అంతా నా ఇష్టం

13 Jan, 2021 03:06 IST|Sakshi

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ 

రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఏకపక్ష, వివాదాస్పద నిర్ణయాలు..

కనీసం ఏర్పాట్లు పరిశీలించకుండా పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌

తాజా పరిస్థితి చూడకుండా ఏడాది కిందటి ఏర్పాట్ల ప్రాతిపదికన నిర్ణయం

ఇపుడు ఎన్నికలు జరిపే పరిస్థితి లేదని ప్రభుత్వం చెప్పినా వినటానికి నో

కోర్టు తీర్పుతో ఆగిన ఎన్నికలు.. అయినా మారని రమేష్‌ కుమార్‌ తీరు

కమిషన్‌ కార్యాలయ ఉద్యోగుల విషయంలోనూ అదే వైఖరి

అనారోగ్యంతో సెలవుపై వెళ్లిన జేడీ సాయిప్రసాద్‌ ఏకంగా డిస్మిస్‌

కమిషన్‌ కార్యాలయ కార్యదర్శి వాణీమోహన్‌ను ప్రభుత్వానికి తిరిగి పంపుతూ ఉత్తర్వులు

గవర్నర్‌తో భేటీ.. ‘పంచాయతీ షెడ్యూల్‌’ పరిణామాలపై వివరణ!  

సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ఆ పదవికి వన్నె తెచ్చేలా వ్యవహరించాలి. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్కుమార్‌ మాత్రం ఎన్ని మొట్టికాయలు పడుతున్నా తన ఏకపక్ష, వివాదాస్పద నిర్ణయాలను మార్చుకోవటం లేదు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారా? పోలింగ్‌ సిబ్బంది నియామకం పరిస్థితేంటి? బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణ సంగతేంటి? అన్నవేవీ కనీసం పట్టించుకోకుండా... తాను చెబుతున్నాను కనుక ఇప్పుడే ఎన్నికలు జరగాలన్న రీతిలో షెడ్యూలు విడుదల చేశారు. ఇలాంటి ఒంటెద్దు పోకడలను సాగనివ్వబోమంటూ ఇప్పటికే హైకోర్టు మొట్టికాయలు వేసింది. అయినా ఊరుకోకుండా అప్పీలుకు వెళ్లటమే కాక... తాను చెప్పినట్టు వినలేదనే అక్కసుతో ఇపుడు ఈసీ కార్యాలయంలోని ఉద్యోగులపై కక్ష సాధింపులకు దిగారు.  
 
ఏడాదిక్రితం నాటి ఏర్పాట్లతో పంచాయతీ ఎన్నికలా? 
క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణ పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా.. 2020 మార్చిలో ఎన్నికలకోసం చేసిన ఏర్పాట్ల ప్రతిపాదికనే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు ఎస్‌ఈసీ సిద్ధపడడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్‌ ఛాయలు అప్పుడప్పుడే కనిపిస్తున్న నాటి పరిస్థితులకు... కోవిడ్‌ తీవ్రస్థాయిలో విజృంభించి ప్రపంచమంతా అతలాకుతలమై, ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్‌ను సమకూర్చుకుని జనం కాస్త మానసికంగా కుదుట పడుతున్న నేటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే కాదు... యావత్తు ప్రపంచంలోని యంత్రాంగం ఇన్నాళ్లూ కోవిడ్‌పై పోరులోనే మునిగిపోయింది. దేశంలోనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ పూర్తి క్రియాశీలంగా వ్యవహరించి... తాజాగా వ్యాక్సిన్‌ పంపిణీకి కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధమయింది. ఈ పరిస్థితుల్లో పోలింగ్‌ కేంద్రాలను కొన్నింటిని కొత్తగా గుర్తించడం... అధికారులు చాలామంది బదిలీలపై వెళ్లిన నేపథ్యంలో కొత్తగా పోలింగ్‌ సిబ్బంది నియమించాల్సి ఉంటుంది. ‘‘పోలింగ్‌ సందర్భంగా ఓటర్ల చేతివేలికి వేయడానికి వాడే ఇంకు.. దొంగ ఓట్ల నివారణలో అత్యంత ప్రధానమైనది. ఏడాదిక్రితం కొనుగోలు చేసిన ఆ ఇంకు ఇపుడు పనికొస్తుందా? లేదా? అన్నది చూసుకోవాలి. ఆ ఇంకు పనికిరాకుంటే.. మళ్లీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం 40 రోజులు పడుతుంది’’ అని సాక్షాత్తూ ఎన్నికల ప్రక్రియతో సంబంధం ఉండే అధికారులే చెబుతున్నారు. కాకపోతే షెడ్యూల్‌ ప్రకటించడానికి ముందు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఇలాంటివేమీ పట్టించుకోలేదన్నది బహిరంగమే.  
 
కమిషన్‌ కార్యాలయ ఉద్యోగులపైనా అదే తీరు.. 

పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేలా షెడ్యూల్‌ విడుదల చేస్తూ నిమ్మగడ్డ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఎన్నికల ఉత్తర్వులపై స్టే విధించింది. షెడ్యూలు విడుదల చేసినవారు ప్రజల ప్రాణాలకు పెద్దగా విలువివ్వలేదన్న రీతిలో కోర్టు అభిప్రాయపడింది. అయినప్పటికీ నిమ్మగడ్డ తన వైఖరిని మార్చుకోలేదు. దీనిపై అప్పీలుకు సైతం వెళ్ళారు. మరోవంక కమిషన్‌ కార్యాలయంలోని ఉద్యోగులపై కక్ష సాధింపులు మొదలుపెట్టారు. ముఖ్యంగా కమిషన్‌ కార్యాలయ కార్యదర్శి వాణీమోహన్‌ను ప్రభుత్వానికి తిరిగి పంపించటంలోనూ... అనారోగ్యంతో సెలవు పెట్టిన కార్యాలయ జాయింట్‌ డైరెక్టర్‌ సాయిప్రసాద్‌ను ఏకంగా సర్వీసు నుంచి తొలగించడంలోను నిమ్మగడ్డ వ్యవహారశైలిని ఉద్యోగ సంఘాలు నేరుగా తప్పుపట్టాయి. 1995–2000 మధ్య రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన కాశీ పాండ్యన్‌ అప్పటి కమిషన్‌ కార్యాలయ కార్యదర్శి లాల్‌ రోశమ్‌ను ప్రభుత్వానికి తిప్పి పంపారని, 73, 74 రాజ్యాంగ సవరణల తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పంచాయతీరాజ్‌ చట్టం వచ్చాక అప్పట్లో ఆ ఘటన జరిగిందని అధికార వర్గాలు చెప్పాయి.

అప్పటికి ప్రత్యేకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్, కార్యదర్శిల సర్వీసు రూల్స్‌ రూపొందించలేదని, కానీ ప్రస్తుతం ప్రత్యేకంగా ఎవరి బాధ్యతలేంటో సర్వీసు రూల్స్‌ పేర్కొనడంతో ఎవరి విధుల్లో వారే పనిచేయాల్సి ఉంటుందని.. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ మహిళ అయిన ఐఏఎస్‌ అధికారిణి వాణీమోహన్‌ను ప్రభుత్వానికి నిమ్మగడ్డ తిప్పి పంపటం తీవ్రమైన చర్యేనని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నోటిఫికేషన్లు జారీ చేయడం, ఎన్నికలకు సంబంధించి ఇతర విధానపరమైన నిర్ణయాలలో పూర్తి అధికారాలు కలిగివుంటే.. పరిపాలన వ్యవహారాల పరంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి కార్యదర్శే హెడ్‌గా వ్యవహరిస్తారు. కమిషనర్‌ కార్యాలయ స్థాయిలో ఎన్నికల ఖర్చుకు సంబంధించి ఏ బిల్లులైనా కార్యదర్శి ఉత్తర్వులద్వారా ఆమోదం తెలపాల్సి ఉంటుంది.  
 
వాణీమోహన్‌ను ప్రభుత్వానికి తిరిగి పంపిస్తూ ఉత్తర్వులు 
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్‌ మంగళవారం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయ కార్యదర్శిగా ఉన్న వాణీమోహన్‌ను విధుల నుంచి తప్పించారు. అప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌ కార్యాలయ కార్యదర్శి బాధ్యతల నుంచి రిలీవ్‌ అయి సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని మంగళవారం జారీ చేసిన ఆదేశాల్లో సూచించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఆదిత్యనాథ్‌ దాస్‌కు సమాచారమిస్తూ లేఖ రాశారు. వాణీమోహన్‌ స్థానంలో రాష్ట్ర కమిషన్‌ కార్యాలయ కార్యదర్శిగా కొత్తవారి నియామకం కోసం ఐఏఎస్‌ అధికారుల ప్యానల్‌ పేర్లను పంపాలంటూ లేఖలో సీఎస్‌కు సూచించారు. 
 
గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ..  
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్కుమార్‌ మంగళవారం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. కరోనా వ్యాక్సినేషన్‌ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెబుతున్నది పరిగణనలోకి తీసుకోకుండా గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యుల్‌ను విడుదల చేయడాన్ని రాష్ట్ర హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తప్పుపట్టడం తెలిసిందే. దీంతో తాను ఏ పరిస్థితులలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయాల్సి వచ్చిందో నిమ్మగడ్డ.. గవర్నర్‌కు వివరణ ఇచ్చుకున్నట్టు సమాచారం. అయితే ఈ భేటీకి సంబంధించి గవర్నర్‌ కార్యాలయం గానీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయం గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఉదయం 11.30 గంటలకు గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ ఖరారవగా.. 11.10 గంటలకే ఎన్నికల కమిషనర్‌ గవర్నర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. నిర్ణీత 11.30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. అయితే కేవలం పది నిమిషాల్లోనే ఈ భేటీ ముగిసింది.

మరిన్ని వార్తలు