సేవకు అవమానం.. టార్గెట్‌ వలంటీర్‌!

1 Mar, 2021 03:19 IST|Sakshi
పింఛన్‌ ఇవ్వడం కోసం బయోమెట్రిక్‌ తీసుకుంటున్న వలంటీర్‌ (ఫైల్‌)

వలంటీర్ల ఫోన్లు.. కలెక్టర్లు స్వాదీనం చేసుకోవాలట.. 

కదలికలపైనా నిఘా ఉంచాలట.. 

టీడీపీ చెప్పడం–నిమ్మగడ్డ ఆదేశించడం.. ముమ్మాటికీ ఇది తుగ్లక్‌ చర్యే 

వారు మామూలుగా పని చేసుకోవచ్చంటూనే ఈ మెలికలేంటి? 

ఫోన్లు లాక్కుంటే బయోమెట్రిక్‌ వేసేదెలా? 

పింఛన్ల పంపిణీ సాధ్యమా? 

వీరి సేవలను పట్టించుకోకుండా ఏమిటీ పిచ్చి ఆదేశాలు? 

వీరి సేవల పట్ల దేశ వ్యాప్తంగా వస్తున్న ప్రశంసలు పట్టవా? 

ఇతర ఉద్యోగులెవరిపైనా లేని అనుమానాలు వీరిపైనే ఎందుకు? 

బియ్యం పంపిణీలోనూ అడ్డంకులు సృష్టించారు.. 

హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా పద్ధతి మార్చుకోరా? 

సేవలను అడ్డుకోవడంపై కోర్టుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం 

వారు నేరస్తులా? 
► ఎవరైనా నేరపూరిత కార్యక్రమాలకు పాల్పడినప్పుడు వారి వద్ద ఉండే ఫోన్‌ను స్వాదీనం చేసుకుంటారు. వారి కదలికలపై నిఘా పెడతారు. ఇలాంటిదేదీ లేకుండా, ఏ ఆధారం చూపకుండా వలంటీర్ల పట్ల ఎస్‌ఈసీ ఈ రీతిలో వ్యవహరించడం ముమ్మాటికీ వారిని అవమానించడమే. అనుమానించడమే. 
► చేయరాని నేరం చేసిన నిందితుల మాదిరి పరిగణించి ఆదేశాలు జారీ చేయడం పట్ల వలంటీర్లు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. తమ కదలికలను నిశితంగా పరిశీలించాలని ఆదేశాలివ్వడాన్ని తప్పు పడుతున్నారు.  
► ఇతర ప్రభుత్వ ఉద్యోగులెవరిపై లేని అనుమానాలు తెలుగుదేశం పార్టీ తమపైనే ఎందుకు వ్యక్తం చేస్తోందని, వారి మాటలకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.   

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో వలంటీర్ల సేవల పట్ల దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతుంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ మాత్రం టీడీపీ పెద్దల కను సైగ మేరకు వీరిని అవమానిస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల నెపంతో క్షేత్ర స్థాయిలో వలంటీర్లు ప్రజలకు సేవలందించడంలో అత్యంత కీలకమైన మొబైల్‌ ఫోన్లను స్వాదీనం చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించడం ముమ్మాటికీ తుగ్లక్‌ చర్యే. ప్రతి పథకం బయోమెట్రిక్‌పై ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఎస్‌ఈసీ ఆదేశాల్లోని అంతరంగం ఇట్టే అర్థమవుతోంది. టీడీపీకి ప్రాణం పోయాలన్న ఆత్రం అడుగడుగునా కనిపిస్తోంది.

నిమ్మగడ్డ ఆదేశాల రీత్యా రెగ్యులర్‌గా ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇస్తున్న పింఛన్లను ఇప్పుడు బయోమెట్రిక్‌ లేకుండానే పంపిణీ చేయడం సాధ్యం కాదుకదా! ప్రత్యక్ష రాజకీయాలకు సంబంధం లేకుండా మామూలుగా పని చేసుకోవాలని చెప్పడం వరకు తప్పు లేదు. అయితే ఫోన్లను స్వాదీనం చేసుకోవాలని, వారిపై నిఘా పెట్టాలని అడ్డగోలుగా ఆదేశించడం నిజంగా పిచ్చి పని. కులం, మతం, ప్రాంతం, పార్టీ అన్నది చూడకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను లబ్దిదారుల ఇళ్ల వద్దకే చేరవేస్తున్న వలంటీర్ల వ్యవస్థపై నిమ్మగడ్డకు ఏమాత్రం అవగాహన లేదా? లేక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఇతర నేతలు ఫిర్యాదు చేశారని ఈ ఆదేశాలు జారీ చేశారా?  
 
పరిధి దాటి.. శ్రుతి మించి.. 
వాస్తవం చెప్పాలంటే నిమ్మగడ్డ తన పరిధి దాటి, టీడీపీని బతికించేందుకు శ్రుతి మించి చేస్తున్న ప్రయత్నమిది. ఇప్పటికే పలు విషయాల్లో శ్రుతి మించి వ్యవహరిస్తున్న నిమ్మగడ్డను పలు సందర్భాల్లో హైకోర్టు హెచ్చరించింది. నేరుగా, స్పష్టంగా తప్పు పడుతూ మొట్టికాయలు వేసింది. అయినా ఆయన తన వైఖరి మార్చుకోక పోవడం చూస్తుంటే టీడీపీ కోసం ఎంతకైనా బరితెగిస్తారని మరోమారు స్పష్టమైంది. ఇటీవల రేషన్‌ బియ్యం ఇంటింటికీ సరఫరా చేసే విషయమై ఇదే నిమ్మగడ్డ టీడీపీ నేతలకు మించి నానా యాగీ చేశారు. తుదకు కోర్టు ఉత్తర్వులతో మిన్నకుండిపోయారు. ఎప్పటి నుంచో కొనసాగుతున్న పథకాలను సైతం అడ్డుకుని, అధికార పక్షానికి ఇబ్బందులు కల్పించాలన్న తాపత్రయం ఆయన ప్రతి అడుగులోనూ కనిపిస్తోందని రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వారు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి వలంటీర్లు సేవలు అందిస్తున్నందున, ప్రతి పథకం లబ్ధిదారుని వివరాలు వారి ఫోన్‌కు లింక్‌ అయి ఉంటాయన్న కనీస పరిజ్ఞానం ఎస్‌ఈసీకి లేదా అని సామాన్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వలంటీర్ల సేవలను అడ్డుకోవడం పట్ల ప్రభుత్వం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  

సేవాభావంపై ప్రశంసలు 
► గతంలో పింఛను తీసుకోవడానికి తీవ్ర కష్టాలు పడిన అవ్వాతాతల ఇబ్బందులను పూర్తిగా మరిపిస్తూ ప్రతి నెలా 1వ తేదీ మధ్యాహ్నం కల్లా వలంటీర్లు అందరి ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా నాలుగైదుసార్లు వారి పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజల యోగ క్షేమాలు కనుక్కుంటున్నారు.  
► ఆయా కుటుంబాల్లో వారికి అర్హత ఉండీ, ప్రభుత్వ పథకాలేవన్నా అందక పోతే వారే దరఖాస్తు తీసుకెళ్లి పూర్తి చేసి వాటిని మంజూరు చేయిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 వేల గౌరవ వేతనం తప్ప ఇతర ప్రతిఫలాపేక్ష లేకుండా సేవాభావంతో వారు చేసున్న కార్యక్రమాలకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని తోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు వలంటీర్ల సేవలను కొనియాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 
 
వలంటీర్లను రెచ్చగొట్టి.. లబ్ధి పొందాలనుకుని.. 
► వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రాష్ట్రంలో ప్రతి 50–60 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మందిని వలంటీర్లుగా నియమించారు. కేవలం చదువుకున్న యువతీ యువకులకు అధికారుల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి పూర్తి పారదర్శక విధానంలో ఈ నియామకాలను ప్రభుత్వం చేపట్టింది.  
► అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం అయ్యే ముందు సరిగ్గా 20 రోజుల కిత్రం  వలంటీర్లను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది. పలుచోట్ల వారు కలెక్టర్‌ కార్యాలయాలు, మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసేలా టీడీపీ నేతలు ఉసిగొల్పారు.  
► ఈ విషయాన్ని పసిగట్టిన సీఎం వైఎస్‌ జగన్‌ వెంటనే అసలు విషయాన్ని వారికి అర్థమయ్యేలా వివరిస్తూ లేఖ రాశారు. దీంతో టీడీపీ అధినేత కుటిల బుద్ధిని వారు అర్థం చేసుకుని ప్రభుత్వ బాటలో సాగుతున్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకే తాజాగా ఎస్‌ఈసీ ద్వారా టీడీపీ అధినేత వీరిపై కక్ష తీర్చుకుంటున్నారు.   
► ఇందులో భాగంగా వలంటీర్ల సేవలను కించపరుస్తూ వారిని మున్సిపల్‌ ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉంచాలంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి వంటి టీడీపీ నేతలు.. వలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించవద్దంటూ డిమాండ్‌ చేశారు. టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతూ జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ సైతం ఇవే చిలుక పలుకులు పలకడం గమనార్హం.     

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు