కందుకూరు ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ కేసు నమోదు

19 Jan, 2023 08:45 IST|Sakshi

సాక్షి, అమరావతి: గత నెల 28న నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రోడ్‌ షోలో ఎనిమిదిమంది మృతిచెందిన ఘటనపై జాతీయ మానవహక్కుల సంఘం (నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ – ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కేసు నమోదు చేసింది. జనాలు ఎక్కువమంది వచ్చారని చూపించుకోవడం కోసం ఉద్దేశపూర్వకంగా ఇరుకైన వీధుల్లో రోడ్‌షో ఏర్పాటు చేసి తొక్కిసలాటకు తావిచ్చారని, దీంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ విజయవాడకు చెందిన వైద్యుడు అంబటి నాగరాధాకృష్ణ యాదవ్‌ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి గత నెల 29న ఫిర్యాదు చేశారు.

ఇరుకైన వీధుల్లో జనాలు పోగైతే డ్రోన్‌ షాట్స్‌ బాగా వస్తాయని, వీటిని పార్టీ పబ్లిసిటీ కోసం వినియోగించుకోవచ్చని నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా రోడ్‌ షోకు ప్రణాళిక రచించారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ కోసం చేసిన చర్యల ఫలితంగా తొక్కిసలాట జరిగి 29 మంది మృతిచెందారని ఫిర్యాదు­దారుడు కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కందుకూరు ఘటనపై నిష్పక్షపాతంగా విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తన ఫిర్యాదుపై ఈ నెల 10వ తేదీన కమిషన్‌ కేసు నమోదు చేసిందని రాధాకృష్ణ ‘సాక్షి’ తో చెప్పారు.  

మరిన్ని వార్తలు