చలి మొదలైంది..!

10 Nov, 2020 03:51 IST|Sakshi

రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదు 

సాక్షి, అమరావతి బ్యూరో/ మహారాణిపేట (విశాఖ దక్షిణ)/ పాడేరు: రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చలి ఊపందుకుంటోంది. పలు చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. విశాఖ ఏజెన్సీలో సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 8 గంటల వరకు చలిగాలుల తీవ్రత ఉంటోంది. అతిశీతల ప్రాంతంగా గుర్తింపు పొందిన లంబసింగిలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఘాట్‌ ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో వాహన చోదకులు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. గడచిన 24 గంటల్లో కృష్ణా జిల్లా నందిగామలో సాధారణ కనిష్ట ఉష్ణోగ్రత 21.4 కాగా 16.2,  శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో 21.8కి 16.6 డిగ్రీలు రికార్డయ్యాయి. విశాఖపట్నంలో 4, కాకినాడలో 3.3, తునిలో 3.1, విజయవాడలో 2.7, నర్సాపురం, బాపట్ల, కడపలలో 2, మచిలీపట్నం, కర్నూలులో 1.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. మరోవైపు పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి 1–2 డిగ్రీలు అధికంగా రికార్డు కావడం గమనార్హం.

► తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతోపాటు ఉత్తరాది నుంచీ చలి గాలులు వీస్తున్నాయని, ఫలితంగా రాష్ట్రంలో చలి ప్రభావం మొదలవడానికి కారణమని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా సోమవారం ‘సాక్షి’కి చెప్పారు. 

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి
దక్షిణ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ద్రోణి ఏర్పడింది. ఈ  ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో  రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.  

మరిన్ని వార్తలు