ముందు చూపుతో కోవిడ్‌ కట్టడి

28 Nov, 2020 03:27 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్‌ కితాబు

రాష్ట్రవ్యాప్తంగా క్వారంటైన్‌ కేంద్రాలు

గ్రామ, వార్డు వలంటీర్ల ఇంటింటి సర్వే

అనుమానితులకు పెద్దసంఖ్యలో పరీక్షలు

ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని ల్యాబ్‌ల వినియోగం

ఆస్పత్రుల్లో భారీ ఎత్తున మౌలిక సదుపాయాలు

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. ముందు చూపుతో వ్యవహరించి వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసిందని అభినందించింది. వివిధ రాష్ట్రాల్లో కోవిడ్‌ నివారణ, ఉపశమన చర్యలపై నీతి ఆయోగ్‌ నివేదికను రూపొందించింది.

► రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే కరోనాపై దృష్టిసారించింది.
► రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, జిల్లాల పరిపాలన యంత్రాంగం, పోలీసులు సమన్వయంతో పనిచేశారు.
► రాష్ట్రవ్యాప్తంగా క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌గా తేలినవారిని ఆస్పత్రులకు తరలించారు.
► ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించి అనుమానితులను క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచారు.
► రెండు ప్రత్యేక యాప్‌ల ద్వారా వ్యక్తుల కదలికలపై నిఘా వేశారు.
► పాజిటివ్‌ వ్యక్తులు కలసిన వారికి కూడా పరీక్షలు నిర్వహించడం ద్వారా వైరస్‌ విస్తరించకుండా చర్యలు తీసుకున్నారు.
► కోవిడ్‌–19 పరీక్షల సామర్థ్యాన్ని రోజురోజుకూ పెంచుకుంటూ వెళ్లారు.
► తొలుత పెద్ద ఎత్తున ట్రూనాట్‌ టెస్టింగ్‌ మిషన్లను తెప్పించారు. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో దక్షిణ కొరియా నుంచి రాపిడ్‌  టెస్ట్‌ కిట్లను కొనుగోలు చేశారు.
► 11 జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ల్యాబొరేటరీలతో పాటు రెండు జిల్లాల్లోని ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల ల్యాబొరేటరీలను పరీక్షలకు ప్రత్యేకంగా వినియోగించారు. 
► ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్‌ రోగుల చికిత్సకు అవసరమైన పడకల ఏర్పాటుతో పాటు ఇతర మౌలిక వసతులను పెద్దయెత్తున సమకూర్చారు.
► గ్రామ, వార్డు వలంటీర్లు విస్తృత సేవలందించారు. ఇంటింటి సర్వే నిర్వహించి వైరస్‌ పాజిటివ్‌ లక్షణాలున్న వారిని ముందుగానే గుర్తించారు. వారికి పరీక్షలు నిర్వహింపజేయడం, హోం క్వారంటైన్‌లో ఉంచడం వంటి చర్యలు తీసుకున్నారు.
► స్వల్ప లక్షణాలతో హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి ఇంటివద్దకే మందులు సరఫరా చేశారు.
► కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు యాప్‌లను అభివృద్ధి చేసింది. ఒక యాప్‌తో హోం క్వారంటైన్‌లోని ప్రతి వ్యక్తి కదలికలు, స్థితిగతులను రియల్‌ టైమ్‌లో పర్యవేక్షించారు. అలాగే మరో యాప్‌తో కోవిడ్‌–19 పాజిటివ్‌ వ్యక్తుల ప్రయాణాల వివరాలను(ట్రావెల్‌ హిస్టరీ) గుర్తించారు. 
► వారువెళ్లిన ప్రాంతాల్లో ఎవ్వరితోనైనా 15 నిమిషాలు కలసి ఉంటే వారికి పరీక్షలు నిర్వహించడం ద్వారా వైరస్‌ విస్తరించకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు.
► హోం క్వారంటైన్‌లోని వ్యక్తులు ఎవ్వరైనా వంద మీటర్లు దాటి వెళితే వెంటనే జిల్లా అథారిటీకి అలెర్ట్‌ పంపించే విధంగా యాప్‌ను అభివృద్ధి చేసి సమర్ధవంతంగా వినియోగించారు.   
► విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు నిర్దిష్ట కాలం పాటు క్వారంటైన్‌లో ఉండేలా ఏర్పాట్లు చేశారు.
► మొబైల్‌ టెస్టింగ్‌ కేంద్రాలు సైతం ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు