ఓటర్లు, ఉద్యోగులవి ప్రాణాలు కావా?

24 Jan, 2021 04:11 IST|Sakshi

కుర్చీ చుట్టూ అద్దాలు అడ్డం పెట్టుకొని.. ఎవరూ దగ్గరకు రాకుండా బారికేడ్లలా తాడు కట్టుకొని మీడియాతో మాట్లాడిన నిమ్మగడ్డ

కరోనా తగ్గిపోయుంటే ఇవన్నీ ఏమిటని పలువురి సందేహం

కరోనా వ్యాక్సినేషన్‌ వల్ల ఇప్పుడు ఎన్నికలొద్దంటే వీడని మొండి వైఖరి

సాక్షి, అమరావతి: ‘కరోనా తగ్గిపోయింది.. ఎన్నికలు నిర్వహించాల్సిందే’ అని పట్టు పట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. శనివారం విలేకరుల సమావేశం నిర్వహించడానికి తీసుకున్న జాగ్రత్తలు చూస్తుంటే నవ్వు తెప్పించింది. 20–30 మంది మీడియా ప్రతినిధులుండే సమావేశంలో అర గంట పాటు మాట్లాడటానికి ఆయన తన చుట్టూ పెద్ద సైజు అద్దం (గ్లాస్‌) అడ్డం పెట్టుకున్నారు. ఆయన కూర్చునే కుర్చీ దగ్గరకు ఇతరులెవరూ రాకుండా బారికేడ్ల తరహాలో తాడు కట్టించారు. ఆయన కుర్చీలో కూర్చోవడానికి ముందే ఎదురుగా బల్లపై మీడియా ప్రతినిధులు ఉంచిన మైకులకు తన సిబ్బంది ద్వారా 3 సార్లు శానిటైజర్‌  స్ప్రే చేయించారు. నోటిఫికేషన్‌ విడుదల చేసే కొద్ది సేపు కేవలం కొద్ది మంది వ్యక్తులకు దగ్గరగా ఉండడానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. కరోనా అంటే కొద్దొ గొప్పో అవగాహన మాత్రమే ఉండే గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య, పేద ప్రజల గురించి ఎందుకు ఆలోచించడం లేదు? వ్యాక్సికేషన్‌ సమయంలో ఎన్నికలు వద్దని ప్రభుత్వం చెబుతున్నా, పట్టించుకోకుండా పంతం పట్టి, ఎన్నికలు జరిపి తీరాల్సిందేనని నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేశారు. రాష్ట్రంలో పరిస్థితిని, అన్ని విషయాలను వివరిస్తూ స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏడు విడతలుగా లేఖలు రాసినా పట్టించుకోకుండా, వెనుక ఎవరో తరుముతున్నట్లు ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపారు. 

ఎన్నికలంటే 15 రోజులు గ్రామాల్లో గుంపులే
► పంచాయతీ ఎన్నికలంటే గ్రామాల్లో 10–15 రోజులు గుంపులు గుంపులతో హడావుడిగా ఉంటుంది. 
► పంచాయతీ ఎన్నికలంటే గ్రామాల్లో పట్టుదలలు, పంతాల మధ్యనే సాగుతాయి. ఉండే మొత్తం మూడు నాలుగు వేల ఓట్లలో ప్రతి ఓటు కీలకమే అన్నట్టు అభ్యర్థులు పోటీ పడతారు. 
► అసెంబ్లీ, మున్సిపల్‌ ఎన్నికల కంటే కూడా పంచాయతీ ఎన్నికలలో ఇంటింటి ప్రచారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఊళ్లో ఓటరుగా ఉండే వాళ్లు ఎంత దూరంలో ఉన్నా, పోలింగ్‌ రోజుకు సొంతూరికి పిలిపిస్తారు. వేరే ఊళ్ల నుంచి రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతాయని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. 
► పోలింగ్‌ రోజున నలుగురైదుగురు సిబ్బంది చేతులు మారే బ్యాలెట్‌ పేపర్‌ను గ్రామీణ ఓటరు ముట్టుకోవాల్సి రావడం కూడా కరోనా వ్యాప్తికి అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 

2.60 కోట్ల మంది ఓటర్లు.. 2 లక్షల మంది సిబ్బంది
► ఇటీవలే స్థానిక ఎన్నికలు జరిగిన కేరళలో కరోనా వైరస్‌ వ్యాప్తి విపరీతంగా పెరిగినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. మన రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే  మొత్తం 2.60 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉంటుంది. దీనికి తోడు రెండు లక్షల మందికి 
పైనే ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. 
► 13,371 గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్‌ పదవులకు, 1.34 లక్షల వార్డు మెంబర్‌ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. ఒక్కో వార్డుకు వేర్వేరుగా పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేసి ఎన్నికలు జరపాలి. ఒక్కో బూత్‌కు  ప్రత్యక్షంగా పరోక్షంగా కనీసం ఐదుగురు సిబ్బంది పాల్గొనాల్సి ఉంటుంది. 
► ఈ లెక్కన రెండు లక్షల మందికి పైగా సిబ్బంది నాలుగు విడతల ఎన్నికల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో కేరళ తరహాలో పరిస్థితి మన రాష్ట్రంలో పునరావృతమైతే.. పరిస్థితి ఏమిటని ఉద్యోగులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇంటర్‌కమ్‌లో మాటామంతి
కరోనా వల్ల నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆఫీసులోనూ ఎవరికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వడం లేదు. ఎవరినీ కలవడం లేదని ఆఫీసు సిబ్బంది చెప్పారు. ఎన్నికల నిర్వహణపై వినతులు ఇచ్చేందుకు ఎవరైనా నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి వస్తే.. ఆయన తన పీఎస్‌ గదిలో ఉండే ఇంటర్‌కమ్‌ ద్వారానే వారితో మాట్లాడి పంపుతున్నారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలవడానికి వచ్చిన బీజేపీ నేతల బృందానికి ఇదే రీతిలో అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు