వాల్‌ సామర్థ్యం తేల్చే పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమేనని తెలిపింది. ఇందుకు మూడు పద్ధతులను ప్రతిపాదించింది. వాటిపై 15 రోజుల్లోగా డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ (డీడీఆర్పీ), కేంద్ర జలసంఘం (సీడబ్యూసీ)లకు నివేదిక ఇస్తామని ఎన్‌హెచ్‌పీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎల్‌.కపిల్‌ తెలిపారు.

సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ ఎంపికచేసిన పద్ధతి ప్రకారం డయాఫ్రమ్‌ వాల్‌ సామర్థ్యాన్ని పరీక్షించి నివేదిక ఇస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి కనీసం రెండునెలలు పడుతుందని చెప్పారు. తీస్తా జలవిద్యుత్‌ కేంద్రం నిర్మాణ సమయంలో ఇదేరీతిలో డయాఫ్రమ్‌ వాల్‌ కోతకు గురవడంతో దానికి మరమ్మతులు చేసి, పూర్వస్థితికి తెచ్చామని పేర్కొన్నారు.

కేంద్ర జల్‌శక్తి శాఖ ఆదేశాల మేరకు పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ సామర్థ్యాన్ని తేల్చాలని ఎన్‌హెచ్‌పీసీకి రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ లేఖ రాశారు. దీంతో ఎన్‌హెచ్‌పీసీ ఈడీ ఎస్‌.ఎల్‌.కపిల్‌ నేతృత్వంలో నిపుణులు విపుల్‌సాగర్, ఎ.కె.భారతిలతో కూడిన బృందం మంగళవారం పోలవరం చేరుకుని డయాఫ్రమ్‌ వాల్‌ను పరిశీలించింది. బుధవారం కూడా మరోసారి డయాఫ్రమ్‌ వాల్‌ను పరిశీలించి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్‌ఈ నరసింహమూర్తి, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. 

సామర్థ్యం తేల్చేందుకు సమగ్రంగా పరీక్షలు
గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌ వే, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేయకుండానే పోలవరం ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌–2లో 1,750 మీటర్ల పొడవున 1.5 మీటర్ల వెడల్పు, గరిష్టంగా 90 మీటర్ల లోతుతో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించారు. దీంతో ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో ఖాళీ ప్రదేశాల ద్వా రా అధిక ఉద్ధృతితో వరద ప్రవహించి 400 నుంచి 1,100 మీటర్ల వరకు మినహా కుడి, ఎడమ వైపున డయాఫ్రమ్‌ వాల్‌ కోతకు గురైంది. కోతకు గురైన ప్రాంతంతోపాటు కోతకు గురికాని ప్రాంతంలోను డయాఫ్రమ్‌ వాల్‌ను ఎన్‌హెచ్‌పీసీ బృందం పరి శీలించింది. డయాఫ్రమ్‌ వాల్‌ సామర్థ్యాన్ని తేల్చడానికి మూడురకాల పద్ధతులను ప్రతిపాదించింది. 

ఎన్‌హెచ్‌పీసీ బృందం ప్రతిపాదించిన మూడు పద్ధతులు
► మొదటి పద్ధతి: కోతకు గురికాని ప్రాంతంతోపాటు కోతకు గురైన ప్రాంతంలోను ప్రతి మీటర్‌కు డయాఫ్రమ్‌ వాల్‌ మధ్యలో 20 ఎంఎం వ్యాసంతో ఒకటిన్నర అడుగుల లోతు రంధ్రం చేసి, దాంట్లోకి ఎలక్ట్రోడ్స్‌ పంపి సామర్థ్యాన్ని పరీక్షించడం. 
► రెండో పద్ధతి: కోతకు గురికాని ప్రాంతంతోపాటు కోతకు గురైన ప్రాంతంలోను ప్రతి 40 మీటర్లకు ఒకచోట డయాఫ్రమ్‌ వాల్‌ మధ్యలో 20 ఎంఎం వ్యాసంతో ఆరుమీటర్ల వరకు రంధ్రం చేసి, దాంట్లోకి ఎలక్ట్రోడ్స్‌ పంపి సామర్థ్యాన్ని పరీక్షించడం. ఇందుకు డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించిన బావర్‌–ఎల్‌అండ్‌టీ సంస్థ అనుమతి తీసుకోవాలి. 
► మూడో పద్ధతి: డయాఫ్రమ్‌ వాల్‌కు ఒక మీటర్‌ ఎగువన, ఒక మీటర్‌ దిగువన ప్రతి 40 మీటర్లకు ఒకచోట జిగ్‌జాగ్‌ విధానంలో 90 మీటర్ల లోతు వరకు బోర్లు తవ్వి, వాటిలోకి ఎలక్ట్రోడ్స్‌ పంపి సామర్థ్యాన్ని పరీక్షించడం. 

ఎన్‌హెచ్‌పీసీ నివేదికే కీలకం
ప్రపంచంలో డయాఫ్రమ్‌ వాల్‌ సామర్థ్యం తేల్చే పరీక్షలపై ఎన్‌హెచ్‌పీసీకి మినహా ఏ సంస్థకు అవగాహన లేదని నిపుణులు చెబుతున్నారు. పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌పై పరీక్షలు చేసి ఎన్‌హెచ్‌పీసీ ఇచ్చే నివేదికే కీలకం. ఆ నివేదిక ఆధారంగానే డయాఫ్రమ్‌ వాల్‌పై సీడబ్ల్యూసీ తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం ఉన్న దానికి సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలా? లేదంటే కోతకు గురైన ప్రాంతంలో మాత్రమే కొత్తగా నిర్మించి, ఇప్పుడున్న దానికి అనుసంధానం చేయాలా? అన్నది తేల్చనుంది. డయాఫ్రమ్‌ వాల్‌ భవితవ్యం తేలాక.. రాష్ట్ర ప్రభుత్వం ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులు చేపట్టనుంది. ఎన్‌హెచ్‌పీసీ బృందం వెంట పీపీఏ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రవీణ్, ఐఐటీ నిపుణుడు సందీప్‌ తదితరులున్నారు.  

మరిన్ని వార్తలు