పోలవరం ఖర్చులో రూ.320 కోట్లు మంజూరు 

6 Jan, 2022 08:39 IST|Sakshi

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉత్తర్వులు 

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు రూ.320 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను 2021–22 బడ్జెట్‌లో కేంద్ర జల్‌ శక్తి శాఖకు కేటాయించిన నిధుల నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి విడుదల చేయాలని ఆదేశించారు. ఇవి గురువారం పీపీఏ ఖాతాలో చేరతాయి. శుక్రవారం రాష్ట్ర ఖజానాకు చేరతాయని అధికారవర్గాలు వెల్లడించాయి.

విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. 2014 ఏప్రిల్‌ 1న నీటి పారుదల విభాగం వ్యయం వంద శాతం తిరిగిస్తామని (రీయింబర్స్‌ చేస్తామని) హామీ ఇచ్చింది. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.18,372.14 కోట్లు ఖర్చు చేసింది. అందులో 2014 ఏప్రిల్‌ 1 తర్వాత చేసిన వ్యయం రూ.13,641.43 కోట్లు. ఇందులో కేంద్రం ఇప్పటిదాకా రూ.11,492.16 కోట్లు తిరిగిచ్చింది. ఇంకా రూ.2,149.27 కోట్లను కేంద్రం బకాయిపడింది. 

రూ.711.60 కోట్లు రీయింబర్స్‌ చేయాలని పీపీఏ ప్రతిపాదన.. 
రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,149.27 కోట్ల బిల్లులను ప్రాజెక్టు అధికారులు పీపీఏకు సమర్పించారు. ఈ బిల్లులను పరిశీలిస్తున్న పీపీఏ.. ప్రస్తుతానికి రూ.711.60 కోట్లు రీయింబర్స్‌ చేయాలని కేంద్ర జల్‌ శక్తి శాఖకు పంపింది. దీనికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) కూడా ఆమోదం తెలపడంతో, ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర జల్‌ శక్తి శాఖ కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఇందులో తొలి దశలో రూ.320 కోట్లను ఆర్థిక శాఖ మంజూరు చేసింది. మిగతా మొత్తాన్ని మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. తాజాగా మంజూరు చేసిన రూ.320 కోట్లు పోను, కేంద్రం ఇప్పటికీ రాష్ట్రం చేసిన ఖర్చులో రూ.1829.27 కోట్లను తిరిగి చెల్లించాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు