ఆర్బీకేలతో రైతుకు ఎంతో మేలు: నీతి ఆయోగ్‌

27 Aug, 2022 08:26 IST|Sakshi

ఈ వ్యవస్థను అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలి.. ఈ–క్రాప్, ఈ–కేవైసీ, బ్యాంకింగ్‌ సేవలు అద్భుతం

రాష్ట్రాలకు సూచించిన నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేష్‌ చంద్‌

ఢిల్లీలో జాతీయస్థాయి వ్యవసాయాధికారుల సమావేశం

ఆర్బీకేలపై వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌  

పలు రాష్ట్రాల అధికారులను ఆకట్టుకున్న ఆర్బీకే వ్యవస్థ 

తమ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని వెల్లడి 

సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలో రైతులకు సేవలందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ఆదర్శనీయమని, వాటిని అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు, ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్‌ రమేష్‌ చంద్‌ చెప్పారు. ఢిల్లీలోని నీతి ఆయోగ్‌ కార్యాలయంలో శుక్రవారం జాతీయ స్థాయిలో వ్యవసాయ శాఖల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. నీతి ఆయోగ్‌ ఆహ్వానం మేరకు ఈ సమావేశానికి హాజరైన ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు, దాని ఆవశ్యకత, అందిస్తున్న సేవలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పౌర సేవలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రతి రెండువేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారని, వాటికి అనుబంధంగా గ్రామస్థాయిలో రైతుల కోసం ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చామని పూనం మాలకొండయ్య వివరించారు. రాష్ట్రంలో 10,778 ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి ఇన్‌పుట్స్‌ను రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. వీటిని నాలెడ్జ్‌ హబ్‌లుగా, వన్‌స్టాప్‌ సెంటర్లుగా కూడా తీర్చిదిద్దామని చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులతోపాటు ఆక్వా, పాడి రైతులకు కూడా ఆర్బీకేలు సేవలందిస్తున్నాయని తెలిపారు. పొలం బడులు, తోట, పట్టు, పశువిజ్ఞాన, మత్స్య సాగుబడుల ద్వారా రైతులకు శిక్షణ ఇస్తూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నట్లు చెప్పారు. ఈ–క్రాప్, ఈ–కేవైసీ ద్వారా వాస్తవ సాగుదారులకే ప్రభుత్వ రాయితీలు, సంక్షేమ ఫలాలు, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా  అందిస్తున్నామన్నారు.

స్పెషల్‌ సీఎస్‌ చెప్పిన ప్రతి విషయాన్ని ఆసక్తిగా విన్న వివిధ రాష్ట్రాల అధికారులు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఆర్బీకే విధానం తమ రాష్ట్రాల్లో అమలుకు కృషి చేస్తామని ప్రకటించారు. త్వరలోనే ఏపీలో పర్యటించి క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తామన్నారు. అనంతరం రమేష్‌ చంద్‌ మాట్లాడుతూ.. తాను స్వయంగా ఆర్బీకేలను పరిశీలించానని, వాటి సేవలు బాగున్నాయని తెలిపారు. వీటిని తప్పనిసరిగా అన్ని రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేయాలన్నారు. ఈ–క్రాప్, ఈ–కేవైసీ సేవలు అద్భుతమని కొనియాడారు. కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్‌ సెక్రటరీ ప్రమోద్, ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ చేవూరు హరికిరణ్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు  పాల్గొన్నారు.

ఇదీ చదవండి: బాబు ‘అప్పు’డే  లెక్క తప్పారు

మరిన్ని వార్తలు