రాష్ట్రంలో పలుచోట్ల ఎన్‌ఐఏ సోదాలు

19 Nov, 2021 04:28 IST|Sakshi
ఆలకూరపాడులో కల్యాణ్‌రావు ఇంటి వద్ద ఉన్న స్థానికులు, పోలీసులు

ప్రకాశం, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో తనిఖీలు

విరసం నేత కల్యాణ్‌రావు, మాచర్ల మోహన్‌రావు ఇళ్లల్లో తనిఖీలు

విశాఖ ఆరిలోవలో మహిళా న్యాయవాది ఇంట్లో కూడా

నెల్లూరులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి కుటుంబ సభ్యుల ఇంటిలో సోదాలు

తెలంగాణలోని హైదరాబాద్, మెదక్‌లో కూడా తనిఖీలు

విప్లవ సాహిత్యంతోపాటు సిమ్‌ కార్డులు, పాత ఫోన్, పెన్‌ డ్రైవ్‌లు స్వాధీనం

తనిఖీల్లో పాల్గొన్న ఛత్తీస్‌గఢ్‌ అధికారులు, రాష్ట్ర పోలీసులు

ఒంగోలు/టంగుటూరు/చీరాల/ఆరిలోవ (విశాఖ తూర్పు)/నెల్లూరు (క్రైమ్‌): రాష్ట్రంలో ప్రకాశం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతోపాటు తెలంగాణలోని హైదరాబాద్, మెదక్‌లలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గురువారం సోదాలు నిర్వహించింది. ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. టంగుటూరు మండలం ఆలకూరపాడులో నివాసముంటున్న విరసం నేత కల్యాణ్‌రావు, వేటపాలెం మండలం జాండ్రపేటలోని మాచర్ల మోహన్‌రావు ఇళ్లల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేశారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఆయన పేరుతో హైదరాబాద్‌లో పుస్తకాన్ని ముద్రించేందుకు ఆయన సతీమణి ప్రయత్నించిన నేపథ్యంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ను సైతం పోలీసులు సీజ్‌ చేశారు. మరోవైపు గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంలో కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలిసింది.

ఆర్కేకు చెందిన డైరీ లభించినట్టు తెలిసింది. 2019 జూలై 28న చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. కల్యాణ్‌రావు ఇంట్లో రెండు సంచుల పుస్తకాలను సీజ్‌ చేశారు. ఆయనకు ఆర్థిక సహకారం ఏమైనా అందుతుందా అనే కోణంలోనూ విచారించినట్టు సమాచారం. చేనేత జనసమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు మాచర్ల మోహన్‌రావు ఇంట్లో కూడావిప్లవ సాహిత్యాన్ని సీజ్‌ చేశారు. ఈ తనిఖీల్లో మార్కాపురం ఓఎస్‌డీ కె.చౌడేశ్వరి, ఐదుగురు ఎన్‌ఐఏ అధికారులు, 11 మంది స్పెషల్‌ పార్టీ పోలీసులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  

మహిళా న్యాయవాది అన్నపూర్ణ నివాసంలో..
విశాఖ ఆరిలోవలో మావోయిస్టు సానుభూతిపరురాలు ఎ.అన్నపూర్ణ నివాసముంటున్నారు. ఆమె న్యాయవాదిగా ఉంటూ ప్రగతిశీల కార్మిక సమాఖ్య సభ్యురాలుగా ఉన్నారు. ఆమె భర్త ఎం.శ్రీనివాసరావు కూడా న్యాయవాదే. దీంతో ఎన్‌ఐఏ అధికారులు ఆమె ఇంటిలో సోదాలు చేశారు. రూరల్‌ రెవెన్యూ అధికారుల సమక్షంలో ఇంట్లో లభించిన పలు డాక్యుమెంట్లు, పుస్తకాలు సీజ్‌ చేశారు. మావోయిస్టులకు సహాయసహకారాలు అందిస్తున్నారని గతంలో ఆమెను పోలీసులు రెండుసార్లు అరెస్టు చేసినట్లు తెలిసింది. 

రవి కుటుంబ సభ్యుల ఇంటిలో..
నెల్లూరు అరవిందానగర్‌లో ఎన్‌ఐఏ అధికారులు.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి అలియాస్‌ జైలాల్‌ అలియాస్‌ సునీల్‌ కుమార్‌ కుటుంబసభ్యుల ఇంటిలో సోదాలు నిర్వహించారు. రవి సోదరీమణులు.. అనూష, అన్నపూర్ణల సెల్‌ఫోన్లు, వారు రాసుకుంటున్న కవితల పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా రవి గతేడాది జూన్‌లో జార్ఖండ్‌లోని కొల్హాన్‌ అటవీ ప్రాంతంలో బాణం బాంబును పరీక్షిస్తుండగా తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయారు. 

హైదరాబాద్‌లోనూ సోదాలు
హైదరాబాద్‌లోని నాగోల్‌లో నివాసం ఉండే బీహార్, జార్ఖండ్‌ మావోయిస్టు పార్టీ కమిటీ నేతగా ఉన్న నార్ల రవి శర్మ, ఆయన భార్య బెల్లపు అనురాధ, అల్వాల్‌లో నివాసం ఉంటున్న అమర వీరుల బంధు మిత్రుల కమిటీ సభ్యురాలు పద్మకు మారి, న్యాయ శాస్త్ర విద్యార్థిని బి.పద్మ, కవి అరుణాంక్‌ లత తదితరుల ఇళ్లల్లోనూ, హిమాయత్‌ నగర్‌లోని అదితి ఉమెన్స్‌ హాస్టల్‌లో సోదాలు చేసి విప్లవ సాహిత్యం, పెన్‌ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు.  

ఈ అనుమానాలతోనే సోదాలు..
మావోయిస్టులకు సహకారం అందిస్తున్నట్లు ఆధారాలు లభించినందువల్లే సోదాలు నిర్వహించారని సమాచారం. మెయిల్స్‌ రూపంలో మావోయిస్టు పార్టీకి, వీరికి మధ్య సమాచార మార్పిడి జరిగిందని ఎన్‌ఐఏ అనుమానిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసిన కొందరు మళ్లీ సాయం చేస్తున్నట్లు ఎన్‌కౌంటర్‌ ప్రాంతంలో దొరికిన కొన్ని ఆధారాల ద్వారా బయటపడి ఉంటుందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

ప్రశ్నించడమే నేరంగా మారింది 
సమాజంలో ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడమే నేరంగా మారింది. ఎన్‌ఐఏ అధికారులు ఇంట్లోని ప్రతి పుస్తకాన్ని, కాగితాన్ని పట్టిపట్టి చూశారు. నిజం మాట్లాడేవారిపై, ప్రజల పక్షాన నిలబడేవారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. రాసే హక్కు రచయితకు, మాట్లాడే హక్కు మనిషికి, ఉద్యమం చేసే హక్కు ఉద్యమకారులకు ఉంది. ఇలా వేధించడం అప్రజాస్వామికం.
– కల్యాణ్‌రావు, విరసం నేత

కోర్టు ఆదేశాలతో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.. 
ఎందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారని అధికారులను అడిగాం. కోర్టు ఆదేశాలతోనే తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మా సెల్‌ఫోన్లు, పుస్తకాలను తీసుకెళ్లారు. తమ్ముడు రవి సుమారు ఎనిమిదేళ్ల కిందట ఉద్యోగం కోసం వెళుతున్నా అని ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఇటీవల మృతి చెందడంతో ఉద్యమంలో పనిచేశాడని తెలిసింది. 
– రవి సోదరి అన్నపూర్ణ 

మరిన్ని వార్తలు