ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నిమ్మగడ్డ 'వెనకడుగు'

16 Mar, 2021 04:49 IST|Sakshi

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నుంచి అదనపు సిబ్బందిని వెనక్కి పంపుతున్న కమిషనర్‌

రెండు నెలల క్రితం ప్రభుత్వం వద్దంటున్నా ఎన్నికల నిర్వహణకు పట్టు 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులోనూ పోరాటం

పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికల్లో అధికార పక్షం స్వీప్‌ చేయడంతో ‘పరిషత్‌’ ఎన్నికలపై కమిషనర్‌ అనాసక్తి

సాక్షి, అమరావతి: ఎన్ని అవాంతరాలు ఎదురైనా పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికలు జరిపి తీరాల్సిందేనని పట్టు బట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తాజా పరిస్థితుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తున్నారని రాజకీయ పార్టీలు, అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు, అవకాశాలు ఉన్నా.. కావాలనే దాట వేస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కమిషన్‌ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై నియమించిన అదనపు సిబ్బందిని నిమ్మగడ్డ వారి మాతృశాఖలకు తిరిగి పంపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తీరు చూస్తుంటే ‘పరిషత్‌’ ఎన్ని కలు నిర్వహించేందుకు ఆసక్తి చూపడం లేదనే విషయం స్పష్ట మవుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి డిప్యుటేషన్‌పై వచ్చిన నలుగురు ఏఎస్‌వో స్థాయి అధికారులను మునిసిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ముగిసిన వెంటనే మాతృశాఖలకు తిరిగి వెనక్కి వెళ్లేందుకు నిమ్మగడ్డ అనుమతి ఇచ్చారు. సోమవారం మరో నలుగుర్ని వారి పాత విధులకు పంపేందుకు నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరుకు నిమ్మగడ్డ పదవీ కాలం ముగియనుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నా అందుకు ఆయన సుముఖంగా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

న్యాయపరమైన చిక్కులు లేకున్నా..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు న్యాయపరమైన చిక్కులు, ఇతర సమస్యలు ఏమీలేవు. ఒక ట్రెండు పార్టీలు మాత్రమే పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దుచేసి, ఎన్నికల ప్రక్రియను మొదటినుంచీ చేపట్టాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లాయి. ఆగిపోయిన ఎన్నికలను రద్దుచేయాలనిగానీ, తాత్కాలికంగా నిలిపివేయాలని గానీ కోర్టు తీర్పులు కూడా ఏమీ లేవు. ‘పరిషత్‌’ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గతంలోనే ముగిసిన దృష్ట్యా ఆ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించేందుకు వారం రోజులకు మించి అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు.

టీడీపీకి నష్టమని భావించి..
‘పరిషత్‌’ ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ నిమ్మగడ్డ వాటి జోలికి వెళ్లకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలు పూర్తిగా అధికార వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వెలువడ్డాయి. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు నిర్ణయించుకున్న నిమ్మగడ్డ ప్రభుత్వం వారిస్తున్నా ఎన్నికల నిర్వహణకు సిద్ధçమయ్యారని అప్పట్లో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. కనీసం కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ఎంత ఒత్తిడి తెచ్చినా.. ఎన్నికలు జరపాల్సిందేనని పట్టుబట్టి ఆ ఎన్నికలకు నిమ్మగడ్డ పూనుకున్నారు. చివరకు ఎన్నికల ఫలితాలు టీడీపీకి రాజకీయంగా ప్రయోజనం కల్పించకపోగా.. తీవ్ర నష్టం చేకూర్చాయి. ఈ నేపథ్యంలోనే కనీసం తాను కమిషనర్‌గా ఉన్నంత వరకైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపకూడదని నిమ్మగడ్డ నిర్ణయించుకుని ఉంటారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు