త్వరలోనే ‘పోలవరం’ బకాయిలు రూ.3,805 కోట్లు చెల్లిస్తాం 

16 Sep, 2020 04:58 IST|Sakshi

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ 

ప్రాజెక్టు పూర్తికి వెంటనే నిధులు విడుదల చేయాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి 

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3,805 కోట్ల బకాయిల చెల్లింపు ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. ప్రాజెక్టును అనుకున్న తేదీలోగా పూర్తి చేయడానికి వీలుగా బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చేసిన విజ్ఞప్తిపై ఆమె స్పందించారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ.. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం చేసిన ఖర్చును ధ్రువీకరిస్తూ కాగ్‌ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తమకు సమర్పించినట్లు తెలిపారు.  

పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి 
ఈ సందర్భంగా సభలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ‘పోలవరం ప్రాజెక్ట్‌ ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి. దీన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించింది. కాబట్టి దీని నిర్మాణానికి నిధులన్నింటినీ కేంద్రమే సమకూర్చాలి. ప్రాజెక్ట్‌ను డిసెంబర్‌ 2021 నాటికల్లా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర నిధుల కోసం నిరీక్షించకుండా ప్రాజెక్ట్‌ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్రమే సొంత నిధులను ఖర్చు చేస్తూ వస్తోంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో రూ.3,805 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. రాష్ట్ర విభజన, కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో బకాయిలను వెంటనే విడుదల చేయాలని కొద్దికాలం క్రితం సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రధానికి లేఖ రాశారు.  ఈ నేపథ్యంలో అనుకున్న తేదీ నాటికల్లా ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వీలుగా నిధులు విడుదల చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. 

నిధులు విడుదల చేయాలని మంత్రి బుగ్గన కోరారు 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ జూలైలో లేఖ రాశారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రాజ్యసభకు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా నిర్మించడానికి నిధులను మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరిందా అని టీజీ వెంకటేశ్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి çసమాధానమిచ్చారు. 2014 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.8,614.70 కోట్లు మంజూరు చేసిందన్నారు.   

మరిన్ని వార్తలు