జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ కొనసాగింపుపై ఆలోచన

19 Feb, 2021 02:45 IST|Sakshi

న్యాయ సలహా తీసుకుని ముందుకెళతాం

సాక్షి, అమరావతి: వాయిదా వేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని ఎన్నికల కమిషన్‌ ఆలోచిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తెలిపారు. కోవిడ్‌ కారణంగా 2020 మార్చి 15న ఎన్నికలు వాయిదా çపడ్డాయి కాబట్టి.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిలను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలని కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌ను కోరాయన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌ న్యాయ సలహా తీసుకుని, ఎన్నిలను సక్రమంగా నిర్వహించేందుకు సంసిద్ధమవుతోందని తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

►మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లకు సంబంధించి తమతో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేశారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే, వాటిపై విచారించి మాకు నివేదించమని కలెక్టర్‌లను ఇప్పటికే ఆదేశించాము. 
►జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో కూడా బలవంతంగా నామినేషన్లను ఉపసంహరింప చేశారని ఫిర్యాదులు వస్తే పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌లను ఆదేశించాం. అటువంటి ఉదంతాలు ఉన్నట్లు నిర్ధారణ అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243–కె ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తుంది.  
►రిటర్నింగ్‌ అధికారులకు, పోలీసులకు చేసిన ఫిర్యాదులు, ఆయా ఘటనలకు సంబంధించి  వచ్చిన వార్తల వివరాలను ఆధారాలుగా జోడించి ఫిర్యాదు చేయవచ్చు. ఎవరైనా స్థానికంగా ఫిర్యాదు చేసే అవకాశం లేకపోతే నేరుగా ఎన్నికల కమిషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయొచ్చు. 
►బలవంతంగా నామినేషన్‌ను ఉప సంహరింప జేశారని నిర్ధారణ అయితే, ఆ అభ్యర్థుల నామినేషన్‌లను పునరుద్ధరించే అధికారాన్ని జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్‌లకు ఇచ్చాము. ఇలాంటి ఫిర్యాదులేవైనా ఉంటే.. విచారించి మొత్తం ప్రక్రియను ఈ నెల 20లోపు పూర్తి చేసి కమిషన్‌కు నివేదిక ఇవ్వాలని ఆదేశించాం.
►ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు 350 పోలింగ్‌ స్టేషన్‌ల పరిధిలో ఎన్నికల బహిష్కరణ పిలుపును తిరస్కరించి, గిరిజన ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం సంతోషం. మూడో విడత పోలింగ్‌లో కూడా గ్రామీణ ప్రాంత ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనడం.. ప్రజాస్వామ్యంపై వారికి ఉన్న విశ్వాసాన్ని ఇనుమడింప జేసింది. 

మరిన్ని వార్తలు