రాత్రి కర్ఫ్యూ షురూ

25 Apr, 2021 03:24 IST|Sakshi

షాపులు, రెస్టారెంట్లతో సహా అన్నీ మూసివేత

అత్యవసరాలకు మాత్రమే మినహాయింపు

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో శనివారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు రాత్రి పూట కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని కార్యాలయాలు, సంస్థలు, షాప్‌లు.., ఎస్టాబ్లిష్‌మెంట్స్, రెస్టారెంట్లు రాత్రి 10 గంటలకు మూసివేయాలని ఉదయం 5 గంటల తరువాతనే తెరవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆస్పత్రులు, డయాగ్నిస్టిక్, ల్యాబ్‌లు,  ఫార్మసీ, ఔషధాల అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. 

మినహాయింపు ఉన్నది వీటికే..
రాత్రి పూట కర్ఫ్యూ నుంచి ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాకు, టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్‌ సర్వీసెస్, బ్రాడ్‌ కాస్టింగ్‌ అండ్‌ కేబుల్‌ సర్వీసెస్, ఐటీ అండ్‌ ఐటీ ఆధారిత సేవలు, పెట్రోల్‌ పంపులు, ఎల్‌పీజీ, సీఎన్‌జీ, పెట్రోలియం అండ్‌ గ్యాస్‌ ఔట్‌లెట్స్, విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, కోల్డ్‌ స్టోరేజ్, వేర్‌ హౌసింగ్‌ సర్వీసెస్, ప్రైవేట్‌ సెక్యూరిటీ సేవలు, అవసరమైన సేవల ఉత్పత్తుల యూనిట్లు, ఆహార డెలివరీ సర్వీసెస్‌కు మినహాయింపు ఇచ్చారు. మిగగా కేటగిరీ వ్యక్తుల రాకపోకలను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిషేధించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మున్సిపాలిటీలు, పంచాయతీ ఉద్యోగులు అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు డ్యూటీ పాస్‌ ఉండాలి.

డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది, పారా మెడికల్‌ సిబ్బంది, ఆస్పత్రుల్లో వైద్య సేవల్లో పనిచేసేవారికి తగిన గుర్తింపు కార్డుతో కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తారు. గర్భిణులు, రోగులు, వైద్య పరిశీలనలో ఉన్న వారికి మినహాయింపు ఇచ్చారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్‌ స్టాండులకు వెళ్లే వారు టికెట్‌ చూపితే మినహాయింపు ఇస్తారు. గూడ్స్‌ రవాణాకు రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఎలాంటి పాస్, అనుమతి  లేకుండా అనుమతిస్తారు. కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటిస్తూ ఆటోలు, టాక్సీలు తిరగడానికి అనుమతించారు. ఆంక్షలను ఎవ్వరైనా అతిక్రమిస్తే రాష్ట్ర విపత్తుల నిర్వహణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆంక్షలను విధిగా అమలు చేయాల్సిందిగా కలెక్టర్లు, ఎస్‌పీలు, పోలీసు కమిషనర్లను ఆదేశించారు.   

మరిన్ని వార్తలు