ఫిబ్రవరిలో ‘పంచాయతీ’!

18 Nov, 2020 03:17 IST|Sakshi

ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్లు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ప్రొసీడింగ్స్‌ 

సుప్రీం ఆదేశాలను పట్టించుకోకుండా, ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఏకపక్ష ప్రకటన 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తీరుపై సర్వత్రా చర్చ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించిందంటూ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మంగళవారం ప్రొసీడింగ్స్‌ పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులకు ఈమేరకు ఉత్తర్వులు పంపారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనరే సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండా ఎన్నికల నిర్వహణపై ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన సమయంలో తదుపరి ఎన్నికల నిర్వహణ తేదీలపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా 2021 ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించిందని, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని పేర్కొంటూ దీనికి కొనసాగింపుగా ఎన్నికల నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత విడుదల చేస్తామని అదే ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో లేదని, తాము ప్రకటించనున్న ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నుంచి కోడ్‌ అమలులోకి వస్తుందని ప్రొసీడింగ్స్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిందని, గతంలో రోజూ 10 వేలకుపైగా నమోదైన కేసులు ఇటీవల 2 వేలకు తగ్గాయని, మొదటిసారిగా కేసులు వెయ్యి లోపు మాత్రమే ఉన్నాయన్నారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఈనెల 30వతేదీ వరకు సెలవులో ఉన్నప్పటికీ దాన్ని రద్దు చేసుకుని హుటాహుటిన ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. మరోవైపు గురువారం ఆయన గవర్నర్‌ను కలవనున్నట్లు తెలిసింది. 

ఆకస్మిక ప్రణాళిక రూపొందించండి..
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఫిబ్రవరిలో నిర్వహించ తలపెట్టిన గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అకస్మిక (కంటింజెన్స్‌) ప్రణాళికలు రూపొందించాలంటూ ప్రొసీడింగ్స్‌లో కలెక్టర్లకు నిమ్మగడ్డ సూచించారు. కరోనా పరిస్థితులలోనూ బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో పాటు తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారని ప్రస్తావించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చే ప్రమాదం ఉన్నందున ఎన్నికల నిర్వహణకు ఇది సరైన సమయం కాదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 28న తనకు లేఖ అందజేశారని అయితే రాజకీయ పార్టీలతో జరిపిన సంప్రదింపుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికల నిర్వహణకు అత్యధికులు మొగ్గు చూపారన్నారు. గ్రామాల్లో కరోనా కట్టడిలో స్థానిక ప్రభుత్వాల అవసరం, ఆర్థిక సంఘం నుంచి నిధుల విడుదలకు ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికల నిర్వహణ అత్యవసరమన్నారు. కరోనా నేపధ్యంలో ఎలాంటి ప్రమాదకర పరిస్థితులకు అవకాశం లేకుండా ఎన్నికలు జరిపేందుకు వైద్య ఆరోగ్య శాఖ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకోవాలని సూచించారు. సున్నిత ప్రాంతాల్లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు డీజీపీ తగిన చర్యలు చేపట్టాలన్నారు.

మరిన్ని వార్తలు