నామినేషనే వేయని వారికి ఇప్పుడు అవకాశం కుదరదు

1 Mar, 2021 03:53 IST|Sakshi

బలవంతంగా ఉపసంహరించుకున్న నామినేషన్లపై నిర్ణయం తీసుకుంటా

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌

సాక్షి, అమరావతి: మున్సిపల్‌ ఎన్నికల్లో గతంలో అసలు నామినేషన్‌ దాఖలు చేయని అభ్యర్థులకు ఇప్పుడు అవకాశమివ్వడానికి, స్కూృటినీలో తిరస్కరణకు గురైన వాటిని తిరిగి పునరుద్ధరించడానికి ఎన్నికల నిబంధనలు అంగీకరించవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఈ నిబంధనలకు లోబడి కొన్ని పరిమితుల మేరకు బలవంతపు చర్యల ద్వారా నామినేషన్లు విరమించుకున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై సోమ లేదా మంగళవారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానన్నారు. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఇతర జిల్లాల అధికారులతో నిమ్మగడ్డ విజయవాడలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. తర్వాత ఆయా జిల్లాల రాజకీయ పార్టీ నేతలతోనూ వర్చువల్‌ సమావేశంలో మాట్లాడారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మున్సిపల్‌ ఎన్నికల్లో బలవంతం మీద నామినేషన్లు ఉపసంహరించుకున్న విషయంలో అభ్యర్థిత్వాల పునరుద్ధరణను బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద పరిగణనలోకి తీసుకుంటాం. అలాంటి ఫిర్యాదులపై కొన్ని జిల్లాల నుంచి నివేదికలు వచ్చాయి. మరికొన్ని చోట్ల నుంచి కూడా తెప్పించుకుంటాం. పాక్షికంగా పునరుద్ధరించడం రాష్ట్రస్థాయిలో జరుగుతుంది’ అని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ చర్యల వల్ల కరోనా నియంత్రణలోకి వచ్చినప్పటికీ.. మున్సిపల్‌ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం ఐదుగురు మించి చేయడానికి వీలులేదన్నారు. అతిక్రమిస్తే క్రిమినల్‌ చర్యగా పరిగణిస్తామన్నారు. పరిమితంగా రోడ్డు షోలకు అనుమతిస్తామన్నారు.  సోమవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామన్నారు.  

మరిన్ని వార్తలు