ఎన్ని అవరోధాలు వచ్చినా ఇప్పుడే ఎన్నికలు 

24 Jan, 2021 03:53 IST|Sakshi
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌

‘పంచాయతీ’ నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ మీడియాతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌

సాక్షి, అమరావతి: ఎన్ని అవరోధాలు వచ్చినా ఇప్పుడే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ప్రకటించారు. ఈ నెల 8వ తేదీన విడుదల చేసిన షెడ్యూల్‌ మేరకు నాలుగు విడతల్లో జరిగే ఎన్నికలకు శనివారం ఒకేసారి నోటిఫికేషన్‌ (వాస్తవానికి వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వాలి) జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నేనైతే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్నా.. ఇక ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత అంతా ప్రభుత్వానిదే’ అని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియకు ఎటువంటి అవరోధాలు, ఆటంకాలు ఎదురైతే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం, యంత్రాంగానిదేనని చెప్పారు. ఈ విషయాన్ని గవర్నర్‌కు నివేదించక తప్పదని, ఒకవేళ ఉద్దేశ పూర్వకంగా ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటే.. దానికి ప్రభుత్వ వ్యవస్థే పూర్తిగా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్నికలు నిర్వహించడం పెను సవాలే అయినప్పటికీ, ఏ అడ్డంకులు తమను ప్రభావితం చేయబోవన్నారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఇంకా ఏం చెప్పారంటే..

ప్రభుత్వ వినతిని తిరస్కరించా
► సోమవారం సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తుందని, అందువల్ల ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయాలని  రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరగా, అది సహేతుకంగా లేదని తిరస్కరించాను. సుప్రీంకోర్టు తుది నిర్ణయం ఏదైనా వస్తే దానిని తప్పనిసరిగా పాటిస్తాం. 
► జిల్లా కలెక్టర్లందరితో రాష్ట్ర ఎన్నికల సంఘం సంప్రదింపులు జరిపింది. ఎన్నికల ఏర్పాట్లన్నీ సంతృప్తిగా ఉన్నాయనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు ఎన్నికలు చేపట్టాం. ప్రభుత్వ పరంగా తోడ్పాటులో కమిషన్‌కు మిశ్రమ అనుభవాలున్నాయి.  

ఎన్నికలపై భిన్న వాదనలు ఉన్న మాట వాస్తవం 
ఎన్నికల మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నాయన్న మాట వాస్తవం. కాకపోతే వీటి ప్రభావం ఎన్నికల నిర్వహణ మీద, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మీద ఉండవని కమిషన్‌ బలంగా విశ్వసిస్తోంది. ఎన్నికల్లో హింస, పోటీ చేయడంలో అవరోధాలు కల్పించినట్లయితే.. కమిషన్, పోలీసు శాఖ తీవ్రంగా స్పందిస్తాయి.

ఏకగ్రీవ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెడతాం
ఎన్నికల్లో అక్రమాలు.. ఏకగ్రీవ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నాం. ఐజీ స్థాయి అధికారి సహకారంతో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం. ఇలాంటి అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని ధృడ సంకల్పంతో ఉన్నాం.

నిధులు, సిబ్బంది కొరత..
► ఎన్నికల నిర్వహణలో నిధుల సమస్య ఉంది. మాకు సిబ్బంది కొరత కూడా ఉంది. వీటన్నింటినీ పరిష్కరిస్తారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం పరిష్కరించకపోతే కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. కోర్టు ఆదేశాల మేరకు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 
► ఈ హామీ అమలు విషయంలో ఆశించినంతగా ఫలితాలు లేవు. ఈ విషయాన్ని నేను రెండు మూడు విడతలుగా గవర్నర్‌ దృష్టికి స్వయంగా తీసుకెళ్లాను. మాకు సెక్రటరీ లేరు. జాయింట్‌ సెక్రటరీ లేరు. జాయింట్‌ డైరెక్టర్‌ లేరు. న్యాయ సలహాదారులు లేరు. ఉన్నవాళ్లు కొద్ది మందే. అయినప్పటికీ ఏ అడ్డంకులు మా పనితీరును ప్రభావితం చేయలేవు. 

ఉద్యోగ సంఘాల వాదన సరికాదు 
► ఎన్నికల నిర్వహణపై కొన్ని ఉద్యోగ సంఘాలు కొన్ని భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎన్నికలు వద్దని కొంత మంది కోరుకోవడం సరికాదు. 
► సోమవారం సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తున్న నేపథ్యంలో.. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆటంకాలు కల్పించాలని చూస్తోందని నివేదించాల్సి వస్తుందనుకోవడం లేదు. అవసరం వస్తే సుప్రీంకోర్టుకు కూడా నివేదించాల్సి వస్తుంది. తప్పదు. ఉన్న పరిస్థితులను నేను దాచలేను. 

సమస్యలొస్తే గవర్నర్, న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్తా 
► ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఎలాంటి సమస్య వచ్చినా ఎప్పటికప్పుడు గవర్నర్‌ దృష్టికి తీసుకెళతా. అవసరమైతే న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా సవాళ్లను అధిగమిస్తాం. 
► నాకు న్యాయ వ్యవస్థ, గవర్నర్‌ వద్ద నుంచి పూర్తి తోడ్పాటు లభిస్తుందనే భావనతో ఎన్నికల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనుకుంటున్నా. జిల్లా కలెక్టర్లందరి వద్ద నుంచి కూడా పూర్తి సహకారం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది.  

3.60 లక్షల మంది ఓటు హక్కు కోల్పోతున్నారు..
ఎన్నికలు జరిపే ముందు ఏ ఎన్నికల రోల్‌ ప్రకారం ముందుకు పోవాలన్న దానిపై స్పష్టత అవసరం. ఈ స్పష్టత ఇవ్వడంలో పంచాయతీ రాజ్‌ కమిషనర్, ముఖ్య కార్యదర్శి పూర్తిగా విఫలమవ్వడం చాలా బాధాకరం. 2021 ఓటర్ల జాబితా ఆధారంగా ఈ ఎన్నికలు జరుపుతామని చెప్పాం. విధిలేని పరిస్థితులలో కమిషన్‌ 2019 ఓటర్ల జాబితా ప్రాతిపదిక మీదనే ఎన్నికలు నిర్వహిస్తోంది. తద్వారా 18 ఏళ్లు నిండి, ఓటు హక్కు పొందిన 3.6 లక్షల మంది యువత ఓటు హక్కు కోల్పోతోంది. పంచాయతీరాజ్‌ శాఖ అలసత్వం వల్ల కానీ, బాధ్యతా రాహిత్యంగా పని చేయడం వల్ల ఈ విపత్కర పరిస్థితి వచ్చింది. దీనిని కమిషన్‌ చాలా తీవ్ర విషయంగా పరిగణిస్తోంది. సంబంధిత అధికారులందరిపై సరైన సమయంలో సరైన చర్యలు ఉంటాయి. 

ఈ ప్రశ్నలకు బదులేదీ?
విలేకరుల సమావేశంలో మీడియా అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు నిమ్మగడ్డ నిరాకరించారు. ‘ఇక్కడ డిస్ట్రబెన్స్‌ చెయ్యొద్దు..’ అని సమావేశం ముగించే ప్రయత్నం చేశారు. మీరు ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారంటున్నారు.. దీనికి మీరు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారా? అని ప్రశ్నిస్తున్నా జవాబు చెప్పకుండా వెళ్లిపోయారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు