‘ఏమైనా’.. చేయలేం!: నిమ్మగడ్డ రమేష్

1 Apr, 2021 06:02 IST|Sakshi

ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదట్నుంచీ కుదరదు: రిటైర్డ్‌ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ

ప్రభుత్వ తోడ్పాటు, సహకారం వల్లే ఎన్నికలు విజయవంతం

కొంతమంది వల్లే వ్యవస్థల మధ్య అగాధం

వారి చర్యలతో ప్రభుత్వానికేం సంబంధం ఉంటుంది?

సాక్షి, అమరావతి: ఎన్నికల కమిషనర్‌కు విస్తృత అధికారాలుంటాయని, ఎన్నికల కమిషన్‌ ఏదైనా చేయగలదని అంతా భావిస్తుంటారని అయితే అది సాధ్యం కాదని ఎస్‌ఈసీగా బుధవారం పదవీ విరమణ చేసిన నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. ‘ఎన్నికలు (మధ్యలో ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ) మళ్లీ మొదట్నుంచీ తేవాలన్నారు. అలాంటివి ఎలా చేయగలం?.. మేం చేయలేం.. ఎన్నికల చట్టమనేది పకడ్బందీగా ఉంటుంది. ఓ వ్యక్తి తనకు అనుకూలంగా లేకపోతే ఇష్టమొచ్చినట్టు ఏదైనా, ఏమైనా చేసేందుకు వ్యవస్థ వెసులుబాటు కల్పించదు’ అని పేర్కొన్నారు.

పదవీ విరమణకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తన పనితీరు పట్ల పూర్తి సంతృప్తి చెందినట్లు చెప్పారు. గ్రామ పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణపై సంతృప్తితో ఉన్నానన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, రీ పోలింగ్‌ అవసరం లేకుండా ఎన్నికల ప్రక్రియ ముగియడం అరుదైన విషయమన్నారు. ఇదంతా ప్రభుత్వ పెద్దల తోడ్పాటు, సహకారం వల్లే సాధ్యపడిందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కలెక్టర్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులందరి సహకారం లభించిందన్నారు.

ప్రజల మనోభావాలకు ప్రతిబింబాలు..
ఎన్నికల కమిషన్‌ చిన్న పరిమితిలో పనిచేసే వ్యవస్థ అని, ఇతర వ్యవస్థలు ఇంకా పెద్దవి, బలమైనవని నిమ్మగడ్డ పేర్కొన్నారు. గవర్నర్, శాసన వ్యవస్థలపై విధేయత, గౌరవం ఉండాలన్నారు. ప్రజల మనోభావాలను ప్రతిబింబించే చట్టసభల ద్వారా జరిగే నిర్ణయాల పట్ల నమ్మకం విశ్వాసం అవసరమన్నారు. ఎన్నికలను పారదర్శకంగా, విశ్వసనీయతతో నిర్వహించేందుకే తన అధికారాలను వినియోగించుకున్నానని, ఇతర వ్యవస్థల్లోకి చొరబడలేదని చెప్పారు. 

ఓటు హక్కుపై పౌరుడిగా పోరాడతా..
కొన్ని చిన్న అంశాలు వ్యవస్థల మధ్య అవాంతరాలు కలిగించాయని నిమ్మగడ్డ పేర్కొన్నారు. కొందరు వ్యక్తుల అనాలోచిత చర్యల వల్ల  వ్యవస్థల మధ్య అగాధం ఏర్పడిందన్నారు. పంచాయతీ ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్‌ సిబ్బంది అంతా మూకుమ్మడి సెలవులో వెళ్లాలని కొందరు వ్యక్తులు చెప్పడంలో ప్రభుత్వ పాత్ర ఏం ఉంటుందన్నారు. ఆ విషయం అసలు ప్రభుత్వానికి తెలిసి కూడా ఉండకపోవచ్చన్నారు. తన స్వగ్రామంలో ఓటు హక్కు అభ్యర్ధనను పెండింగ్‌లో ఉంచడంపై ఒక పౌరుడిగా న్యాయ పోరాటం చేస్తానని, హైకోర్టుకు వెళతానని చెప్పారు.

ఎన్నికల సంస్కరణలపై నివేదిక 
ఎన్నికల సంస్కరణలకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు ఓ నివేదిక తయారు చేసినట్టు నిమ్మగడ్డ తెలిపారు. నివేదిక ప్రతిని ఆయన మీడియాకు విడుదల చేశారు. గవర్నర్‌ను కలిసి నివేదిక అందజేయాలని భావించినా కోవిడ్‌ టీకా తీసుకొని వైద్య సహాయం పొందుతుండడంతో అపాయింట్‌మెంట్‌లేవీ లేవని ఆయన కార్యాలయం సమాచారమిచ్చిందన్నారు. నివేదికను రాజకీయ పార్టీలకు కూడా పంపి సలహాలు కోరినట్టు చెప్పారు. తదుపరి ఎస్‌ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై  ఇప్పటికే ఆమెకు లేఖ రాసినట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు