సెస్సులు, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా లేదు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

7 Feb, 2023 18:47 IST|Sakshi

న్యూఢిల్లీ: నిర్దిష్ట ప్రయోజనాల కోసం కేంద్రం వసూలు చేసే సెస్సులు, పన్నులపై విధించే సర్‌చార్జీలు ఇతర సుంకాలలో రాష్ట్రాలకు వాటా ఉండబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ స్పష్టం చేశారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె జవాబిస్తూ సెస్సులు, సర్‌చార్జీలు ఇతర సుంకాల పేరిట వసూలు చేసే మొత్తాలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే వినియోగిస్తుందని తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు సెస్సుల రూపంలో కేంద్రం వసూలు చేసిన మొత్తాలను పట్టిక రూపంలో మంత్రి వివరించారు.

2014-15లో సెస్సుల కింద కేంద్రం వసూలు చేసిన మొత్తం 82,914 కోట్లు అయితే 2021-22 ఆర్థిక సంవత్సరానికి సెస్సుల రూపంలో వసూలైన మొత్తం 3 లక్షల 52 వేల 728 కోట్ల రూపాయలు ఉన్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు చెందాల్సిన వాటాపై 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన ఫార్ములా వివరాల గురించి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకు పంపిణీ చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందన్నారు.

2020-21 నుంచి 2025-26 వరకు అమలులో ఉండే 15వ ఆర్థిక సంఘం అవార్డు రాష్ట్రాలకు పన్నుల వాటా పంపిణీ కోసం కొన్ని ప్రాతిపదికలను సూచించింది. రాష్ట్ర జనాభా సంఖ్యకు 15 శాతం, భౌగోళిక విస్తీర్ణానికి 15 శాతం, అటవీ, పర్యావరణానికి 10 శాతం, ఆదాయ వనరులకు 45 శాతం చొప్పున వెయిటేజి ఇచ్చింది. వీటి ప్రాతిపదికపైనే కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటాను నిర్ణయించాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసినట్లు’ మంత్రి వివరించారు.

ఈ ప్రాతిపదిక ప్రకారం పన్నుల పంపిణీలో బీహార్‌కు 10 శాతం, ఉత్తర ప్రదేశ్‌కు 17 శాతం, మధ్య ప్రదేశ్‌కు 7 శాతం చొప్పున పొందగా ఆంధ్రప్రదేశ్‌ 4 శాతానికి మాత్రమే పరిమితమైంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి కేంద్ర పన్నుల పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌కు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 24,460 కోట్లు, 2021-22లో 35,385 కోట్లు 2022-23లో  సవరించిన అంచనాల మేరకు 38.176 కోట్లు లభించాయని మంత్రి వెల్లడించారు. అలాగే 2023-24 బడ్జెట్‌ అంచనాల మేరకు కేంద్ర పన్నులలో ఆంధ్రప్రదేశ్‌ వాటా కింద 41,338 కోట్ల రూపాయలు పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు.

ఏపీలో 16,400 కోట్లతో 5 సోలార్ పార్కులు
న్యూఢిల్లీ: సోలార్ పార్కుల అభివృద్ధి పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు 4100 మెగావాట్ల సామర్థ్యంతో  5 సోలార్ పార్కులు  మంజూరు చేసినట్లు కేంద్ర పునరుత్పాదక శక్తి, విద్యుత్ శాఖల మంత్రి ఆర్ కే సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ అనంతపురంలో రెండు, కర్నూలు, వైఎస్సార్‌ కడప జిల్లాలో ఒక్కో సోలార్ పార్కు, రామగిరిలో సోలార్ విండ్ హైబ్రీడ్ పార్కుల అభివృద్ధికి కేంద్ర ప్రభత్వ ఆర్థిక సహాయం కింద 590.80 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.

అనంతపురంలో 1400 మెగావాట్ల సోలార్ పార్కు-1కు 244.81 కోట్లు, 500 మెగావాట్ల పార్కు-2కు 91.24 కోట్లు, వైఎస్సార్‌ కడప జిల్లాలోని 1000 మెగావాట్ల సోలార్ పార్కుకు 54.25 కోట్లు, కర్నూలులో 1000 మెగావాట్ల పార్కుకు 200.25 కోట్లు చొప్పున ఆర్థిక సహాయాన్ని విడుదల చేసినట్లు తెలిపారు.  అనంతపురంలో  1400 మెగావాట్ల సోలార్ పార్కు-1, కర్నూలులో 1000 మెగావాట్ల సోలార్ పార్కు స్థాపిత సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి.

వైఎస్సార్‌ కడప జిల్లాలో 1000 మెగావాట్ల సామర్థ్యానికి గాను 250 మెగావాట్లు, అనంతపురంలోని  రెండవ సోలార్ పార్కు 500 మెగావాట్ల సామర్థ్యానికిగాను 400 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తున్నట్లు మంత్రి తెలిపారు. రామగిరిలో 200 మెగావాట్ల సామర్థ్యంతో ఆమోదం పొందిన సోలార్ విండ్ హైబ్రిడ్ పార్కును  ప్రారంభించాల్సి ఉందని అన్నారు.

సోలార్ పార్కులో ఒక మెగావాట్ విద్యుత్‌ సామర్థ్యం నెలకొల్పేందుకు సరాసరి 4 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ మేరకు మొత్తం 4100 మెగావాట్ల సామర్థ్యంగల 5 పార్కులకు సుమారు 16400 కోట్లు వ్యయం అవుతుందని మంత్రి అన్నారు. డీపీఆర్ తయారు చేసేందుకు ఒక్కో సోలార్ పార్కుకు 25 లక్షలు, అదనంగా ఒక్కో మెగావాట్ స్థాపనకు 20 లక్షలు లేదా 30% నిధులు కేంద్రం చెల్లిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సోలార్ పార్కులు పూర్తి చేసేందుకు ఈ పథకాన్ని 2024 మార్చి వరకు పొడిగించినట్లు మంత్రిపేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు