విశాఖ ఘటనలో ఏపీ సర్కార్‌ పనితీరు భేష్‌

20 Feb, 2021 08:33 IST|Sakshi

ఎల్జీ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీ

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్‌లో గతేడాది విషవాయువులు లీకైన దుర్ఘటనలో బాధితులను ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంతృప్తినిచ్చాయని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ పేర్కొంది. బాధితులకు పరిహారం అందించడంలో సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన కార్యాచరణ నివేదికను అంగీకరిస్తున్నట్టు తెలిపింది. ప్రాణాలు కోల్పోయిన 12 మంది కుటుంబ సభ్యులకు రూ.కోటి చొప్పున, రెండుమూడు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన 485 మందికి రూ.లక్ష చొప్పున అందజేయడంతోపాటు 12 మందిపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ ప్రారంభించినట్టు ఆ నివేదికలో పేర్కొన్నట్టు తెలిపింది.

గతేడాది మే 7న జరిగిన ఎల్జీ పాలిమర్స్‌ దుర్ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటోగా కేసు స్వీకరించిన విషయం విదితమే. ‘ఆర్‌ఆర్‌వీ పురం, నందమూరి నగర్, కంపరపాలెం, పద్మనాభ నగర్, ఎస్సీ, బీసీ కాలనీ, మేఘాద్రిపేట కాలనీల్లోని 17 వేల ఇళ్ల నుంచి 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి 23 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశాం. ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌పై ఉన్న వారికి రూ.10 లక్షల  చొప్పున, ప్రాథమిక చికిత్స పొందిన 99 మందికి రూ.25 వేల చొప్పున అందజేశాం. ప్రభావిత ప్రాంతాల్లోని 19,893 మందికి రూ.10 వేల చొప్పున, చనిపోయిన 25 జంతువులకు సంబంధించి యజమానులకు రూ.8,75,000 అందజేశాం. ఎన్జీటీ, ఢిల్లీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ వద్ద రూ.50 కోట్లు డిపాజిట్‌ చేశాం’ అని సంబంధిత అధికారులు తెలియజేశారని వెల్లడించింది. 437 మందిని విచారించి 12 మందిపై క్రిమినల్‌ చర్యలు ప్రారంభించడంతోపాటు సంస్థ సీఈవో, డైరెక్టర్లు, సీనియర్‌ అధికారుల పాస్‌పోర్టులు సీజ్‌ చేసినట్టు తెలిపారని ఎన్‌హెచ్‌ఆర్సీ పేర్కొంది. డైరెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్, డిప్యూటీ చీఫ్‌ కంట్రోల్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నివేదికలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది.
చదవండి: పేదల గూటికి టీడీపీ గండి!
ఎస్‌ఈసీకి ఎదురుదెబ్బ.. ఆ అధికారం మీకెక్కడుంది!?

మరిన్ని వార్తలు