మరో మంత్రిపై నిమ్మగడ్డ ఆంక్షలు

13 Feb, 2021 04:13 IST|Sakshi

మీడియాతో మాట్లాడొద్దని మంత్రి కొడాలి నానికి ఆదేశాలు

సభలు, సమావేశాల్లోనూ ప్రసంగించరాదని ఉత్తర్వులు

ఉదయం షోకాజ్‌ .. సాయంత్రానికి చర్యలు

న్యాయస్థానాలు తప్పుబట్టినా తీరు మారని నిమ్మగడ్డ  

సాక్షి, అమరావతి: ఈసారి మరో మంత్రిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఆంక్షలు విధించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం అధికారి శుక్రవారం ఉదయం షోకాజ్‌ నోటీసులు జారీ చేయగా, మంత్రి వివరణ సంతృప్తికరంగా లేదంటూ గంటల వ్యవధిలోనే సాయంత్రానికి ఎస్‌ఈసీ చర్యలకు ఉపక్రమించారు. మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడరాదని ఆంక్షలు విధిస్తూ నిమ్మగడ్డ శుక్రవారం రాత్రి ఆదేశాలిచ్చారు.

నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు ముగిసే ఈ నెల 21వ తేదీ వరకు మంత్రి మీడియాతో మాట్లాడకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పటివరకు ఎటువంటి సభలు, సమావేశాల్లోనూ మాట్లాడకూడదన్నారు. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకొస్తాయని, ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, విజయవాడ పోలీస్‌ కమిషనర్లు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గృహ నిర్బంధంతో పాటు మీడియాతోనూ మాట్లాడకుండా ఆంక్షలు విధిస్తూ నిమ్మగడ్డ ఇటీవల జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు తప్పుపట్టిన విషయం తెలిసిందే. 

అరగంటలోనే నోటీసులు.. 
శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడగా అరగంటలోనే 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయ జాయింట్‌ సెక్రటరీ ఎస్‌.రవీంద్రబాబు షోకాజ్‌ నోటీసులిచ్చారు. మంత్రి నాని విలేకరుల సమావేశంలో కమిషనర్‌ను మరికొంత మందితో కలగలిపి కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ వీడియో ఫుటేజీని పరిశీలించి ఆయన మాట్లాడిన మాటలు అవమానకరమైనవి, హానికరమైనవిగా ఎన్నికల కమిషన్‌ నిర్ధారణకు వచ్చినట్లు నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అత్యవసరంగా మంత్రి వివరణ కోరుతోందని, కమిషన్‌కు సంతృప్తి కలిగిం చేలా బహిరంగంగా తగిన వివరణ ఇవ్వాలని సూచించారు. లేకుంటే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కమిషన్‌ భావిస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.

వ్యక్తిగతంగా లేదా సహాయకుడి ద్వారా వివరణ పంపాలని సూచించారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ప్రత్యేకంగా పేర్కొంటూ అవమానించేలా, కించపరిచేలా, దురుద్దేశంతో తాను విలేకరుల సమావేశంలో ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని మంత్రి కొడాలి నాని షోకాజ్‌ నోటీసుకు బదులిచ్చారు. తన లాయర్‌ తానికొండ చిరంజీవి ద్వారా ఆయన జవాబు పంపారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోపు వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌  పేర్కొనగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో వివరణ కాపీని కమిషన్‌ కార్యాలయ సెక్రటరీ కన్నబాబుకు మంత్రి ప్రతినిధి అందజేశారు.

గతంలో ఎప్పుడూ లేదే..
ఇదిలా ఉండగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయ జాయింట్‌ సెక్రటరీ ఎన్నికల కోడ్‌ పేరుతో ఒక మంత్రికి షోకాజ్‌ నోటీసులివ్వడంపై రాజకీయ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంప్రదాయాల్లేవని కమిషన్‌ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. నిబంధన ప్రకారం కోడ్‌కు సంబంధించిన ఆదేశాలు, షోకాజ్‌ నోటీసులు లాంటివి ఎన్నికల కమిషనరే స్వయంగా జారీచేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు